ltrScrptTheme3

ఎందుకింత నిర్లక్ష్యం!

Nov 25 2021 @ 00:18AM

  • నిరుపయోగంగా ప్రభుత్వ భవనాలు
  • వినియోగించక శిథిలస్థితికి 
  • తాత్కాలిక మరమ్మతులు చేస్తే వినియోగంలోకి..
  • చొరవ తీసుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు
  • కళ్లెదుటే  ప్రజాధనం నష్టపోతున్నా అధికారులు,  ప్రజా ప్రతినిధుల్లో చలనం కనిపించడం లేదు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలు నిరుపయోగంగా ఉన్నా వాటి గురించి పట్టించుకోవడం లేదు. వాటిని వినియోగంలోకి తేచ్చేందుకు కనీసం స్పందించడం లేదు.

ఆమనగల్లు : సర్కార్‌ ఆస్తులు నిర్లక్ష్యం పాలవుతున్నాయి. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనాలు నిరుపయోగంగా పడి పనికిరాకుండా పోతున్నాయి. స్వల్ప మరమత్తులు చేసి వినియోగించుకునే అవకాశమున్నా అధికారులు వాటి గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలకు అనుకూలమైన భవనాలు లేవు. వీటిని వినియోగంలోకి తెస్తే ప్రభుత్వ భవనాలు సర్వాంగ సుందరంగా మారతాయి. కానీ, ప్రజాప్రతినిధులు, అధికారులు వాటి గురించి ఆలోచించడం లేదోనన్న చర్చ జోరుగా సాగుతోంది. ఆమనగల్లు మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో గోదాంలు, భవనాలు , క్వార్టర్లు నిరుపయోగంగా పడి శిథిల స్థితికి చేరుకుంటున్నాయి. అప్పట్లో ఈ భవనాలను పంచాయతీ సమితికి, మండల పరిషత్‌ కార్యాలయాలుగా వినియోగించేవాళ్లు. కాల క్రమేణా నిర్వహణలేక ప్రస్తుతం నిరుపయోగంగా పడి పిచ్చి మొక్కలతో నిండిపోయాయి.  అదేవిధంగా రెండుచోట్ల నిర్మించిన మూడు గోదాములను రెండు దశాబ్ధాలుగా వినియోగించడం లేదు. దీంతో గోదాముల పైభాగం రేకులు దెబ్బతిన్నాయి. గోడలు నెర్రెలు వారాయి. దశాబ్దాల క్రితం పంచాయతీ సమితి సిబ్బంది కోసం నిర్మించిన నివాస గృహలు సైతం నిర్వహణ లేక శిథిల స్థితికి చేరాయి. కొన్నింటికి మరమ్మతులు చేసినా మళ్లీ యథాస్థితికి చేరుకున్నాయి. వ్యవసాయ శాఖ కార్యాలయం వెనుక భాగంలో నిర్మించిన గృహనిర్మాణ శాఖ కార్యాలయ భవనం పిచ్చి మొక్కలతో నిండిపోయింది. మండల పరిషత్‌ ప్రధాన ద్వారం పక్కన గెస్ట్‌ హౌస్‌కు మరమ్మతులు చేసినా దానిని కూడా వాడకుండా వదిలేశారు. విద్యుత్‌ కార్యాలయం సమీపంలో ఇరిగేషన్‌ శాఖ కార్యాలయ భవనం కూడా వృథాగా పడి ఉంది. అంగడీ బజారులోని మాంసం విక్రయ కేంద్రం, చేనేత సంఘం భవనాలది కూడా ఇదే పరిస్థితి. కార్యాలయాలు శిథిలావస్థకు చేరడంతో వాటిలోని ఫర్నిచర్‌ కూడా చోరీకి గురైంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రభుత్వ భవనాలు శిథిలం కాకుండా చర్యలు తీసుకొని వాటిలో ప్రభుత్వ కార్యాలయాలను నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.

భవనాలను వినియోగంలోకి తేవాలి

ఆమనగల్లు పట్టణంలో నిరుపయోగంగా ఉన్న భవనాలు, గోదాములను వినియోగంలోకి తేవాలి. వాటికి తాత్కాలిక మరమ్మతులు చేయాలి. ఆ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకోవాలి. గోదాములను వినియోగంలోకి తెస్తే మండల పరిషత్‌కు ఆదాయం సమకూరుతుంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం కూడా  నిల్వ చేయడానికి సౌకర్యంగా ఉంటుంది.

- చెక్కాల లక్ష్మణ్‌, కౌన్సిలర్‌, ఆమనగల్లు 

 ప్రభుత్వానికి నివేదించాం

నిరుపయోగంగా ఉన్న భవనాలు చాలావరకు శిథిలావస్థకు చేరాయి. గోదాములు వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంటే మరమ్మతుల కోసం నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం. అతిథిగృహం ఏర్పాటుకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. శిథిలావస్థకు చేరిన భవనాలు తొలగించి వాటి స్థానంలో కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.

- అనిత విజయ్‌, ఎంపీపీ, ఆమనగల్లు

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.