కుబేరులు ఎందుకు ఎగిరిపోతున్నారు?

Jul 23 2021 @ 04:18AM

కుబేరులలో అత్యంత అసహ్యకరమైన వ్యక్తి జెఫ్ బెజోస్. అతడి గుండె చప్పుడులో మానవతా సంవేదనలు విన్పించవు. డబ్బుతో సాధ్యమయ్యే ప్రజానుబంధాలు అన్నీ ఆయనకు నిండుగా ఉన్నాయి. కానీ, ఆ అనుబంధాలకు అతడి వైపు నుంచి ఏ మాత్రం అనురాగ స్పర్శ సోకదు. కోట్లకు పడగలెత్తాడు. కానీ, ఇరుగుపొరుగు, విశాల సమాజం పట్ల తనకొక బాధ్యత ఉందనే స్పృహ కన్పించదు; కనీసం ఉందని ఇతరులు అనుకునేలా వ్యవహరిద్దామనే సోయి కూడా చూపడు. ఏకకాలంలో సంపద సంచయిస్తూ, సంవేదనారాహిత్య జీవనశైలిని ఆచరించడంలో అతడి అసాధారణ సామర్థ్యానికి సమీపస్థాయిలోకి రాగలిగేవారు చరిత్రలో అతి కొద్దిమంది మాత్రమే ఉంటారు. 


ఒక శతాబ్దం క్రితం మహా ధనవంతుడు ఆండ్రూ కార్నెగీ (1835–1919) సమ్మెకు దిగిన తన ఉద్యోగులకు బడితెపూజ చేసేందుకు, అవసరమైతే వారిని దెబ్బకు ఠా చేసేందుకు కిరాయి సైన్యాలను నియోగించాడు. అయితే అమెరికాలో ఊరూరా పౌరగ్రంథాలయాల ఏర్పాటుకు ఆ నిర్దయాపరుడు చేసిన దోహదం అంతా ఇంతా కాదు. ఆస్తులు కూడగట్టుకోవడంలో పాల్పడిన పాపాలకు పరిహారంగా ఆ కోటీశ్వరుడు అలా ప్రజాహిత ప్రాయశ్చితం చేసుకున్నాడు. మరి బెజోస్? ఉపకారం అంతడికి ససేమిరా నచ్చటిమాట కదా, మరి అతడి పుణ్యఖాతా ఖాళీగా గాక మరెలా ఉంటుంది? కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో అతడి మాజీ భార్య తన సిరి సంపదలను లోక కల్యాణానికి అపరిమితంగా వినియోగించింది. మహాదాతగా మన్ననలు అందుకుంది. బెజోస్ గత పాతికేళ్ళలో చేసిన సమస్త దానధర్మాలు అతడి ఒకనాటి శ్రీమతి ఒక్క ఏడాదిలో నిర్వహించిన పరోపకార సేవల ముందు వీసమెత్తు కూడా లెక్కలోకి రావు. బెజోస్, ఆయన మాజీ సతీమణి దానశీలతలోని అనంత వ్యత్యాసం ఒక వాస్తవాన్ని చాటుతోంది. అదేమిటనే దానికే వస్తున్నాను. ఒక్క విషయం చెప్పండి: బెజోస్ ఆస్తితో మానవాళికి మేలు జరగాలని మీరు కోరుకుంటున్నారా? మీ సమాధానం అవును అయితే అందుకు మీరు చేయవలసిన మొట్టమొదటి పని బెజోస్ భాగ్యరాశులను అతడి నుంచి స్వాధీనం చేసుకొని తీరడమే! 


