కందకు లేని దురద కత్తికెందుకు?

ABN , First Publish Date - 2022-02-12T06:23:15+05:30 IST

ఎంఎల్‌సి కవితగారు బిజెపి–మోదీ రైతు వ్యతిరేక విధానాలపై ‘రెట్టింపు కష్టాల్లోకి నెట్టిన మోదీ’ (ఆంధ్రజ్యోతి జనవరి 18) అనే వ్యాసం రాసారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అయోధ్యరెడ్డి ‘రైతులపై కవిత కపట ప్రేమ’...

కందకు లేని దురద కత్తికెందుకు?

ఎంఎల్‌సి కవితగారు బిజెపి–మోదీ రైతు వ్యతిరేక విధానాలపై ‘రెట్టింపు కష్టాల్లోకి నెట్టిన మోదీ’ (ఆంధ్రజ్యోతి జనవరి 18) అనే వ్యాసం రాసారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అయోధ్యరెడ్డి ‘రైతులపై కవిత కపట ప్రేమ’ (ఆంధ్రజ్యోతి ఫిబ్రవరి 4) అనే వ్యాసం ద్వారా మోదీపై తనకున్న భక్తిని చాటుకున్నారు. కవితగారు తన వ్యాసంలో ప్రధానంగా సంక్షేమ ఆర్థిక విధానం, కేంద్ర ప్రభుత్వం–మోదీ రైతు వ్యతిరేక విధానాలపై ఎక్కువ దృష్టి సారించారు. ఒకటి రెండు సందర్భాల్లో తప్ప ప్రతిపక్ష పార్టీల (కాంగ్రెస్‌) ప్రస్తావన పెద్దగా తేలేదు. ‘కందకు లేని దురద కత్తికి’ వచ్చినట్లు నరేంద్ర మోదీ రైతు వ్యతిరేక విధానాలను కవితగారు విమర్శిస్తే దానికి కాంగ్రెస్‌ ప్రతినిధి స్పందించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. తెలంగాణ కాంగ్రెస్‌–బిజెపిల మధ్యగల రహస్య స్నేహబంధాన్ని అయోధ్యరెడ్డి తన వ్యాసం ద్వారా బాహాటంగానే ప్రకటించినట్లయ్యింది.


కాంగ్రెస్‌ ప్రతినిధి తన వ్యాసంలో రైతులు అప్పుల్లో ఉన్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దానిని కవితగారు అంగీకరించారని రాశారు. కవితగారు రైతు బీమా ద్వారా రైతు కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని రాస్తే, దానిని పూర్తిగా వక్రీకరించారు. రైతు బీమా పథకం ద్వారా తెలంగాణలో దాదాపు 70 వేల రైతు కుటుంబాలు ఐదు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని పొందాయని కవితగారు పేర్కొంటే, 72 వేలమంది సహజ మరణాలను, 72 వేలమంది ఆత్మహత్యలుగా వక్రీకరించడం హాస్యాస్పదం.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్ళు గడుస్తున్నా, ఇంకా ఇక్కడ హృదయ విదారక పరిస్థితులు ఉన్నాయని, వాటిని కవిత ప్రస్తావించలేదని చెప్పారు. రాష్ట్రంలో రైతులకు 24 గంటల కరెంటు, సాగు, తాగు నీరు, రైతుబీమా, రైతుబంధుతో పాటు ప్రజా సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా మారిందనేది వాస్తవం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ ప్రభుత్వ పథకాలను పేర్లు మార్చుకొని తమ తమ రాష్ట్రాల్లో అనుసరిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపుగా 45ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణను ఎంతమేరకు అభివృద్ధి పరిచిందో మనకు అనుభవంలో ఉంది. కాంగ్రెస్‌ పార్టీ రైతులకు ఎరువులు పెట్టుబడి అడిగితే టీఆర్‌ఎస్ పార్టీ భయపడుతుందని కాంగ్రెస్‌ ప్రతినిధి ప్రశ్నించారు. రైతులకు పంట పెట్టుబడి కోసం ఖరీఫ్‌, రబీ సీజన్‌లకుగాను ఎకరానికి రూ.10 వేల చొప్పున దాదాపుగా రూ.50 వేల కోట్లను తెలంగాణ ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసిందని కవిత తన వ్యాసంలో స్పష్టం చేశారు. అంతేకాకుండా పంట పెట్టుబడి అంటే ఎరువులు, ఇతర సేద్య దినుసులు అని విస్పష్టంగా తన వ్యాసంలో రాశారు. కాని అయోధ్యరెడ్డి రైతులకు పెట్టుబడి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇస్తలేదని రైతులను గందరగోళంలోకి నెట్టే ప్రయత్నం చేశారు.


అయోధ్యరెడ్డి తన వ్యాసంలో వరి ధాన్యం కొనుగోలు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, విత్తనాలు, మద్దతు ధర.. వీటి గురించి కవిత ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. కాళేశ్వరం తదితర ప్రాజెక్టులవల్ల తెలంగాణ ‘రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా’గా మారింది. వరి ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానానికి చేరుకుంది. కాని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతులు పండించిన వరి పంటను కొనకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చింది. ఈ విషయంలో బిజెపిపై పోరాటానికి టీఆర్‌ఎస్‌తో కలసి రావాల్సిన కాంగ్రెస్‌, బండి సంజయ్‌తో అంటకాగి, అతనితో గొంతు కలిపి తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచే ప్రయత్నం చేయడం దురదృష్టకరం. తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన ప్రత్యామ్నాయ పంటల విధానాన్ని కలిగి ఉంది. దానికి తగ్గట్లుగా వ్యవసాయశాఖ నిరాటంకంగా పనిచేస్తుంది. కనీస మద్దతు ధర గురించి పార్లమెంటులో టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ–కాంగ్రెస్‌ కంటే బలంగా మాట్లాడుతున్నది, ఉద్యమిస్తున్నది.


