మగ దోమల బుద్ధి కూడా అంతేనట.. పరిశోధనల్లో ఆశ్చర్యకర విషయాలు!

ABN , First Publish Date - 2022-01-02T17:31:59+05:30 IST

దోమలు మన నెత్తిపై తిరుగుతుండటాన్ని మనం..

మగ దోమల బుద్ధి కూడా అంతేనట.. పరిశోధనల్లో ఆశ్చర్యకర విషయాలు!

దోమలు మన నెత్తిపై తిరుగుతుండటాన్ని మనం ఎప్పుడో ఒకప్పుడు గమనించేవుంటాం. దోమలు ఎందుకు అక్కడే తిరుగుతాయోనని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే తలపై తిరిగే దోమలన్నీ మనుషులను కుట్టవని సైన్స్ చెబుతోంది. ఇలా తలపై తిరిగే దోమలలో మగ, ఆడ దోమలు రెండూ ఉంటాయి. ఆ సమయంలో ఆడ దోమలు మానవ రక్తాన్ని పీలుస్తాయి. మరి మగ దోమలకు కుట్టే పనిలేకపోయిప్పటికీ.. అవి మనిషి తలపై ఎందుకు తిరుగుతాయనేదే ఇక్కడున్న పెద్ద ప్రశ్న... దానికి ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.. 

మనిషి తలపై దోమలు ఎందుకు వాలుతాయి?

దీనికి కారణం.. మనిషి శరీరం నుంచి విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్ అని సైన్స్ చెబుతోంది. దోమల మీద చేసిన పరిశోధనల్లో వెల్లడైన వివరాల ప్రకారం.. మనుషులు విడుదల చేసే కార్బన్-డై-ఆక్సైడ్ వాయువులకు దోమలు ఆకర్షితమవుతాయి. ఈ కార్బన్ డై ఆక్సైడ్ కారణంగా దోమలు 10 మీటర్ల దూరం నుంచే మనుషుల ఉనికిని గుర్తించగలవు. మనిషి దగ్గకు చేరుకోగానే ఆడ దోమలు కుట్టడం ప్రారంభిస్తాయి. మెడికల్ ఎంటమాలజీ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన వివరాల ప్రకారం.. మగ దోమలు మనుషుల చుట్టూ తిరగవని ఇప్పటివరకు భావిస్తూ వచ్చారు. అయితే ఇది నిజం కాదని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. మగ దోమలు తమ ఆకలిని తీర్చుకోవడానికి పూల రసంపై ఆధారపడతాయి. మనిషి శరీరంలోని వేడి కారణంగా దోమలు.. మనిషి వెంట్రుకల వైపు ఆకర్షితులవుతాయని మరో పరిశోధన చెబుతోంది.


చెమట కూడా ఒక కారణం

సైన్స్ ఏబీసీ నివేదిక ప్రకారం దోమలు.. మనిషి తలపై తిరగడానికి చెమట కూడా ప్రధాన కారణమని తెలుస్తోంది. రన్నింగ్ చేసేటప్పుడు, వ్యాయామంచేసే సమయంలో లేదా ఏదైనా శారీరక శ్రమ చేసినప్పుడు తలపై చెమట పడుతుంది.  అక్కడ ఉండే వెంట్రుకల కారణంగా చెమట చాలాసేపు అక్కడే ఉండిపోతుంది. ఈ చెమటలో ఒక ప్రత్యేకమైన రసాయనం ఉంటుంది. దీనిని ఆక్టానాల్ అని అంటారు. దోమలు ఈ రసాయనానికి ఆకర్షితమవుతాయి. ఫలితంగా అవి తలపై వాలుతాయి. కాగా జర్నల్ ఆఫ్ మెడికల్ ఎంటమాలజీలో ప్రచురితమైన పరిశోధన వివరాల ప్రకారం మగ దోమలు మనుషులను కుట్టవు. అయినప్పటికీ అవి మనుషుల చుట్టూనే తిరుగుతుంటాయి. ఆడ దోమలు మనుషులను కుట్టేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఆ ఆడ దోమలను వెతుక్కుంటూ మగ దోమలు మనుషుల చుట్టూ తిరిగే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. దీనిపై కచ్చితమైన సమాచారం కోసం మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Updated Date - 2022-01-02T17:31:59+05:30 IST