జీహెచ్‌ఎంసీకి ప్రజారోగ్యం పట్టదా..?

May 9 2021 @ 14:25PM

  • వైరస్‌ కట్టడిని పట్టించుకోని సంస్థ
  • ఇంటింటి ఫీవర్‌ సర్వే.. మెడిసిన్‌ కిట్‌లకే పరిమితం
  • ముంబైలో కీలకంగా వ్యవహరించిన అక్కడి కార్పొరేషన్‌

హైదరాబాద్‌ సిటీ : మహమ్మారి మహోగ్రరూపం దాల్చినా.. మహానగరంలో పౌరుల ఆరోగ్యాన్ని ప్రభుత్వ విభాగాలు గాలి కొదిలేశాయి. కట్టడి దిశగా కనీస చర్యలు తీసుకునే ఆలోచన కూడా అధికారులు చేయడం లేదు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం.. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు కృషి చేయాల్సిన జీహెచ్‌ఎంసీ పూర్తిస్థాయిలో చేతులెత్తేసింది. శానిటైజేషన్‌ వరకే మా పని అన్నట్టుగా సంస్థ యంత్రాంగం వ్యవహరిస్తోంది. ఉన్నతస్థాయి ఆదేశాలతో నిర్వహిస్తోన్న ఇంటింటి సర్వేలో భాగస్వాములవుతున్నప్పటికీ ఇతరత్రా విషయాలను అంతగా పట్టించుకోవడం లేదు.  ఏం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది..? విపత్తు వేళ బాధితులకు తోడ్పాటునందించేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి..? వైరస్‌ వ్యాప్తి కట్టడికి పకడ్బందీగా చేపట్టాల్సిన చర్యలేంటి..? అన్నది గ్రేటర్‌ అధికారులకు పట్టడం లేదు. ఉన్నత స్థాయిలో వచ్చిన ఆదేశాల అమలు తప్ప.. ప్రస్తుతం సంస్థలో స్వీయ నిర్ణయాలు తీసుకుంటోన్న వారు లేరు. 


ఏవీ చర్యలు..? 

గ్రేటర్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటించే అధికారులకు తెలుస్తుంది. కేసుల పెరుగుదల..? వైరస్‌ వ్యాప్తి ఎలా జరుగుతుంది..? ఓ ఇంట్లో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయితే.. ఎంత మందిపై ప్రభావం పడుతుందన్నది గుర్తించే అవకాశం జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య శాఖలకు ఉంది. వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయితే.. అతని కుటుంబ సభ్యులతోపాటు సన్నిహితంగా ఉన్న వారు క్వారంటైన్‌లో ఉండేలా చూడాలి. వారికి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులివ్వాలి. పరిస్థితిని బట్టి మెరుగైన వైద్యమందేలా చూడాలి. తద్వారా ఎక్కడికక్కడ వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసే అవకాశముంటుంది. వేల సంఖ్యలో సిబ్బంది ఉన్న జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య శాఖతో కలిసి ఈ పనులు చేసే అవకాశం ఉన్నా.. పట్టించుకోవడం లేదు. ఎవరూ చెప్పలేదు కదా మనకెందుకు..? అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇంటింటి ఫీవర్‌ సర్వే ఇటీవల ప్రారంభమైంది. వైరస్‌ బారిన పడిన వారికి మెరుగైన చికిత్స అవసరమైతే ఎక్కడికి వెళ్లాలి..? బెడ్‌లు అందుబాటులో ఉన్న ఆస్పత్రులేవి..? అన్న సమాచారం మాత్రం ఇచ్చే నాథుడు లేడు. చాలా చోట్ల బెడ్లు లేవని చెబుతుండడంతో.. ఆస్పత్రుల చుట్టూ గంటల తరబడి అంబులెన్స్‌ల్లో తిరిగి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. 

ఎందుకిలా..? 

సంస్థలో ఓ కమిషనర్‌, తొమ్మిది మంది అదనపు కమిషనర్లు, ఆరుగురు జోనల్‌ కమిషనర్లు ఉన్నారు. సర్కిళ్ల వారీగా డిప్యూటీ కమిషనర్లూ పని చేస్తున్నారు. సంస్థలోని ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు కరోనాను అరికట్టేందుకు స్వీయ నిర్ణయాలు తీసుకుంటోన్న దాఖలాలు లేవు.  క్షేత్రస్థాయిలో పర్యటించడమూ అరుదే. ముంబైలో వైద్యారోగ్యం, తాగునీటి సరఫరా, ఆర్టీసీ తదితర సర్వీసులన్నీ కార్పొరేషన్‌ పరిధిలోనే ఉంటాయి. మన దగ్గర పరిస్థితి వేరు. అలా చేయడం అంత సులువు కాదని ఓ అధికారి చెప్పారు.  ‘పై వాళ్లు చెప్పిందే మేం చేస్తాం. సొంత నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేసే పరిస్థితి లేదు’ అని ఓ అదనపు కమిషనర్‌ చెప్పారు. సచివాలయం స్థాయిలోని అధికారుల పెత్తనం మితిమీరడం వల్లే జీహెచ్‌ఎంసీ అధికారులు గిరి గీసుకొని విధులు నిర్వహిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


ముంబైలో ఏం చేశారు..?

వైరస్‌ నిర్ధారిత పరీక్షలు చేయడంతోపాటు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించి క్వారంటైన్‌ చేశారు. వారికీ టెస్ట్‌లు చేసి పాజిటీవ్‌గా నిర్ధారణ అయితే అవసరమైన మందులు, చికిత్స అందించారు. 

ప్రజలు ఆందోళన చెందకుండా 24 గంటలు వారికి అందుబాటులో ఉంటూ అవసరమైన వైద్య సలహాలు, ఇతరత్రా సూచనలు చేశారు. 

నగరంలోని ఏ ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్లు ఉన్నాయి..? వాటిలో ఖాళీగా ఉన్నవి ఎన్ని..? ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ సదుపాయం ఉన్నవెన్ని..? అన్న సమాచారం   ప్రధాన కార్యాలయంలోని మెయిన్‌ వార్డ్‌ రూంకు అనుసంధానించారు. దీంతో ఒక్క క్లిక్‌తో ఏ ఆస్పత్రిలో బెడ్లు ఖాళీగా ఉన్నాయి..? ఏ వార్డు పరిధిలో ఎన్ని కేసులు నమోదవుతున్నాయి..? అన్న సమాచారం తెలిసింది. 


అన్నీ తానైన.. అదనపు కమిషనర్‌

ముంబై కార్పొరేషన్‌లో ఓ అదనపు కమిషనర్‌ (హెల్త్‌) వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ప్రొటోకాల్‌ పాటిస్తూ, టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్‌తోపాటు  కట్టడిని విస్తృతం చేశారు. ఇది సత్ఫలితాలనిచ్చింది. క్రమేణా కేసుల సంఖ్య రెండు రెట్లకుపైగా తగ్గింది. నగరంలో మాత్రం పూర్తి భిన్న పరిస్థితి నెలకొంది. రోజు రోజుకు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.