2018లో ఒక ఇంటర్వ్యూలో జెఫ్ బెజోస్ ఇలా చెప్పాడు: ‘నా అమెజాన్ సంస్థ ఆదాయాలు అన్నిటినీ అంతరిక్ష యాత్రలోకి మార్చివేయడమే వాటిని వినియోగించే సరైన మార్గం’. గత దశాబ్దంలో మరే సంపన్నుడి నోటి నుంచి వెలువడని మాట అది. సంపన్నుల అంతరంగాన్ని, వారి స్వతస్సిద్ధ నైజాన్ని బహిర్గతం చేసిన అతిశయపూరిత స్వోత్కర్ష బెజోస్ మాట. ఈ మాట బెజోస్ నుంచే వెలువడడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆ వ్యాఖ్యలో పరిపూర్ణ పాశవికత విన్పించడం లేదూ? 20,000 కోట్ల డాలర్లతో ఏం చేస్తారు? వ్యాధులను నయం చేస్తారా? ఆకలిని అంతమొందిస్తారా? పేదరికాన్ని నిర్మూలిస్తారా? కానేకాదు. భోషాణంలోని బంగారు కడ్డీలన్నిటినీ కరిగించి వాడాలంటే స్పేస్ రాకెట్స్ నిర్మించడం ఒక్కటే మార్గం. బుల్లెట్ ప్రూఫ్ గదిలో, పలువురు అంగరక్షకుల పహరాలో ఉండే వ్యక్తి నోటవెలువడిన అమానవీయమైన మాటలవి. అతడి ఖజానాను జనానికి వదిలేయమనండి. అందులోని డబ్బు, బంగారం మరింత సమర్థంగా సద్వినియోగమవుతుందని నిశ్చితంగా చెప్పగలను. మానవత్వం కనీసస్థాయిలోనూ కనబడని వ్యక్తి బెజోస్. మానవభావోద్వేగాలేవీ అతడిలో కానరావు. ఇటువంటి వ్యక్తి అంతరిక్ష యాత్రికుడా? ఏ వెల్గులకీ బెజోస్ ప్రస్థానం? ఇందుకు అతడిని పురిగొల్పినవేమిటి? ప్రేరణ, లక్ష్యం రెండూ నాకు భీతి గొల్పుతున్నాయి. 


ప్రతిదీ అమ్మకానికేనని, దేనినైనా సరే కొనుక్కోవచ్చునని కుబేరులు విశ్వసిస్తారు. డబ్బుతో కొనలేనివి కొన్ని ఉంటాయనే వాస్తవాన్ని వారు అంగీకరించరు గాక అంగీకరించరు. మీరు కావాలనుకున్నవన్నీ కొనుగోలు చేసుకున్నా, ఇంకా ఒకటి మిగిలే ఉంటుంది. జీవితమే ఆ ఒక్కటి. ఈ ధరిత్రిపై ప్రతి ఒక్కరి మనుగడకు అదే ఆలంబన. ఆ జీవితాన్ని పొడిగించుకోవాలనేదే సంపద్వంతులను ప్రలోభపెడుతున్న ప్రగాఢ వాంఛ. తమ సొంత ఆయుష్షుకాలం పెంచుకునేందుకే అపర కుబేరులు నవీన సాంకేతికతల అభివృద్ధికి నిధులు సమకూర్చేందుకు ఆరాటపడుతున్నారు. తాము సంపాదించిన డబ్బును ఈ భూ ప్రపంచంలో వంద సంవత్సరాలలో కూడా ఖర్చు పెట్టడం కష్టం. మీ జీవిత కాలాన్ని మరింత పొడిగించుకునేందుకు అవకాశం ఉన్నప్పుడు, అనంత భాగ్యరాశులను మరింత అనుభవించేందుకు ఆస్కారం ఉన్నప్పుడు ఆ సిరులను ఇతరులకు ఇవ్వడమెందుకు? ఇదీ సంపన్నుల ఆలోచన. భాగ్యచక్రవర్తులు అలా కాక మరెలా ఆలోచిస్తారు? 

