కీలకమైన GHMC ఆర్థిక పద్దును పక్కన పెట్టారేం.. అసలు కారణం ఇదా..!?

ABN , First Publish Date - 2022-02-28T14:32:41+05:30 IST

హైదరాబాద్‌ మహానగరాభివృద్ధిలో కీలకమైన జీహెచ్‌ఎంసీ ఆర్థిక పద్దు ఆమోదం దిశగా..

కీలకమైన GHMC ఆర్థిక పద్దును పక్కన పెట్టారేం.. అసలు కారణం ఇదా..!?

  • సిద్ధమైనా ఆమోదించని వైనం
  • నవంబర్‌లోనే కమిషనర్‌కు..
  • ముసాయిదా బడ్జెట్‌
  • అయినా స్టాండింగ్‌ కమిటీ.. 
  • కౌన్సిల్‌కు రాలేదెందుకు?
  • రూ.6 వేల కోట్లు దాటనున్న బడ్జెట్‌

హైదరాబాద్‌ సిటీ : హైదరాబాద్‌ మహానగరాభివృద్ధిలో కీలకమైన జీహెచ్‌ఎంసీ ఆర్థిక పద్దు ఆమోదం దిశగా కసరత్తు మొదలు కాలేదు. 2022-23 సంవత్సరానికి సంబంధించిన ముసాయిదా బడ్జెట్‌ ఇంకా స్టాండింగ్‌ కమిటీ ముందుకు రాలేదు. రాష్ట్ర సర్కారు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరమే బల్దియా ఆర్థిక పద్దును ఆమోదించే అవకాశముందని సంస్థ వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక వనరులు, ప్రతిపాదిత అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకొని అధికారులు ముసాయిదా బడ్జెట్‌ను రూపకల్పన పూర్తి చేశారని తెలుస్తోంది. నవంబర్‌లోనే ఆర్థిక విభాగం నుంచి కమిషనర్‌కు ప్రతిపాదనలు చేరాయని అధికారులు చెబుతున్నారు. సంస్థ చట్టం ప్రకారం నవంబర్‌ 10వ తేదీ నాటికి ముసాయిదా బడ్జెట్‌ స్టాండింగ్‌ కమిటీ ముందుంచాలి. కమిటీ ఆమోదం అనంతరం జనవరి 10లోపు కౌన్సిల్‌లో ప్రవేశ పెట్టాలి. గ్రేటర్‌ పాలకమండలి ఆమోదం అనంతరం పద్దును ఫిబ్రవరి 10 నాటికి ప్రభుత్వానికి పంపాలి.


అయితే ఇప్పటి వరకు ముసాయిదా బడ్జెట్‌ స్టాండింగ్‌ కమిటీ ముందుకు రాకపోవడం గమనార్హం. పద్దు సిద్ధమైనా ఉన్నతస్థాయి ఆదేశాల మేరకు తాత్కాలికంగా పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. మార్చి మొదటి వారంలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టే అవకాశముందని చెబుతున్నారు. ఆ తరువాతే జీహెచ్‌ఎంసీ ముసాయిదా బడ్జెట్‌ కౌన్సిల్‌లో చర్చకు రావొచ్చని ఆర్థిక విభాగం అధికారొకరు తెలిపారు.  దీంతో నేరుగా ప్రభుత్వానికి పంపే అవకాశం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ రూ.5,600 కోట్లతో రూపొందించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.6 వేల కోట్లు దాటుతుందని సూత్రప్రాయ అంచనా. ఎస్‌ఎన్‌డీపీ కోసం పద్దులో ప్రత్యేక కేటాయింపులుంటాయని సమాచారం.


కౌన్సిల్‌లో కష్టమవుతుందనా..? 

బడ్జెట్‌ ప్రతిపాదనలు ఫిబ్రవరి రెండో వారంలో ప్రభుత్వానికి వెళ్లాల్సి ఉండగా ఎందుకు జాప్యం జరిగిందన్న ప్రశ్నకు అధికార వర్గాలు స్పష్టమైన సమాధానం చెప్పడం లేదు. పద్దు సిద్ధమైనా, స్టాండింగ్‌ కమిటీ, కౌన్సిల్‌ ముందుకు తీసుకు రాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం సభ్యులున్న స్టాండింగ్‌ కమిటీలో పద్దు ఆమోదానికి ఇబ్బంది లేకున్నా, కౌన్సిల్‌లో చర్చించే క్రమంలో ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో వేచి చూసే ధోరణి కనబరుస్తున్నట్టు తెలిసింది. బడ్జెట్‌ ప్రతిపాదనలతో సంబంధం లేకుండా పలుమార్లు కేటాయింపులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారుకు పద్దును ముందే పంపాల్సిన అవసరం లేదన్న నిర్ణయానికి ఉన్నతాధికారులు వచ్చినట్టు తెలిసింది. 


ప్రతిపక్ష బీజేపీ సభ్యులు వివిధ అంశాలకు సంబంధించి గత కౌన్సిల్‌లో నిలదీశారు. ఈ నేపథ్యంలో కౌన్సిల్‌లో బడ్జెట్‌ ముసాయిదాపై చర్చ అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందన్న యోచనతో జాప్యం చేస్తున్నారన్న ప్రచారమూ ఉంది. రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన అనంతరం కౌన్సిల్‌లో ప్రవేశ పెడితే ప్రతిపక్ష సభ్యుల నుంచి అభ్యంతరం ఉండదని అధికార పార్టీ సభ్యులు కొందరు అభిప్రాయపడినట్టు సమాచారం. కౌన్సిల్‌ నిర్వహణలో మేయర్‌ సమర్థవంతంగా వ్యవహరించడం లేదన్న అపవాదు నేపథ్యంలో బడ్జెట్‌ ముసాయిదానూ గతానికి భిన్నంగా మార్చిలో ప్రవేశ పెడుతున్నారని చెబుతున్నారు. కాగా.. కౌన్సిల్‌ సమావేశం నిర్వహణకు సభ్యుల నుంచి ప్రశ్నలు తీసుకున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై చర్చ ఉంటుందా, లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 


చట్టాన్ని ఉల్లంఘించడమే 

బడ్జెట్‌ సమావేశం ఎప్పుడు ఉంటుందని అడిగినా పాలకమండలిలోని కీలక వ్యక్తుల నుంచి సరైన సమాధానం రావడం లేదు. అధికార పార్టీ సభ్యులే చట్టాన్ని ఉల్లంఘించడం దేనికి సంకేతం. ఇప్పటికే ప్రభుత్వానికి పద్దు ప్రతిపాదనలు పంపాలి. కానీ, మేయర్‌ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. కౌన్సిల్‌లో బడ్జెట్‌పై సమగ్ర చర్చ జరగాలి. ప్రజావసరాలకు అనుగుణంగా కేటాయింపులు ఉండాలి. - దేవర కరుణాకర్‌, బీజేపీ కార్పొరేటర్‌

Updated Date - 2022-02-28T14:32:41+05:30 IST