నల్ల వ్యవసాయ చట్టాలను బిజెపి దేశంలో అమలు చేయకముందే తెలంగాణలో అమలు అయ్యాయని, తెలంగాణ దానికి ప్రయోగశాలగా మారిందని కాంగ్రెస్‌ ప్రతినిధి పచ్చి అబద్ధపు ఆరోపణ చేశారు. ఇది మన కళ్ళ ముందు చరిత్రను వక్రీకరించడం కాదా? తెలంగాణ అసెంబ్లీలో నల్ల వ్యవసాయ చట్టాల బిల్లును ఎవరు ఎప్పుడు ప్రవేశపెట్టారో, ఎప్పుడు ఆమోదించారో, కాంగ్రెస్‌ ప్రతినిధి చెబితే బాగుంటుంది. నల్లచట్టాలను లోక్‌సభలో, రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యతిరేకించింది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా తెలంగాణలోని రోడ్లపై రైతులను కూడగట్టి ధర్నాలు చేసింది. ఇది కళ్ళ ముందున్న వాస్తవం కాదా!


బిజెపి–టిఆర్‌ఎస్‌లు పరస్పరం తిట్టుకోవడం ఉత్తనాటకమని కాంగ్రెస్‌ ప్రతినిధి అంటారు. అయితే 2014–2018 జనరల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఒంటరిగా పోటీచేసి సొంతంగా అధికారంలోకి వచ్చిందన్నది అందరికీ తెలిసిన విషయమే. గత రెండేళ్ళుగా ఎన్‌ఆర్‌సి–సిఎఎ బిల్లు మొదలుకొని, మొన్న నల్ల వ్యవసాయ చట్టాలను టీఆర్‌ఎస్‌ పార్టీ పార్లమెంటులో వ్యతిరేకించింది. మొన్నటికి మొన్న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులకు కనీస మద్దతు ధర కోసం చట్టం తేవాలని ప్రతిపక్ష పార్టీలతో పాటు పార్లమెంటులో ధర్నా చేసింది. దానిలో కాంగ్రెస్‌ పార్టీ కూడా పాల్గొంది కదా! అంతేగాక, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ కంటే బలంగా ప్రాంతీయ పార్టీలను కూడగట్టే పనిలో కేసిఆర్‌గారు ఉన్నారు.


బిజెపి–కాంగ్రెస్‌ పార్టీలు పరస్పర విరుద్ధమైన సైద్ధాంతిక దృక్పథంగల పార్టీలుగా జాతీయ స్థాయిలో మనకు కనిపిస్తాయి. కాని విచిత్రంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం స్నేహబంధం కొనసాగుతుంది. 2018 జనరల్‌ ఎన్నికల్లో నిజామాబాద్‌, కరీంనగర్‌, నల్లగొండ లాంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌–బిజెపిలు పరస్పరం సహకరించుకోవడం ద్వారా గెలుపొందాయి.


కవితగారు మోదీ కార్పొరేట్‌ శక్తుల అనుకూల ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూ, సంక్షేమ ఆర్థిక విధానం దేశంలో అమలుపరచాలని తన వ్యాసంలో సూచించారు. నోబెల్‌ బహుమతి గ్రహీతలు అమర్త్యసేన్, అబిజిత్‌ బెనర్జీలు సంక్షేమ ఆర్థిక విధానాన్ని బలపరుస్తున్నారని, అభివృద్ధి చెందుతున్న భారత్‌ లాంటి దేశానికి అది అవసరమని కవిత చెప్పారు. పన్నుల రూపేణా సమకూరిన డబ్బు 60శాతం అట్టడుగు పేద ప్రజలకు చేరాలని కవితగారు కోరడంలో తప్పేముంది. 2018 సాధారణ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ–కాంగ్రెస్‌ పార్టీ ఆర్థికవేత్త అబిజీత్‌ బెనర్జీ ప్రేరణతో దేశవ్యాప్తంగా పేదలకు నగదుబదిలీ కార్యక్రమాన్ని తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని ఎన్నికల హామీగా ప్రకటించింది. దీనిని అర్థం చేసుకోకుండా కాంగ్రెస్‌ నాయకులు కవితగారిని విమర్శించడం దురదృష్టకరం.


తెలంగాణ–కాంగ్రెస్‌ నాయకులు సంక్షేమ ఆర్థిక విధానాలను సమర్థిస్తారా! లేక మార్కెట్‌ శక్తులకు ఆర్థిక వ్యవస్థను వదిలేసే, కార్పొరేట్లకు ఉపయోగపడే మోదీ ఆర్థిక మోడల్‌ని బలపరుస్తారా! నిర్ణయించుకోవాలి. వారు ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్తలైన సావర్కార్, గోల్వాంకర్‌లను ఆరాధించడం, మోదీ భజన చేయడం మాని గాంధీ, నెహ్రూల తాత్త్విక పునాదులను, దార్శనికతను అర్థం చేసుకొని, రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని బలపరిస్తే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ బలపడుతుంది. బండి సంజయ్‌తో అంటకాగి మోదీ భజన చేస్తే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ బలపడుతుందని అనుకోవడం వారి భ్రమే!

డి. రాజారాం యాదవ్‌

(టిఆర్‌ఎస్‌)

Updated Date - 2022-02-12T06:23:15+05:30 IST