ఎందుకీ ‘కోతలు!’

ABN , First Publish Date - 2022-02-24T07:32:16+05:30 IST

ఎప్పుడో వారానికో, రెండు వారాలకో ఒకసారి కొద్దిసేపు కరెంటు పోతే... దానికి సాంకేతిక సమస్య కారణం కావొచ్చు! అప్పుడప్పుడు, పీక్‌ టైమ్‌లో కరెంటు పోతే...

ఎందుకీ ‘కోతలు!’

వేస్తారా కేసులు?

‘ఆంధ్రజ్యోతి’ క్షేత్ర స్థాయి పరిశీలనలో ప్రజల చీకటి కష్టాలు

24 గంటలూ నిరంతరాయంగా కరెంటు ఇస్తున్నారట!

వ్యవసాయానికి 9 గంటలు సరఫరా చేస్తున్నారట!

ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ ఉవాచ

కోతలు ఉన్నాయంటే పత్రికలపై కేసులని హెచ్చరిక

వేసవి రాకముందే కరెంటు కష్టాలు నిజంగా నిజం


ఎప్పుడో వారానికో, రెండు వారాలకో ఒకసారి కొద్దిసేపు కరెంటు పోతే... దానికి సాంకేతిక సమస్య కారణం కావొచ్చు! అప్పుడప్పుడు, పీక్‌ టైమ్‌లో కరెంటు పోతే... ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌! ప్రతి రోజూ నిర్దిష్ట సమయంలో కరెంటు పోయి, మళ్లీ ఫలానా సమయానికి వస్తుందని ముందే చెప్పి తీసేస్తే... అవి కరెంటు కోతలు! పేరు ఏదైతేనేం... కరెంటు పోవడమే! జనాన్ని కష్టపెట్టడమే! అయితే... రాష్ట్రవ్యాప్తంగా కంటి రెప్ప వాల్చినంత సేపు కూడా కరెంటు పోవడం లేదని, నిరంతరాయంగా సరఫరా చేస్తూనే ఉన్నామని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ చెప్పారు. వ్యవసాయానికి 9 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తున్నామన్నారు. అంతేకాదు... ‘కరెంటు కోతలు’ అని వార్తలు రాస్తే  కేసులు పెడతామని పత్రికలను హెచ్చరించారు. రాష్ట్రంలో నిజంగానే ఎక్కడా కరెంటు పోవడంలేదా? 24 గంటలూ సరఫరా అవుతూనే ఉందా? ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిన అసలు వాస్తవం ఏమిటి? మచ్చుకు కొన్ని ఉదాహరణలు..  


కోతలతో వెతలు.. అన్నదాత ఆవేదన

పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీలో ‘కరెంటు’ దెబ్బకు రైతులకు కంటిమీద కునుకు కరువైంది. ‘పగటి పూటనే రైతులకు తొమ్మిది గంటల విద్యుత్తు’ అమలు కావడంలేదని రైతులు వాపోతున్నారు. గంటల తరబడి వ్యవసాయానికి కోతలు విధిస్తున్నారంటూ ఇటీవలే సబ్‌ స్టేషన్లను ముట్టిడించి ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేశారు. ‘‘విద్యుత్‌ కోతలతో సాగు నీరందక పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. కరెంట్‌ కోతల విషయాన్ని అధికారులు దృష్టికి తెచ్చినా ప్రయోజనం ఉండటం లేదు. ఆందోళనలు చేసినా పట్టించుకోవడం లేదు. బుధవారం ఉదయం గంటన్నరపాటు కరెంటు ఉంది. 9.30 గంటలకు పోయింది. మధ్యాహ్నం 12.15 గంటలకు వచ్చింది. ఇదేమిటని అడిగితే పైనుంచే కోతలంటున్నారు’’ అని బుట్టాయగూడెం మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన రైతు యంట్రప్రగడ శ్రీనివాసరావు తెలిపారు. 

