ఎందుకు స్వామీ, ఈ ‘జాతీయ’ విన్యాసం?

ABN , First Publish Date - 2022-06-16T06:14:03+05:30 IST

ఏమాటకు ఆ మాటే, ఒప్పుకోవచ్చు. కొంచెం మెచ్చుకోవచ్చు. దేశం ప్రస్తుతం ఉన్న స్థితి గురించి కలవరపడి, ఏదైనా చేయాలని తపనపడి, అందుకు పార్టీ సహచరుల అభిప్రాయాలను కెసిఆర్ కోరడం చిన్న విషయం కాదు...

ఎందుకు స్వామీ, ఈ ‘జాతీయ’ విన్యాసం?

ఏమాటకు ఆ మాటే, ఒప్పుకోవచ్చు. కొంచెం మెచ్చుకోవచ్చు. దేశం ప్రస్తుతం ఉన్న స్థితి గురించి కలవరపడి, ఏదైనా చేయాలని తపనపడి, అందుకు పార్టీ సహచరుల అభిప్రాయాలను కెసిఆర్ కోరడం చిన్న విషయం కాదు. జాతీయస్థాయిలో ముఖ్యపాత్ర పోషించాలని ఉన్నదని ఆయన ఎప్పటినుంచో చెబుతున్నదే. మూడో కూటమా, ఫెడరల్ ఫ్రంటా అన్న చర్చ ముగిసి ఇప్పుడు జాతీయపార్టీ ప్రతిపాదన రంగం మీదకు వచ్చింది. ఏలికల ఆలోచనలు అనేకం అనధికారికంగా మీడియాలోకి ప్రవహించినట్టే, జాతీయపార్టీ మాట, దాని పేరుతో సహా గుప్పుమంది. పార్టీ ముఖ్యులు అనుకున్నవారందరినీ కూర్చోబెట్టుకుని, తాను చెప్పింది చెప్పి, ఆలోచించమని చర్చించమని కెసిఆర్ కోరారట. వచ్చే ఆదివారం నాడు జరిగే పార్టీ కార్యవర్గ సమావేశంలో తుది నిర్ణయం అని మొదట అన్నారు, అవుతుందో కాదో అని ఇప్పుడు అంటున్నారు.


మంచీచెడ్డా చెప్పమని నాయకుడు అంటాడే కానీ, నిజంగా చెప్పాలని కోరుకుంటాడా? చెడ్డ చెప్పగలిగే ధైర్యం అనుచరులకు ఉండదు. ప్రజాస్వామికంగా కనిపించే కొలువుకూటంలో అందరూ చిత్తంప్రభువులే. పైగా దేవతావస్త్రాల ధగధగలను, నిగనిగలను కీర్తించడానికి అందరూ పోటీపడతారు తప్ప, రాజుగారితో అసలు నిజం ఎవరు చెబుతారు? కాబట్టి, యథావిధిగా అందరూ, జాతీయ రాజకీయాలలోకి కెసిఆర్ ప్రవేశించవలసిన అగత్యాన్ని, నెరవేర్చవలసిన చారిత్రక కర్తవ్యాన్ని అదే అదనుగా ఏకరువు పెట్టారు. ‘‘జాతీయ పార్టీ అంటే ఏమిటి? ఎన్ని రాష్ట్రాలలో శాఖలు ఉంటాయి, ఇతర రాష్ట్రాలలో మననెవరు కోరుకుంటారు, లోక్‌సభలో పట్టుమని పదిమంది కూడా లేని మనం ఢిల్లీలో తిప్పగలిగే చక్రం వ్యాసం, వ్యాసార్ధం ఎంత?’’ వంటి అప్రియమైన ప్రశ్నలు వేయడానికి ఎవరు సాహసిస్తారు? ప్రత్యామ్నాయ ప్రభుత్వమో, ప్రత్యామ్నాయ పక్షమో కాదు, ప్రత్యామ్నాయ ఎజెండా అన్నారు కదా, ఇప్పుడు ఎజెండా నుంచి పార్టీకి ఎందుకు మారారు అన్న ధర్మసందేహమైనా ఎవరూ అడగలేదు. అందుకే అంటారు, నియంతృత్వాలు పాలకుల ఉద్ఘాటనల ద్వారానో శాసనాల ద్వారానో కంటె, రాజసభల్లోనూ రాజవీధుల్లోనూ నెలకొనే మౌనం ద్వారా ఎక్కువ అమలు జరుగుతాయట.


