
ఇటీవలి కాలంలో ఉక్కు ముక్కలా కనిపించే ప్రత్యేకమైన సబ్బులు మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. ఈ సబ్బును స్టెయిన్లెస్ స్టీల్ సబ్బు అంటారు. ఈ సబ్బు వెండి రంగులో ఉంటుంది. సాధారణ సబ్బు ఆకారంలో ఉంటుంది. ఈ సబ్బుకు నురుగు రాదు. వాసన కూడా ఉండదు. మరి ఈ సబ్బులోని ప్రత్యేకత ఏమిటో.. అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సబ్బు మురికిని శుభ్రం చేయడానికి కాదు.. వాసనను తొలగించడానికి పనిచేస్తుంది. అయితే ఈ సబ్బు వాసనను కలిగివుండదు. అయినప్పటికీ మన శరీర దుర్వాసనను తొలగిస్తుంది. మనం ఉల్లిపాయ లేదా వెల్లుల్లిని కట్ చేసినప్పుడు ఆ వాసన మీ చేతికి అంటుకుంటుంది. ఆ వాసన ఈ సబ్బుతో తొలగిపోతుంది.
ఈ సబ్బు ఉక్కుతో చేసినది కావడంతో, ఇది శరీరంపై ఏర్పడిన సల్ఫర్ అణువులను తొలగిస్తుంది. చెడు వాసనను నివారిస్తుంది. దీనితో రుద్దడం ద్వారా శరీరపు వాసన తగ్గుతుంది. ఈ స్టెయిన్లెస్ స్టీల్ సబ్బు వాసనలను తటస్తం చేయడానికి అమైనో ఆమ్లాలతో మిళితం అవుతుంది. ఈ సబ్బును ఉపయోగించడానికి ప్రత్యేక విధానమంటూ ఏమీ లేదు. ఈ సబ్బును కూడా మామూలు సబ్బు మాదిరిగానే రుద్దుకోవాలి. నురుగు రాకపోయినా దానిపై నీటిని ప్రవహింపచేయడం ద్వారా మీ శరీరపు వాసనను తొలగించుకోవచ్చు. ఈ సబ్బు రుద్దుకోవడం వలన సల్ఫర్ అణువులు ఈ సబ్బుకు అంటుకుంటాయి. ఈ సబ్బును శుభ్రం చేయడం అవసరం. ఈ సబ్బు ధర దాని నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఈ-కామర్స్ వెబ్సైట్ల ప్రకారం ఈ సబ్బు రూ.250 నుంచి రూ.500 వరకు ఉంటుంది. దీనిని ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేయవచ్చు.