                                                                                                               - ఒక రైతు చెప్పిన మాట



ఔన

కరెంటు పోవడంపై బుట్టాయగూడెం విద్యుత్‌ శాఖ అధికారులను వివరణ కోరగా... ‘‘వ్యవసాయానికి కొంత మేర లోడ్‌ రిలీఫ్‌ కోసం కోతలు ఉన్నమాట వాస్తవమే. పైనుంచి వచ్చిన ఆదేశాలను మాత్రమే అమలు చేస్తున్నాం. ఇళ్లకు కూడా విడతల వారీగా రోజులో రెండు గంటల కోతలు రిలీఫ్‌ కోసం అమలు చేస్తున్నాం’’ అని అసలు విషయం ఒప్పుకొన్నారు.


గుంటూరులో ఇలా... 

గుంటూరు జిల్లాలో రెండు వారాలుగా అనధికార కోతలు అమలవుతున్నాయి. పట్టణాలను మినహాయించి... గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు పోతోంది. ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ పేరుతో సాయంత్రం ఆరు గంటల నుంచి, రాత్రి 10 గంటల తర్వాత కరెంటు తీసేస్తున్నారు.  ‘‘ప్రతి రోజూ కోతలు ఉండవు. విద్యుత్‌ వినియోగం బాగా పెరిగిన సందర్భాల్లో లోడ్‌ రిలీఫ్‌ కోసం కరెంటు తీసేయాల్సి వస్తోంది’’ అని అధికారులే అంగీకరిస్తున్నారు. గతంలో రెండో శనివారం మాత్రమే ట్రీ కటింగ్‌ కోసం కోత విధించేవారు. అది కూడా ముందురోజే ఫలానా ప్రాంతంలో కరెంటు పోతుందని చెప్పేవాళ్లు. ఇప్పుడు అదేమీ లేదు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన సూర్యలంక బీచ్‌కు కూడా విద్యుత్‌ కోతలు తప్పడంలేదు. రేపల్లె పట్టణంలో ఉదయం 5 నుంచి 6గంటల వరకు కరెంటుపోతోంది. పిడుగురాళ్ల, దాచేపల్లి, మాచవరం మండలాల్లో ఉన్న సున్నం, ముగ్గురాళ్ల మిల్లులకు ప్రతిరోజూ రెండు గంటలపైగా కోత పడుతోంది. వినుకొండ నియోజకవర్గంలో  వ్యవసాయానికి ఒక గంట ఇస్తే మళ్లీ రెండు, మూడు గంటలు నిలిపివేస్తున్నారు. పొన్నూరు మండలంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3గంటల సమయంలో దాదాపు రెండు గంటలపాటు విద్యుత్‌ సరఫరా ఆగిపోతోంది. చిలకలూరిపేట నియోజకవర్గంలో యడవల్లి, కట్టుబడివారిపాలెం గ్రామాల పరిధిలోని గ్రానైట్‌ పాలిషింగ్‌ తదితర పరిశ్రమలకు ప్రస్తుతం ప్రతిరోజూ 5 నుంచి 8 గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నారు. 


ఎప్పుడొస్తుందో తెలియదు

కొంత కాలంగా విధిస్తున్న కరెంట్‌ కోతతో పరిశ్రమ నడపటం కష్టంగా మారింది. ఉత్పత్తి సగానికి పడిపోవటంతో కూలీల సంఖ్యను తగ్గించాల్సి వస్తుంది. బుధవారం మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు కరెంట్‌ కోత విధించారు. నిత్యం కోతలు ఉంటున్నాయి.