అంతా బాగుంది, ఏ సమస్యా లేదు అని చెప్పడమే విధేయత అయినప్పుడు, నాయకుడు కూడా పచ్చినిజాలను అనుచరుల నుంచి ఆశించడు. క్షేత్రసమాచారాన్ని మూడో పక్షం ద్వారా తెలుసుకుంటాడు. క్షేత్రస్థాయిలోని సమాచారమూ, ఆ సమాచారంలోని వాస్తవాన్ని అధిగమించడానికి మార్గమూ రెండూ వృత్తి వ్యూహకర్త ప్రశాంత్ కిశోరే అందించాడని, అందులో భాగమే ఈ జాతీయపార్టీ కలకలమని విశ్లేషకులు రాస్తున్నారు, చెబుతున్నారు కానీ, సరైన అన్వయం కుదరడం లేదు. మరీ ఇంత అవకతవక అయిడియా ఇస్తాడా ప్రశాంత్ కిశోర్ అన్న అనుమానం కలుగుతోంది! ఇప్పటికిప్పుడైతే, జాతీయ రాజకీయాలలో కెసిఆర్‌కు, తెలంగాణ రాష్ట్రసమితికి అంగుళం కూడా జాగా లేదు. కెసిఆర్ దగ్గర ఉన్న ఎంపి స్థానాలకు అంతటి కీలక విలువ ప్రస్తుతానికి లేదు. ఒక్క జనతాదళ్ (ఎస్) మినహా ఇతర రాష్ట్రాల నేతలలో కెసిఆర్‌ను పెద్దగా పట్టించుకుంటున్నవారు కూడా లేరు. దళితబంధో, రైతుబంధో తమకు కూడా వస్తే బాగుండునని అనుకునే పొరుగు రాష్ట్ర సరిహద్దు జిల్లాల వారు కొందరు మినహా, జాతీయస్థాయిలో ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వాన్ని అభిమానించేవారు లేరు. ఈ మధ్య మాధ్యమాలలో చేసిన, చేస్తున్న విస్తృత ప్రచారం కారణంగా, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి మీద ఇతరులకు ఆసక్తి జనించి ఉండవచ్చును కానీ, అదేమీ రాజకీయ లాభాన్ని తెచ్చిపెట్టదు. కాంగ్రెస్ వస్తే తాను సమావేశానికి రానని తెగేసి చెప్పడంతో, మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రయత్నాల నుంచి కెసిఆర్ పూర్తిగా దూరం అయినట్టే. కాంగ్రెస్ ఉన్నందున, తనను పిలిచినా వెళ్లేవాడిని కాదని ఢిల్లీ సమావేశానికి ఆహ్వానం అందని అసదుద్దీన్ ఒవైసీ కూడా అన్నారు. తాను వెనకడుగు వేసి అయినా ప్రతిపక్షాలతో కలసి నడవాలని కాంగ్రెస్ నిర్ణయించుకున్నప్పుడు, మమతా బెనర్జీ మెత్తపడ్డారు. బెంగాల్‌లో కాంగ్రెస్ తనకు ఎంత మాత్రం ప్రత్యర్థి కాదని ఆమె భావించి ఉండవచ్చు. కెసిఆర్ మాదిరే గుజరాత్, ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ‘ఆప్’ కూడా సమావేశానికి దూరంగా ఉండి ఉండవచ్చు. బిజెడి సంగతి తెలిసిందే కదా. ఇక వైసిపి, టిడిపి పిలుపుల్లోనే లేవు. రాష్ట్రపతి ఎన్నికలలో గెలుపు ఆశించడం లేదు కానీ, గట్టిపోటీ ద్వారా రేపటి ఎన్నికలకు కావలసిన ఉత్సాహం వస్తుందని ఢిల్లీలో సమావేశమైన బిజెపియేతర పక్షాల ఆలోచన. సరిగ్గా ఈ సమయంలోనే జాతీయ పార్టీ చర్చ ప్రారంభించి, సమానదూరం భావనను పైకి తీసుకువచ్చి, కెసిఆర్ ఏమి ఆశిస్తున్నట్టు?


రాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉండడానికి, లేదా, అవసరమైతే ఎవరో ఒకరికి షరతుల పద్ధతి మీద సమర్థన ఇవ్వడానికి కావలసిన రంగం సిద్ధం చేసుకుంటున్నారా? ఇంత దూరం వచ్చిన తరువాత, ఇంతటి తీవ్రవిమర్శలు చేశాక, తిరిగి బిజెపి అభ్యర్థికి మద్దతు ఇస్తారా? తటస్థంగా ఉండి, బిజెపి, కేంద్ర దర్యాప్తుసంస్థల గురి నుంచి వెసులుబాటు పొందాలనుకుంటున్నారా? తెలంగాణ రాష్ట్రంలో ప్రయత్నిస్తే విజయావకాశాలుంటాయని బిజెపి భావించిన పక్షంలో, ప్రశాంత్ కిశోర్ అంచనాలనే తమకు వారు అన్వయించుకున్న పక్షంలో, కెసిఆర్‌కు, ఆయన పార్టీకి ముప్పుతిప్పలు తప్పవు. జాతీయపార్టీ పెట్టడం ఏదో ఒక మేరకు రక్షణ ఇస్తుందనుకుంటే దానికి మించిన పొరపాటు లేదు. దేశంలోని అతి పురాతన జాతీయపార్టీ అగ్రనాయకుడు రోజుకు పన్నెండుగంటలు ఈడీ దర్యాప్తులో గడపవలసివచ్చిందని గుర్తిస్తే, కేంద్రసంస్థలు ఎంపిక చేసిన వేట నుంచి తనకు ఏ మినహాయింపూ దొరకదని కెసిఆర్ అర్థం చేసుకోగలరు. తెలంగాణలో, ముఖ్యంగా ఒకప్పుడు విప్లవభావాలకు కేంద్రంగా ఉన్న ఉత్తర తెలంగాణలో ఇప్పుడు హిందూత్వ ప్రభావం ఉధృతం అవుతున్నదని వస్తున్న వార్తలు నిజమే అయితే, ఆ ప్రభావాన్ని తగ్గించడానికి తిరిగి తెలంగాణ వాదాన్ని, అది ఇప్పుడు ఏమంత సమర్థంగా పనిచేయదనుకుంటే, దక్షిణాది వాదాన్ని ముందుకు తేవడానికి కెసిఆర్ ప్రయత్నిస్తున్నారా? బిజెపిని సైద్ధాంతికంగా ఎదుర్కొనవలసి రావడం కెసిఆర్‌కు సైద్ధాంతిక అవసరం కాదు, రాజకీయ ఆవశ్యకత. దాన్ని తానొక్కరే ఒంటిచేత్తో చేయగలరా? ప్రజలను విశ్వాసంలోకి తీసుకోకుండా, అనుచరులకు ఏకపక్ష ఉద్బోధలు మాత్రమే చేస్తే తాననుకున్న లక్ష్యం నెరవేరుతుందా? ఆదిత్యనాథ్ లాగా బుల్‌డోజర్లు ప్రయోగించకపోవచ్చును కానీ, గౌరవెల్లిలో జరిగింది చిన్నదేమీ కాదు కదా? జాతీయపార్టీ స్థాపన ద్వారా రాష్ట్రంలో గట్టెక్కాలనుకుంటే, అది ద్రావిడ ప్రాణాయామం లాంటి విన్యాసం. ప్రత్యర్థి కోసం పన్నవలసిన వ్యూహంలో తామే చిక్కుకుపోతే ఎట్లా?


టిఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావాలంటే, తాను బలహీనపడడం దగ్గర నుంచి ప్రత్యర్థులు బలపడడం దాకా అనేక అవరోధాలున్నాయి. అన్నిటికి మించి, సుదీర్ఘకాలం అధికారంలో ఉండడం వల్ల కలిగే వ్యతిరేకత ప్రమాదకరం. దీన్ని అధిగమించాలంటే, కెసిఆర్ తనను అధికారంలోకి ఏది తెచ్చిందో, ఎవరు తెచ్చారో ఒకసారి మననం చేసుకుని, ఈ ప్రయాణంలో ఎక్కడ తేడా వచ్చిందో తెలుసుకోవాలి. జాతీయ చిట్కాలు ఏవీ పనిచేయవు. ఆప్, టిఎంసి, ఎన్సిపి వంటి పార్టీలు ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్నాయంటే, అవి స్వభావంలో ప్రాంతీయ పార్టీలు కావు. వాటిలో కొన్ని కాంగ్రెస్ నుంచి పుట్టుకువచ్చినవి. ఆప్ అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టింది. జాతీయ రాజకీయాలలో నిజంగానే కీలకపాత్ర పోషించిన ఎన్టీయార్ జాతీయపార్టీ పెట్టాలనుకున్నారంటే అర్థం ఉంది. దూరదృష్టి కలిగిన శ్రేయోభిలాషులు, సైద్ధాంతిక సహచరులు ఆ ప్రయత్నం నుంచి ఆయనను విరమింపజేశారు. ప్రాంతీయ ఉద్యమాల నుంచి పుట్టే పార్టీలు జాతీయస్థాయిలోకి విస్తరించిన అనుభవం మనకు లేదు. అన్నాడిఎంకె పేరు మార్చుకుని అఖిలభారత అన్నా డిఎంకె అయినట్టు, టిఆర్ఎస్ కూడా అఖిలభారత తెలంగాణ రాష్ట్రసమితి కావచ్చును కానీ, భారతరాష్ట్ర సమితో, రాజ్యసమితో అయితే, అందులో తెలంగాణ అంశమే ఎగిరిపోతుంది. అదే కదా, కెసిఆర్ రాజకీయ ఉనికికి కీలకం!


కెసిఆర్ ఆలోచనలు ఉండవల్లికి నచ్చవచ్చు, లగడపాటి రాజగోపాల్‌కు కూడా నచ్చవచ్చు. ఒకరు పెద్దగా క్రియాశీలతకు ఆస్కారం లేని స్థితిలో ఉన్నారు. మరొకరు రాజకీయాల నుంచే నిష్క్రమించారు. భారతీయ జనతాపార్టీని ఢీకొనాలనే సంకల్పం కలిగి ఉన్నందుకు కెసిఆర్‌ను అభిమానించేవారు చాలా మంది ఉండవచ్చు. కానీ, అదొక సీరియస్ ప్రయత్నం లాగా కాకుండా, సంచలనాలకు పరిమితమయ్యే విన్యాసమైతే, అసలే అంతంత మాత్రంగా ఉన్న విశ్వసనీయత మరింత ప్రమాదంలో పడుతుంది. జూబ్లిహిల్స్ అత్యాచార సంఘటనలో వైఫల్యం నుంచి దృష్టి మళ్లించడానికే జాతీయపార్టీ అంశాన్ని చర్చలోకి తెచ్చారని కూడా కొందరు అనుకుంటున్నారంటే, అత్యవసరంగా పెంచుకోవలసింది ప్రజావిశ్వాసమే కదా?


కె. శ్రీనివాస్

Updated Date - 2022-06-16T06:14:03+05:30 IST