వివాదాల్లో ఎందుకు వేలు పెడుతున్నారు?

ABN , First Publish Date - 2022-08-12T09:05:23+05:30 IST

ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటుంటే మీరెందుకు వివాదంలో వేలు పెడుతున్నారు? ఏంటి మీ సమస్య..

వివాదాల్లో ఎందుకు వేలు పెడుతున్నారు?

హైదర్‌నగర్‌ భూములపై 

రాష్ట్ర సర్కారును ప్రశ్నించిన సుప్రీంకోర్టు

ఈ కేసును వేరే ధర్మాసనానికి ఇవ్వండి

రిజిస్ట్రీకి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆదేశం


న్యూఢిల్లీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ‘‘ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటుంటే మీరెందుకు వివాదంలో వేలు పెడుతున్నారు? ఏంటి మీ సమస్య..?’’ అంటూ హైదర్‌నగర్‌ భూముల కేసులో రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. హైదర్‌నగర్‌లోని సర్వే నంబర్‌ 172లో దాదాపు 98 ఎకరాల భూమి తమదేనని గోల్డ్‌స్టోన్‌ కంపెనీ, ఆ కంపెనీ అధినేత గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌ తదితరులు సుప్రీంలో పిటిషన్లు దాఖలుచేశారు. అయితే అవి ప్రభుత్వ భూములని రాష్ట్ర ప్రభుత్వం మరో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణ మురారితో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌ వాదిస్తూ... సదరు భూములన్నీ రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతాయన్నారు. అవి ప్రభుత్వ భూములేనన్న విషయాన్ని తాము నిరూపిస్తామని కోర్టుకు స్పష్టం చేశారు.


దీనిపై ధర్మాసనం... ‘‘అకస్మాత్తుగా ఇప్పుడొచ్చి అవి ప్రభుత్వ భూములని ఎలా అంటారు?’’ అని ప్రశ్నించింది. అన్ని కేసుల్లో తెలంగాణ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి వైద్యనాథన్‌ స్పందిస్తూ... పిటిషన్‌ దాఖలు చేయడంలో తాము ఎలాంటి జాప్యం చేయలేదన్నారు. కాగా, పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ వాదిస్తూ... సదరు భూములు తమవేనని 197 మంది క్లెయిమ్‌ చేయడంతో వివాదం మొదలైందని, చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ... చర్చించడానికి వారు అంగీకరించడం లేదని, న్యాయపోరాటం చేయాలనుకుంటున్నారని అర్థమవుతోందని స్పష్టం చేసింది. ఈ భూములతో ప్రభుత్వానికి సంబంధంలేదని వికాస్‌ సింగ్‌ వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లపాటు ఎలాంటి వైఖరి తీసుకోకుండా ఇప్పు డు పిటిషన్‌ వేయడం సరికాదన్నారు. ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరపడాన్ని వికాస్‌ సింగ్‌ వ్యతిరేకించారు. దీంతో ధర్మాసనం... ‘వాళ్ల పిటిషన్‌లో వాళ్లు వాదనలు వినిపిస్తే మీకేంటి అభ్యంతరం?’ అని ఆగ్రహం వ్యక్తం చేసిం ది. కాగా, ఇక ఈ కేసును తాను విచారించబోనని, వేరే ధర్మాసనం కేసుల జాబితాలో ఈ నెల 23న దీన్ని చేర్చాలని జస్టిస్‌ రమణ రిజిస్ట్రీని ఆదేశించారు.

Updated Date - 2022-08-12T09:05:23+05:30 IST