                                                    - యానాల గోవిందు, కోళ్లపరిశ్రమ యజమాని, నడికుడి, గుంటూరు జిల్లా


కష్టంగా మిల్లు నిర్వహణ 

కుటుంబాన్ని గడుపుకొంటూ కొంతమందికైనా ఉపాధి చూపవచ్చన్న ఆశతో రైస్‌మిల్లును అద్దెకు తీసుకున్నా. విద్యుత్‌ కోతలతో రైస్‌మిల్లు నడపటమే కష్టంగా ఉంది. రైతులు ఖాళీగా ఉన్న సమయంలో కరెంట్‌ ఉండదు. విద్యుత్‌ ఉన్నప్పుడు రైతులు లేక మిల్లు ఆడించటం భారంగా మారింది.

                                                         - పూసల సత్యనారాయణ, రైస్‌మిల్లు లీజుదారుడు, వేమవరం 



కరెంటు లేక వ్యవసాయమూ కష్టమే

రబీ సీజన్‌లో పదెకరాలలో పంటలు సాగు చేస్తున్నా. రెండు నెలలుగా వ్యవసాయానికి రోజూ రాత్రిపూటే ఇస్తున్న విద్యుత్‌కు పొలాలకు వెళ్లి మోటర్లు ఆన్‌ చేయాలంటే కష్టంగా ఉంది. సాగునీటికి వారబందీ అమలు చేస్తుండటం వల్ల బోర్లపైనే కొంత ఆధారపడాల్సి వస్తుంది. మంగళవారం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య కరెంట్‌ లేదు.                                                             - గోపినీడి రమేష్‌, రైతు, మంగాపురం, గుంటూరు జిల్లా


పని నడవడం లేదు...

మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కరెంటే లేదు. షాపు మూసేశాము. ఇతర సమయాల్లో కూడా ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు తీసేస్తున్నారు. నాతో పాటు పనిచేసే కూలీలు ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది. కరెంటు కోతతో పనిచేయకపోయినా కూలీలకు డబ్బులు చెల్లించాల్సిందే. దీంతో అప్పులపాలవుతున్నాం.

                                                                                               రవి, కార్పెంటర్‌, మడకశిర


కోతలు భరించలేకున్నాం!

నాకున్న ఐదెకరాల పొలంలో కొంత భాగం కరివేపాకు, మరికొంత భాగంలో వేరుశనగ సాగుచేశాను. ప్రస్తుతం పంటలు కోత దశలో ఉన్నాయి. 20 రోజుల ముందు బాగానే ఉండింది. ఇప్పుడు... పగలు, రాత్రి కోటాల్లో మొత్తం కలిపి ఏడు గంటలకు మించి ఇవ్వడం లేదు. స్థానిక విద్యుత్‌శాఖ అధికారులను అడిగితే.. ఓవర్‌లోడు, లోడ్‌ రిలీఫ్‌ అంటున్నారు. 

                                                                                                  - డేగల లక్ష్మయ్య, గుమ్మేపల్లి, 

                                                                                                             శింగనమల మండలం


పిండి మిషన్‌ నడవడంలేదు...

కర్నూలు జిల్లా కోసిగి మండలంలో కరెంటు కోతలే కోతలు! వేసవి రాకముందే ఇదేం పరిస్థితని జనం వాపోతున్నారు. ‘‘బుధవారం సాయంత్రం 4నుంచి 6 గంటల వరకు కరెంటు పోయింది. వారం రోజుల క్రితం రోజుకు 6గంటలపాటు... మధ్యమధ్యలో కోతలు పెట్టారు. విద్యుత్‌ కోత వల్ల పిండి మిషన్‌ నడపలేకపోతున్నాం. విద్యుత్‌ సక్రమంగా అందించకపోగా.. కరెంటు బిల్లులు మాత్రం నెలకు రూ.10వేలు పైగానే వస్తోంది. ఒక్కనెల బిల్లు చెల్లించకపోయినా సరఫరా కట్‌ చేయిస్తున్నారు. ఈ 3నెలల్లో కరెంటు బిల్లులకు రూ. 20 వేలు అప్పు చేశాను’’ అని కోసిగికి చెందిన దళవాయి పార్వతి వాపోయారు. 


