51 వేల మందికి అమ్మఒడి ఎందుకు ఆపామంటే!

ABN , First Publish Date - 2022-06-28T20:10:04+05:30 IST

ఈ ఏడాది అమ్మఒడి పథకంలో 51వేల మంది తల్లులకు న్యాయం చేయలేకపోయాం. ప్రతితల్లికీ వారి పిల్లలు చదువుతున్న పాఠశాలపై హక్కు, బాధ్యత ఉండేలా మరుగుదొడ్ల, స్కూలు నిర్వహణ నిధి కోసం అమ్మఒడి నుంచి రూ. 2వేలు కేటాయించాం..

51 వేల మందికి అమ్మఒడి ఎందుకు ఆపామంటే!

నిబంధనల కారణంగా ఇవ్వలేకపోయాం

స్కూల్‌ నిర్వహణ కోసం 2 వేలు తగ్గించి ఇచ్చాం

ఇలా ఇస్తే తప్పేంటి? ఎగ్గొట్టే నైజం నాదికాదు

గత మూడేళ్లలో రూ.19618 కోట్లు జమచేశాం

సెప్టెంబరు నుంచి 8వ తరగతికి ట్యాబ్‌లు

శ్రీకాకుళంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

వెంట్రుక కూడా పీకలేరని విపక్షాలపై విసుర్లు


శ్రీకాకుళం, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): ‘‘ఈ ఏడాది అమ్మఒడి పథకంలో 51వేల మంది తల్లులకు న్యాయం చేయలేకపోయాం. ప్రతితల్లికీ వారి పిల్లలు చదువుతున్న పాఠశాలపై హక్కు, బాధ్యత ఉండేలా మరుగుదొడ్ల, స్కూలు నిర్వహణ నిధి కోసం అమ్మఒడి నుంచి రూ. 2వేలు కేటాయించాం. ఇలా ఇస్తే తప్పేంటి? ఎగ్గొట్టే నైజం నాదికాదు’’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఈమూడేళ్ల కాలంలో చదువులకు సంబంధించి అమలుచేస్తున్న పథకాల ద్వారా నేరుగా తల్లుల ఖాతాలో రూ. 19,618 కోట్లను జమచేశామని పేర్కొన్నారు. శ్రీకాకుళం కేఆర్‌ స్టేడియంలో సోమవారం జరిగిన 43,96,000 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,595 కోట్ల నగదును బటన్‌నొక్కి జమచేసే మూడోవిడత అమ్మఒడి కార్యక్రమంలో జగన్‌ పాల్గొన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చినట్టు ఈ సందర్భంగా సీఎం అన్నారు. 


‘‘మనిషి తలరాత మార్చగలిగే శక్తి చదువుకు మాత్రమే ఉంది. అమ్మఒడి పథకం జీవో విడుదల చేసినప్పుడే 75శాతం హాజరు విద్యార్థులకు ఉండాలని పొందుపరిచాం. అయితే 2019-20లో పథకం అమలుచేసినా.. అప్పుడే అధికారంలోకి వచ్చామన్న కారణంతో మినహాయింపు ఇచ్చాం. ఆతర్వాత కొవిడ్‌ కారణంగా తప్పనిసరిగా 2020-21లో మినహాయింపు ఇవ్వాల్సివచ్చింది. 2021 సెప్టెంబరు నుంచి యథావిధిగా పాఠశాలలు పనిచేశాయి. అందుకే నిబంధనలు కచ్చితంగా అమలుచేశాం. దానివల్ల గతంలో పథకం అందుకున్న తల్లుల్లో ఈసారి లబ్ధి పొందలేకపోతున్నారు’’ అని వివరించారు. మ్యానిఫెస్టోలో 95శాతం వాగ్దానాలను అములచేశామని తెలిపారు. ‘‘విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువచ్చేందుకుగాను బైజూ్‌సతో ఒప్పందం కుదుర్చుకున్నాం. శ్రీమంతుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉన్న బైజూస్‌తో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. బైజూస్‌ ద్వారా ప్రత్యేక యాప్‌లతో 4 నుంచి 10 తరగతులకు సులభతరమైన పాఠాలు, యానిమేషన్‌తో కూడిన పాఠాల రూపకల్పన జరుగుతోంది. 2025లో ప్రభుత్వ పాఠశాలల పిల్లలు పరీక్షలు రాసేలా... ప్రతి క్లాస్‌రూమ్‌లో డిజిటల్‌ బోర్డులు ఏర్పాటుచేస్తాం’’ అని తెలిపారు. 


