NRI: నార్వేలో భారతీయులు ఎదుర్కొంటున్న ఈ సమస్య గురించి తెలుసా..?

ABN , First Publish Date - 2022-09-02T02:26:37+05:30 IST

చిన్నారుల సంరక్షణకు సంబంధించి పాశ్చాత్య దేశాల్లో చట్టాలు కఠినంగా అమలవుతుంటాయి. ఈ చట్టాలు, వాటి అమలుపై సరైన అవగాహన లేక కొందరు భారతీయులు చిక్కుల్లో పడుతుంటారు. 2008, 2015 మధ్య నార్వే(Norway) ప్రభుత్వం.. భారతీయ జంటలకు(Indians) చెందిన నవజాత శిశువులను బాలల సంరక్షణాలయాలకు తరలించింది.

NRI: నార్వేలో భారతీయులు ఎదుర్కొంటున్న ఈ సమస్య గురించి తెలుసా..?

ఎన్నారై డెస్క్: చిన్నారుల సంరక్షణకు సంబంధించి పాశ్చాత్య దేశాల్లో చట్టాలు కఠినంగా అమలవుతుంటాయి. ఈ చట్టాలు, వాటి అమలుపై సరైన అవగాహన లేక కొందరు భారతీయులు చిక్కుల్లో పడుతుంటారు. 2008, 2015 మధ్య నార్వే(Norway) ప్రభుత్వం.. భారతీయ జంటలకు(Indians) చెందిన 20 నవజాత శిశువులను బాలల సంరక్షణాలయాలకు తరలించింది. అంతేకాకుండా.. మరో 13 మంది భారత సంతతి చిన్నారులు తమ తల్లిదండ్రులకు దూరంగా ప్రభుత్వ సంరక్షణ కేంద్రాల్లోనే ఉంటున్నారు. తల్లిదండ్రుల అనుమతితో నిమిత్తం లేకుండా ప్రభుత్వం పిల్లల్ని బాలల సంరక్షణ కేంద్రాలకు తరలించింది. అక్కడి చట్టాల ప్రకారం.. చిన్నారులకు తల్లిదండ్రుల కారణంగా హాని జరిగే అవకాశం ఉందంటే చాలు ప్రభుత్వం పిల్లల బాధ్యతలను తనే తీసుకుంటుంది. 


గతేడాది డిసెంబర్ 13న నార్వే చైల్డ్ వెల్ఫేర్ సర్వీస్ అధికారులు.. ఆర్యన్(5) అనే భారత సంతతి చిన్నారిని సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఆర్యన్ తండ్రి నార్వేకు చెందిన వారు కాగా.. తల్లి మాత్రం భారతీయ పౌరురాలు. ఆర్యన్ తల్లిదండ్రులు ఆ చిన్నారిపై చేయి చేసుకున్నట్టు ఫిర్యాదు అందడంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ముందుగా అతడు చదువుకుంటున్న స్కూల్లో వాకబు చేశారు. ఆ తరువాత.. ఆర్యన్‌ను తల్లిదండ్రులకు దూరంగా ఉంచడమే సముచితమని నిర్ణయించుకున్నారు. అయితే.. బిడ్డ కోసమని తల్లిదండ్రులు పట్టువిడవకుండా పోరాడటంతో రెండు నెలల తరువాత మళ్లీ పిల్లాడిని ఇంటికి తెచ్చుకోగలిగారు. అప్పటి భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ జోక్యం చేసుకోవడంతో ఈ సమస్య వేగంగా పరిష్కారమైంది. ప్రస్తుతం.. వారు నార్వే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంట్లోనే ఉంటున్నారు. ప్రభుత్వం తదుపరి ఏం నిర్ణయం తీసుకుంటుందో అనే ఆందోళనలో బతుకుతున్నారు. 


నార్వేలో చట్టం ఏం చెబుతోందంటే..

నార్వే చైల్డ్ వెల్ఫేర్ సర్వీసెస్ శాఖ(ఎన్‌సీడబ్ల్యూఎస్- NCWS) డిప్యుటీ డైరెక్టర్ క్రిస్టీన్ యూ స్టైన్‌రెమ్ ప్రకారం.. పిల్లల పట్ల హింసను అక్కడి ప్రభుత్వం ఏమాత్రం సహించదు. పిల్లలు, వారి హక్కులకు సంబంధించి.. నార్వే చాలా స్పష్టమైన చట్టాలను రూపొందించింది. కొన్ని సందర్భాల్లో ఇలాంటి కేసుల్లో ఇబ్బందులు తలెత్తాయి. అయితే.. పిల్లల్ని వారి తల్లిదండ్రులకు దూరంగా తరలించాలా వద్దా అనే అంశంపై నార్వేలో చాలా కచ్చితమైన చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో ప్రభుత్వ నిర్ణయాలను కోర్టుల్లో సవాలు చేయచ్చు’’ అని క్రిస్టీన్ తెలిపారు. అయితే..విదేశీయుల సంస్కృతి, సంప్రదాయాలు, పిల్లల పెంపకంపై ఎన్‌సీడబ్ల్యూఎస్‌కు అవగాహన తక్కువని కొందరు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. చట్టాల అమల్లో పారదర్శకతతో పాటూ విదేశీ సంస్కృతిపై అవగాహనతో ఇటువంటి సమస్యలను నివారించవచ్చని చెబుతున్నారు. 