నాణ్యమైన విద్యుత్‌ అందడంలేదు

రైతులకు 9 గంటలపాటు విద్యుత్‌ అందడంలేదు. విడతలవారీగానే ఇస్తున్నారు. అదీ నాణ్యమైన విద్యుత్‌ అందకపోవడంతో మోటార్లు కాలిపోతున్నాయి. పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. 

                                                              - కె.జగన్నాథం, సీపీఐ జిల్లా రైతు సంఘం నాయకుడు


చిత్తూరు జిల్లాలో... 

వారం కిందటి వరకు చిత్తూరు జిల్లాలో ఎడాపెడా కరెంటు తీస్తూ వచ్చారు. ఇప్పుడు కొంత మెరుగైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ రోజుకు అరగంటపాటు ఏదో ఒక పేరుతో కరెంటు తీసేస్తున్నారు.


కోతలు భరించలేకున్నాం!

నాకున్న ఐదెకరాల పొలంలో కొంత భాగం కరివేపాకు, మరికొంత భాగంలో వేరుశనగ సాగుచేశాను. ప్రస్తుతం పంటలు కోత దశలో ఉన్నాయి. 20 రోజుల ముందు బాగానే ఉండింది. ఇప్పుడు... పగలు, రాత్రి కోటాల్లో మొత్తం కలిపి ఏడు గంటలకు మించి ఇవ్వడం లేదు. స్థానిక విద్యుత్‌శాఖ అధికారులను అడిగితే.. ఓవర్‌లోడు, లోడ్‌ రిలీఫ్‌ అంటున్నారు. 

                                                                                                    - డేగల లక్ష్మయ్య, గుమ్మేపల్లి, 

                                                                                                               శింగనమల మండలం


సాగుకు నాలుగైదు గంటలే...

కరెంటు ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. వ్యవసాయానికి రోజుకు నాలుగైదు గంటలే ఇస్తున్నారు. సాంకేతిక లోపమని, మరమ్మతులని సాకులు చెబుతున్నారు. కరెంటు ఎప్పుడొస్తుందా అని రాత్రి, పగలు ఎదురుచూడాల్సి వస్తోంది. 

                                                                   - రామాంజనేయులు, రామినేపల్లి, బెలుగుప్ప మండలం


జీతాలు ఇవ్వాల్సిందే..

నా అట్టల ఫ్యాక్టరీలో 20 మంది దాకా పనిచేస్తున్నారు. వారం రోజులుగా విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేదు. దీంతో ప్రొడక్షన్‌ తగ్గిపోయింది. అట్టపెట్టెల కోసం అడ్వాన్సులు ఇచ్చిన కస్టమర్లకు సకాలంలో సరుకు పంపలేకపోతున్నాం. రోజుకు 5 వేల బాక్సులకంటే తక్కువ ఉత్పత్తి చేస్తే గిట్టుబాటు కాదు. నష్టపోవాల్సి వస్తుంది. కరెంటు కోతలు విధిస్తుండటంతో కూలీలు ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది. 

                                                                               - ఆనంద్‌, మడకశిర, అట్టల ఫ్యాక్టరీ యజమాని


అనంతపురం జిల్లా

అనంతపురం జిల్లా అవసరాలకు రోజుకు 17.51 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు అవసరం. కానీ, 15 మిలియన్‌ యూనిట్లకు మించి సరఫరా కావడం లేదు. ఆ లోటును పూడ్చుకునేందుకు స్థానిక విద్యుత్‌ శాఖ అధికారులు ఎడాపెడా కరెంటు తీసేస్తున్నారు. వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్‌ సరఫరా చేయాల్సి ఉండగా.. కొన్ని ప్రాంతాల్లో 7 గంటలు, మరికొన్ని ప్రాంతాల్లో కేవలం 5 గంటలు ఇస్తున్నారు. పరిశ్రమలు, గృహాలకు కూడా కోతలు విధిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏ ప్రాంతంలోనూ నిరంతరాయంగా కరెంటు సరఫరా కావడం లేదు. పెనుకొండ నగర పంచాయతీలో ప్రతి శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2 వరకు మరమ్మతుల పేరుతో గృహాలకు విద్యుత్‌ సరఫరా ఆపేస్తున్నారు. చిలమత్తూరు మండలమంతా రోజూ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య కరెంటు పోతోంది. 