సెప్టెంబరు నుంచి ట్యాబ్‌లు..

ఎనిమిదో తరగతికి వచ్చే విద్యార్థులకు సెప్టెంబరు నుంచి రూ.12వేలు విలువగల ట్యాబ్‌ను అందజేస్తామని, ఇందుకోసం అదనంగా రూ.500 కోట్లను ఖర్చుచేస్తున్నామని జగన్‌ తెలిపారు. ‘‘విద్యాదీవెనలో 21లక్షలమంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ కోసం రూ.8వేల కోట్లు ఖర్చుచేశాం. వసతిదీవెన కోసం రూ.3,329 కోట్లు ఖర్చుచేశాం. కానీ తెలుగుదేశం హయాంలో ముష్టివేసినట్లు అరకొరగా చెల్లించారు. ఇంకా బకాయిలు ఉంచేస్తే మేమొచ్చాక చెల్లించాం. రూ.2,324 కోట్లతో బ్యాగ్‌లు, పుస్తకాలు, షూస్‌ ప్రతి విద్యార్థికీ అందజేస్తున్నాం. ‘నాడు-నేడు’ ద్వారా రూ.నాలుగు వేల కోట్లతో 15,700 స్కూళ్లను బాగుచేశాం. రెండోవిడతలో 22,344 స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నాం.


విద్యారంగం కోసం టీచర్ల జీతాలు కాకుండా రూ.52,600 కోట్లు ఖర్చుచేశాం. 2019 నుంచి ఇప్పటివరకు పరిస్థితులు అందరూ గమనించాలి. మంచిచేసే ప్రభుత్వమిది. అయినా విమర్శలు చేస్తున్నారంటే వారు ఎవరు, వారి ఉద్దేశం ఏమిటనేది ఆలోచన చేయాలి. యుద్ధం నేరుగా జరగడంలేదు. కుయుక్తులతో నడుస్తోంది. మారీచులతో తలపడుతున్నాం. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌, కొన్ని పత్రికలు, చానళ్లు, దత్తపుత్రుడు ఒకవైపు.. నేను ఒక్కణ్ణే ఒకవైపు నిలిచి పోరాడుతున్నాను. నాకు మీరుతోడుగా ఉంటే వీళ్లు వెంట్రుక కూడా పీకలేరు. దుష్టచతుష్ట ప్రచారాన్ని నమ్మవద్దు. మనకు మంచి జరిగిందా లేదా అన్నది కొలబద్దగా తీసుకోండి’’ అని వ్యాఖ్యానించారు.


సీఎం సభలో చిన్నారులకు నరకం

శ్రీకాకుళంలో సీఎం సభను విజయవంతం చేయాలని అధికారులు చేసిన హడావుడి.. చిన్నారులకు నరకం చూపించింది. జనం సభలోకి ప్రవేశించాక చుట్టూ బారికేడ్లు.. ఆతర్వాత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం కార్యక్రమం ముగిశాకే బారికేడ్లను తెరిచారు. విద్యార్థులను, మహిళలను ఈ సభకు రప్పించారు. ఇందుకోసం 300 బస్సులను ఏర్పాటు చేశారు. ఉక్కపోత అధికంగా ఉండడంతో ఇద్దరు విద్యార్థులు స్పృహ తప్పిపోయారు.


కిల్లి కృపారాణికి అవమానం

సీఎం జగన్‌కు స్వాగతం పలికేందుకు హెలీప్యాడ్‌ వద్దకు వచ్చిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి అవమానం జరిగింది. ఆమెను పోలీసులను అడ్డుకున్నారు. సీఎంను కలుసుకునే జాబితాలోఆమె పేరు లేదని చెప్పారు. దీనిపై ఆమె తీవ్ర అసహనానికి గురయ్యారు. పోలీసులతో ఎంతచెప్పినా ఫలితం లేకపోవడంతో ఆమె కంటతడి పెట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకులు, యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తంచేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు.

Updated Date - 2022-06-28T20:10:04+05:30 IST