ఇక్కడెందుకు సాధ్యం కాదు?

ABN , First Publish Date - 2022-05-26T09:24:45+05:30 IST

సీపీఎస్‌ రద్దు వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది.

ఇక్కడెందుకు సాధ్యం కాదు?

  • సీపీఎస్‌ రద్దు చేసిన రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ 
  • మూడేళ్లయినా ఏపీ సర్కారు పిల్లిమొగ్గలు 
  • జీపీఎస్‌ పేరిట కపట నాటకానికి సిద్ధం 
  • 2100 సంవత్సరం వరకు కాకిలెక్కల కథలు 
  • 2 లక్షల ఉద్యోగుల కుటుంబాల ఆగ్రహం


(అమరావతి-ఆంధ్రజ్యోతి) : సీపీఎస్‌ రద్దు వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది. ఉద్యోగుల పట్ల రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌  ప్రభుత్వాలకు ఉన్న శ్రద్ధ మన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఉద్యోగ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఉద్యోగుల సామాజిక భద్రత దృష్ట్యా అక్కడి ప్రభుత్వాలు సీపీఎ్‌సను రద్దుచేసి ఓపీఎ్‌సను పునరుద్ధరించాయని గుర్తు చేస్తున్నాయి. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం మాత్రం సీపీఎస్‌ రద్దు తమవల్ల కాదంటూ జీపీఎస్‌ పేరిట కొత్త నాటకానికి తెర తీసిందని, దీంతో ఉద్యోగులపై వైసీపీ ప్రభుత్వానిది కపట ప్రేమని తేలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్‌ రద్దు చేస్తామంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టిన జగన్‌.... మూడేళ్ల తర్వాత జీపీఎస్‌ ప్రతిపాదనలు తీసుకురావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగుల కుటుంబాలు మండిపడుతున్నాయి. ఓట్ల  కోసమే సీపీఎస్‌ రద్దుపై గుడ్డిగా హామీ ఇచ్చారా అని ఉద్యోగులు నిలదీస్తున్నారు. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌  రాష్ట్రాల్లో సీపీఎ్‌సను రద్దు చేస్తే... మన రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నిస్తున్నారు. 


రాజస్థాన్‌లో అలా.... 

ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చిన రాజస్థాన్‌ ప్రభుత్వం సీపీఎస్‌ రద్దుచేసి ఓపీఎస్‌ అమలు చేసింది. 2004 జనవరి ఆ తర్వాత నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్‌ స్కీం అమలు చేస్తున్నట్లు 2022-23 బడ్జెట్‌లో ప్రకటించింది. దీనివల్ల పెన్షన్‌, ఫ్యామిలీ పెన్షన్‌, గ్రాట్యుటీ, కమ్యుటేషన్‌ ఫండ్‌ ప్రయోజనాలు చేకూరి ఉద్యోగులు సామాజికంగా, ఆర్థికంగా బలపడతారని తెలిపింది. ఎన్‌పీఎ్‌సలో చేస్తున్న (సీపీఎస్‌) నెలవారీ మినహాయింపులను ఈ నెల 1 నుంచి ఆపివేసింది. సీపీఎస్‌ ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌ నిలిపివేయడంతో వారికి పెరిగిన వేతనం అందుతోంది. వేతనంలో చేసిన మినహాయింపులను పెన్షన్‌ మెడిక్‌ ఫండ్‌(ఆర్‌జీహెచ్‌ఎస్‌)కి సర్దుబాటు చేసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని పదవీ విరమణ సమయంలో వడ్డీతో సహా జీపీఎ్‌ఫతో కలిపి సీపీఎస్‌ ఉద్యోగులకు చెల్లిస్తామని పేర్కొంది. అదేవిధంగా ఛత్తీస్‌గఢ్‌  ప్రభుత్వం కూడా ఈ నెల 1నుంచి సీపీఎస్‌ ఉద్యోగులు చెల్లించాల్సిన 10శాతం కంట్రిబ్యూషన్‌ను నిలిపివేసింది. 


ఏపీలో ఇలా...  

సీపీఎస్‌ రద్దుపై జగన్‌ హామీ అమలు కాలేదు. ఉద్యోగులను అష్టకష్టాలు పెట్టిన సర్కారు ఇప్పుడు పిల్లిమొగ్గలు వేస్తోంది. మూడేళ్ల తర్వాత చర్చల పేరిట మంత్రుల కమిటీ వేసి చావుకబురు చల్లగా చెప్పించింది. సీపీఎస్‌ అమలు సాధ్యం కాదని... జీపీఎస్‌ అంటూ కొత్త ప్రతిపాదన తెచ్చింది. ఓపీఎస్‌ అమలు దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సవాలుగా పరిణమించిన అంశంగా తయారైందని ఆర్థికమంత్రితో ప్రవచనాలు చెప్పించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్‌ తరాల ఉద్యోగులు, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఓపీఎస్‌ అమలు దుస్సాధ్యమైన అంశంగా పరిణమించిందంటూ 2100 సంవత్సరం వరకు కాకిలెక్కల కథలు అల్లింది. జీపీఎస్‌ అమలుపై ఆలోచించాలంటూ బంతి ఉద్యోగుల కోర్టులోకి నెట్టింది.  


ఎస్‌పీఎస్‌లో లోపాలు 

పెన్షన్‌కి గ్యారెంటీ ఉండదు. ఉద్యోగుల నుంచి కంట్రిబ్యూషన్‌ 10శాతం తప్పనిసరి. 

ఈ పథకంపై కనీసం ప్రతి రెండేళ్లకు ఒకసారి అయినా వాస్తవ నిర్ధారణ మూల్యాంకనం జరిగినట్లు గానీ, ఆచరణాత్మక అం చనా పద్ధతులు గానీ, యంత్రాంగాన్ని గానీ ఏర్పాటు చేసినట్లు సంకేతాలు లేవు. 

ఓపీఎస్‌ వల్ల ఉద్యోగి వేతనంలో 50శాతం ప్రతి నెలా పెన్షన్‌ మొత్తంగా అందుతుంది. ఉద్యోగి నుంచి ఎటువంటి కంట్రిబ్యూషన్‌ ఉండదు. కాలానుగుణంగా పెరిగే డీఆర్‌ అలవెన్సు సౌకర్యం 33శాతం వరకు పెన్షన్‌ కన్వర్షన్‌ ఉంటుంది. 

Updated Date - 2022-05-26T09:24:45+05:30 IST