పిల్లలు, తల్లిదండ్రుల హక్కులకు సమప్రాధాన్యం.. 

పిల్లల సంరక్షణకు సంబంధించిన నార్వే చట్టాలు తల్లిదండ్రుల అభిప్రాయాలకు సమప్రాధాన్యం ఇస్తాయని అక్కడి ప్రముఖ లాయర్ ఒకరు వ్యాఖ్యానించారు. ‘‘చట్టంలోని నిబంధనలు అన్ని అంశాలకు సమప్రాధాన్యం ఇస్తుంది. అయితే.. నిబంధనలు అమలవుతున్న తీరుతో కొన్ని సందర్భాల్లో సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. ‘‘విదేశీయులు అధికారులను పూర్తిస్థాయిలో నమ్మలేకపోతున్నారు. తమ మనసులో ఉన్నా.. స్పష్టంగా చెప్పలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా కొన్ని సందర్భాల్లో వివక్షకు కూడా గురవుతున్నారు.’’ అని ఆయన అన్నారు. నార్వేలోని సాగరిక, అనూప్ భట్టాచార్య 2011లో సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు.  అప్పట్లో అధికారులు వారి కొడుకు(3), కూతురు ఐశ్వర్య(1)ను శిశు సంరక్షణాలయానికి తరలించారు. ఆ తరువాత రెండు నెలల పాటు దర్యాప్తు అధికారులు వారి ఇంటికి వెళ్లివస్తుండేవారు. ‘‘అధికారుల ప్రశ్నలతో అనేక దురభిప్రాయాలు తలెత్తాయి. సమస్యను  అధికారులు మా సంప్రదాయాలు, విలువల దృష్ట్యా విశ్లేషించలేదు. నేను ఏం చెప్పినా దానికి పూర్తి వ్యతిరేకంగా వారికి అర్థమయ్యేది.’’ అని సాగరిక నాటి సంఘటనల చెప్పుకొచ్చారు. అప్పట్లో తాను నార్వేజియన్ భాష మాట్లాడలేకపోవడంతో కొన్ని సమస్యలు వచ్చినట్టు వివరించారు. చాలా సందర్భాల్లో అధికారులతో తాను ఓ అనువాదకుడి సాయంతో చర్చించి ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చారు. 


‘‘తల్లిదండ్రుల ప్రవర్తనను బట్టి వారికి పిల్లలను పెంచడం(Parenting) రాదనే అభిప్రాయానికి అధికారులు వస్తారు. 80 శాతం కేసుల్లో ఇదే జరుగుతోంది’’ అని అప్పట్లో వారికి న్యాయసలహాలు ఇచ్చిన లాయర్ సురన్యా అయ్యర్ తెలిపారు. ‘‘బిడ్డల్ని తల్లిదండ్రులు తమ మంచంపైనే పడుకోపెట్టుకోవడం, చేతులతో ఆహారాన్ని తినిపించడం వంటి పనులను చూస్తే.. నార్వే అధికారులు.. తల్లిదండ్రులకు పిల్లల పెంపకం రాదనే అభిప్రాయానికి వస్తారు’’ అని ఆమె వివరించారు. అయితే.. ఇటీవల కాలంలో  నార్వే అధికారులు అనువాదకుల సాయంతో విదేశీ కుటుంబాలను ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అనువాదకులు పెద్ద సంఖ్యలో అవసరమవుతారని ఎన్‌సీడబ్ల్యూఎస్ డిప్యుటీ డైరెక్టర్ తెలిపారు. ‘‘ఇండియాలో పిల్లలను తల్లిదండ్రుల ఆస్తులుగా చూస్తారు. అయితే.. విదేశాల్లో మాత్రం పిల్లలను పౌరులుగా చూస్తారు. వారికి కొన్ని హక్కులు ఉంటాయి’’ అని నార్వేలోని ఓ భారతీయ జర్నలిస్టు తెలిపారు. నార్వేలో స్థిరపడ్డవారు అక్కడి భాష నేర్చుకున్నట్టే.. పిల్లల పెంపకానికి సంబంధించి అక్కడి నిబంధనలను పాటించాలని పరిశీలకులు చెబుతున్నారు. పిల్లలపై చేయి చేసుకుంటే చిక్కులు తప్పవని హెచ్చరిస్తున్నారు. 




Updated Date - 2022-09-02T02:26:37+05:30 IST