కోవిడ్ నుంచి కోలుకున్న వారికి కాఫీ వాసనలో తేడా.. కారణం అదేనా?

ABN , First Publish Date - 2022-05-27T21:26:43+05:30 IST

కరోనావైరస్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.

కోవిడ్ నుంచి కోలుకున్న వారికి కాఫీ వాసనలో తేడా.. కారణం అదేనా?

కరోనావైరస్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక, కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు ఇప్పటికీ అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్ వాసనను కోల్పోవడం. కరోనా నుంచి కోలుకుని నెలలు దాటుతున్నా చాలా మంది వ్యక్తులు వాసనలను పసిగట్టలేకపోతున్నారు. ఎందుకంటే వైరస్ మొదట ముక్కులోని ఘ్రాణ గ్రాహకాలపైనే దాడి చేసింది.


కరోనా నుంచి కోలుకున్న చాలా మంది వాసనలను గ్రహించలేకపోవడానికి `పరోస్మియా`అనే ఇన్ఫెక్షన్ కారణం. ఈ ఇన్ఫెక్షన్‌కు గురైన వారికి సుపరిచితమైన వాసనలు కూడా అసహ్యంగా అనిపిస్తాయి. దానికి కారణమేంటో తెలుసుకునేందుకు లండన్‌కు చెందిన స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ, ఫుడ్ అండ్ ఫార్మసీ, యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. అ అధ్యయనం ప్రకారం `పరోస్మియా` అనేది కోవిడ్ కారణంగా తలెత్తిన ఒక ఇన్‌ఫెక్షన్. ఇది మంచి సువాసనలను కూడా వికృతంగా అనిపించేలా చేస్తుంది. 


`2-ఫ్యూరాన్‌మెథనేథియోల్` అనేది బలమైన కాఫీ వాసన కలిగిన రసాయనం. సాధారణ వ్యక్తులకు దీని వాసన చూపించినపుడు దానిని వారు కాఫీ లేదా పాప్‌కార్న్‌గా గుర్తించారు. అయితే, `పరోస్మియా` ఉన్న వారు మాత్రం  దాని వాసన అసహ్యంగా, మురికిగా ఉన్నట్టు చెప్పారు. `కోవిడ్‌కు ముందు ఇలాంటి ఒక ఆరోగ్య సమస్య ఉంటుందని చాలా మంది గుర్తించలేదు. కరోనా వ్యాప్తి తర్వాతే వాసన గ్రహించే శక్తిని కోల్పోవడం గురించి ఎక్కువ మందికి తెలిసింది. కరోనా సోకిన వారిలో 50-65 శాతం మంది వాసన గ్రహించే శక్తిని కోల్పోయార`ని పరిశోధకులు పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-27T21:26:43+05:30 IST