అమెరికన్ కుబేరులు స్పేస్‌రేస్‌లో పెట్టుబడులు పెట్టడం కాకతాళీయమేమీ కాదు. వినూత్న సాంకేతికతలపట్ల ఆసక్తితో వారు ఇందుకు ఉత్సాహపడడం లేదు. మానవుడు జయించబోయే విశ్వం తమకొక వ్యాపారావకాశం అనే విశ్వాసం కూడా వారికేమీలేదు. నరకంగా మారిన ఈ భూమి నుంచి వేగంగా బయటపడేందుకు వారు పథకాలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రతి బిలియనీర్ గృహంలో కష్టకాలంలో రక్షణకు ఒక సాయుధ పలాయన గది (ఆర్మర్డ్‌ ఎస్కేప్ రూమ్) ఉంటుంది. అలాగే, సముద్ర విహారం సందర్భంగా వారి నావకు ఏదైనా ప్రమాదం ఏర్పడితే తక్షణమే రక్షించేందుకు ఒక్క ఫోన్‌కాల్‌కు కదిలివచ్చే హెలికాప్టర్లు ఉంటాయి. అదేవిధంగా ఈ ధరిత్రిపై జీవించే పరిస్థితులు దుర్భరమైపోయినప్పుడు సురక్షితనెలవుకు వెళ్ళేందుకు మార్గాంతరంగా అంతరిక్షం అందుబాటులో ఉండగలదని వారు విశ్వసిస్తున్నారు. అసంబద్ధంగా కన్పిస్తున్నదా? అవును, మనలాంటి వారికి ఇది అసంబద్ధమే. ఎందుకంటే ఈ భూమి భవిష్యత్తుతోనే మన మనుగడ ముడివడివుందని మనం సంపూర్ణంగా విశ్వసిస్తాం. కానీ, మానవుని చిరకాల ఆవాసమైన భూమికి ప్రమాదం వాటిల్లితే ఇతర గ్రహాలకు వెళ్ళిపోవచ్చన్నది బిలియనీర్ల ఆలోచనా తీరు. ఆ ఆలోచనా పద్ధతే వారిని అపర కుబేరులను చేసింది. సకల సజీవ ప్రాణులతో మన భవిష్యత్తు ముడివడివుందన్న సత్యం వారికి ఏమాత్రం పట్టని విషయం. ధ్వంసమవుతోన్న ఈ ధరిత్రి నుంచి బయటపడేందుకు ఒక వాహనాన్ని (ఎస్కేప్ వెహికల్) సిద్ధంచేసుకోవాల్సిన సమయం ఆసన్న మైందన్న ఎరుకే వారిని ఆ అత్యాధునిక మదుపులకు పురిగొల్పుతోంది. తన రాకెట్ కంపెనీ ‘బ్లూ ఆరిజన్’ తాను చేస్తున్న ‘అత్యంత ప్రధాన కృషి’ అని బెజోస్ చెప్పడంలో పరమార్థం ఇదే. బెజోస్, ఆయన సహచర కుబేరులు శతాబ్దం క్రితం తొలియాత్రలోనే అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన మహా విలాసవంతమైన ‘టైటానిక్’ నౌకలోని సంపన్న పురుషులవంటివారు. నౌక మునిగిపోతుందని నిర్ధారించుకున్న వెన్వెంటనే లైఫ్ బోట్ (ఆపత్సమయంలో ప్రాణరక్షణకు ఉపయోగించుకునే పడవలు) లోకి దూకేందుకు మహిళలు, బాలలను పక్కకు తోసేసిన పురుషపుంగవులు వారు! 


బెజోస్ ‘న్యూషెపర్డ్’ వ్యోమనౌక ప్రయోగం భవిష్యత్తులో నిత్యకృత్యం కానున్న అంతరిక్ష పర్యాటకానికి ఒక సన్నాహకం, సందేహం లేదు. అయితే అది సంపన్నుల స్వార్థ పరత్వానికి, బాధ్యతారాహిత్యానికి ఒక స్పష్టమైన నిదర్శనం. తాను అంతరిక్షంలోకి ప్రయాణించనున్నట్టు బెజోస్ ప్రకటించగానే, చాలామంది అతడు అక్కడే ఉండిపోతాడని హాస్యాలాడారు. నిజంగా బెజోస్ అక్కడే ఉండిపోయినా అతడిని ఎట్టి పరిస్థితులలోనూ ఈ నేలకు తప్పక తీసుకువచ్చి తీరాలి. ఈ భూ ప్రపంచంలోని ఏ సమస్యల నుంచి బెజోస్ తప్పించుకుంటున్నాడో ఆ కష్టాలు అతడూ తోటి కుబేరులు కల్పించినవే. అటువంటి వారిని అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాం? మన నుంచి దూరంగా ఎలా పోనిస్తాం?. 

హామిల్టన్ నోలాన్ 

(ది గార్డియన్)

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.