ఇదిగో సాక్ష్యం...

ఇది శ్రీకాకుళం జిల్లా సీతంపేట గిరిజన గ్రామం! బుధవారం సాయంత్రం 6.30 గంటలకు కరెంటు పోయింది. అరగంట తర్వాత వచ్చింది. ఈ కోతలు కొత్తేమీ కాదని, తరచూ జరిగేవే అని స్థానికులు తెలిపారు. ఇక... నరసన్నపేట మండలం జమ్ములో బుధవారం సాయంత్రం 6.40 గంటలకు కరెంటు పోయింది.  పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో బుధవారం సాయంత్రం 6.50 గంటలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దాదాపు ప్రతిరోజూ ఈ సమయంలో కరెంటు పోతూనే ఉందని,  అధికారులను అడిగితే ‘లోడ్‌ రిలీఫ్‌’ అంటున్నారని స్థానికులు తెలిపారు. ఇక జిల్లాలో చాలా గ్రామాల్లో రాత్రి పొద్దుపోయాక కూడా కరెంటు తీసేస్తున్నారు. ప్రధానంగా టెక్కలి డివిజన్‌లో సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, టెక్కలి, మెళియాపుట్టి, పాతపట్నం  మండలాల్లో విద్యుత్‌ కోత అధికంగా ఉంది. 


పారదర్శకత ఏదీ? 

సాంకేతిక కారణాలు, సర్దుబాటు కారణంగా కరెంటు కట్‌ చేయడం నిజం. తెలంగాణలో ఎప్పుడైనా, ఎక్కడైనా కరెంటు తీసేయాల్సి వస్తే... ముందుగానే చెబుతున్నారు. కానీ... ఏపీలో అలా కాదు. రోజువారీ డిమాండ్‌.. సరఫరా వివరాల్లోనూ గోప్యత పాటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జాతీయ, ప్రాంతీయ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌లలో రోజువారీ విద్యుత్తు సరఫరా వివరాలు వెబ్‌సైట్‌లలో కనిపిస్తున్నాయి. కానీ.. రాష్ట్ర ఇంధన శాఖ ఆ స్థాయిలో పారదర్శకత పాటించడంలేదు.


నాగులాపల్లి ఏం చెప్పారంటే...

‘‘రాష్ట్రంలో 24 గంటలూ నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నాం. వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు కరెంటు ఇస్తున్నాం. అయినప్పటికీ...  కరెంటు కోతలు అమలవుతున్నాయంటున్నారు. నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని పలుమార్లు విలేకరుల సమావేశంలో వివరించినా.. పత్రికా ప్రకటనల ద్వారా తెలియజేసినా .. ప్రజల్లో అపోహలు రేకెత్తించే విధంగా కథనాలు రాస్తున్నారు. ఇకపై విద్యుత్‌ కోతలం టూ పత్రికల్లోరాస్తే పరువు నష్టందావా వేస్తాం!’’


కేసీఆర్‌ మీదా వేస్తారా కేసు?

‘‘తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారమవుతుందని అప్పుడు అవాస్తవాలు ప్రచారం చేశారు. ఇప్పుడు తెలంగాణలో 24 గంటలు కరెంటు ఇస్తున్నాం. తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ నంబర్‌ 1. కానీ... ఏపీలో ఇప్పుడు అంధకారం ఉంది’’ అని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇటీవల బహిరంగ సభలోనే అన్నారు. మరి... ఆయనపైనా పరువు నష్టం దావా వేస్తారా? కేసు పెడతారా?

Updated Date - 2022-02-24T07:32:16+05:30 IST