వైసీపీ శిబిరంలో ఎందుకీ కలవరం!?

ABN , First Publish Date - 2022-05-12T09:21:52+05:30 IST

అద్భుతమైన అబద్ధాలు, అమోఘమైన హామీలను నినాదాలుగా చేసుకొని, ప్లీజ్ ఒక్క ఛాన్స్ అంటూ గద్దెనెక్కారు జగన్. జనానికి పాత ఒక రోత, కొత్త ఒక వింతగా కనిపించడంతో జగన్‌కి పట్టం కట్టారు...

వైసీపీ శిబిరంలో ఎందుకీ కలవరం!?

అద్భుతమైన అబద్ధాలు, అమోఘమైన హామీలను నినాదాలుగా చేసుకొని, ప్లీజ్ ఒక్క ఛాన్స్ అంటూ గద్దెనెక్కారు జగన్. జనానికి పాత ఒక రోత, కొత్త ఒక వింతగా కనిపించడంతో జగన్‌కి పట్టం కట్టారు. వాస్తవాలు ఏమిటో వాళ్ళకు మూడేళ్ళల్లోనే అర్థమైంది. గుప్పిట విప్పే వరకు ఏదైనా రహస్యంగానే కనిపిస్తుంది. విప్పిన తరువాత అందులో ఏమీలేదని ఋజువవుతుంది. మూడేళ్ళ తరువాత జగన్ డొల్లతనం ప్రజలకు తెలిసిపోయింది. తన గుట్టు అవతలివారికి తెలిసిపోయిందని అర్థమైన తర్వాత ఆ మనిషి భయాందోళనలు మాటల్లో ఏదో ఒక రకంగా వ్యక్తమవుతాయి. అందుకే ఈ మధ్య బహిరంగ సభల్లో జగన్ తన మాటల్లో అంతరార్థాన్ని తానే గ్రహించలేక, చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పలేక, ప్రతిపక్షాల విమర్శలకు జవాబిచ్చే శక్తి లేక తిట్ల పురాణం ఎత్తుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తన పరిపాలన పట్ల పెరుగుతున్న వ్యతిరేకత జగన్ కళ్ళల్లో కలవరంగా వ్యక్తమవుతోంది. తమ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధపడుతున్నారన్న విషయం గ్రహించిన జగన్‍లో అక్కసు, అసహనం పెరిగిపోతున్నాయి. అందుకే, తాను ముఖ్యమంత్రిని అన్న విషయం విస్మరించి ‘నా వెంట్రుక కూడా పీకలేరు’ అంటూ ప్రతిపక్షాలపై, మీడియాపై నోరు పారేసుకుంటున్నారు.


ప్రతిపక్షాలు, మీడియా ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎత్తి చూపడం, ప్రజలపక్షాన ప్రశ్నించడం నేరమా? మరి జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు గత ప్రభుత్వంపై సొంత మీడియాలో రాసిన అబద్ధాల రాతల సంగతి ఏమిటి? ప్రతిపక్ష నాయకుడిగా, తానూ, తన మీడియా చేసిన దుష్ర్పచారానికి జగన్‌ రెడ్డి ఏం సమాధానం చెబుతారు?


విద్యుత్‌ సంక్షోభం ఏర్పడి కరెంటు కోతలతో రాష్ట్రం అంధకారంపాలు కావడానికి, విద్యుత్తు చార్జీల పెంపుకు ప్రతిపక్షం, మీడియా కారణమా? మిగులు విద్యుత్‌ ఉన్న రాష్ట్రాన్ని మీకు అప్పగిస్తే నేడు విద్యుత్ కోతలు విధించడాన్ని, పరిశ్రమలకు పవర్ హాలిడే అమలు చేయడాన్ని, ఏడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై రూ.16వేలకోట్ల భారం వెయ్యడాన్ని రెడ్డి ఎలా సమర్థించుకుంటారు? అభివృద్ధి పథంలో పయనిస్తున్న రాష్ట్రం ఇలాంటి దుస్థితికి చేరడానికి, జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు పోవడానికి, రాష్ట్రంలో ఉన్న అధ్వాన్న పరిస్థితులను పక్కరాష్ట్ర మంత్రి ఎత్తి చూపించే పరిస్థితి రావటానికి ప్రతిపక్షాలు, మీడియా కారణమా? అస్తవ్యస్త, కక్షపూరిత విధానాల వల్ల రాష్ట్రంలో ఎవరూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాకపోతే అందుకు ప్రతిపక్షాలు, మీడియా కారణమా? ఒక పత్రిక, ఒక టీవీ ఉంటే చాలు నేటి సమాజంలో ఏ సైద్ధాంతిక భూమిక, ఏ నైతిక విలువలూ లేకుండా అబద్ధాలతో, అభూత కల్పనలతో అధికారంలోకి రావచ్చని నిరూపించిన మీకు ఇతర మీడియా వ్యవస్థలను నిందించే హక్కుందా?


ప్రజాస్వామ్యంలో ఎవరైనా అధికారంలోకి రావచ్చు. కానీ ప్రజల పేరుచెప్పి అధికారంలోకి వచ్చాక రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు బలిపెట్టడం అందరినీ కలసివేస్తోంది. మూడేళ్ళ జగన్ పరిపాలనలో రాష్ట్రానికి చేసిన ప్రయోజనం ఏమిటంటే రూ.4లక్షలకోట్ల అప్పులు, ప్రజలపై సమస్త పన్నులూ పెంచి రూ.80వేల కోట్ల భారం మోపడం, ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేసి రాష్ట్రాన్ని దివాలా అంచుకు నెట్టడం, వ్యవసాయరంగాన్ని సంక్షోభంలోకి నెట్టడం, పారిశ్రామిక రంగ పతనం, విద్యుత్ వ్యవస్థను నాశనం చేసి రాష్ట్రాన్ని చీకట్లో నెట్టడం, నిరుద్యోగం జోలికి వెళ్లకపోవటం, సాగునీటి రంగాన్ని గాలికి వదిలి వెయ్యడం, విద్యారంగంలో ప్రమాణాలు దిగజార్చడం, ప్రజారోగ్యాన్ని పట్టించుకోకపోవడం, సంక్షేమ పథకాలు రద్దు చెయ్యడం... ఇంకా దళితులపై దాడులు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు, ప్రతిపక్షంపై కక్షసాధింపులు, మీడియాపై అణచివేత, సొంత మీడియాకు రాష్ట్ర ఆదాయం దోచిపెట్టడం, న్యాయవ్యవస్థపై విషం కక్కడం.... ఇంతే! ప్రజాభీష్టాన్ని ప్రతిఫలించని జగన్ మూడేళ్ళ పరిపాలనలో నవ్యాంధ్ర నాశనం అయింది. రాష్ట్రం యావత్తు నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయింది. మూడేళ్లలో నాలుగు లక్షల కోట్లు అప్పులు దూసి తెచ్చినా, ప్రజలపై వివిధ రూపాల్లో రూ.80వేలకోట్ల పన్నుల భారాన్ని మోపినా కొత్తగా సృష్టించిన ఆస్తి ఒక్కటీ లేదు. రాష్ట్రంలో ఏ ఒక్క రంగమూ బాగుపడలేదు. పైగా తాను రాష్ట్రానికి మేలు చేస్తుంటే సహించలేక అసూయతో రగిలిపోతున్నారని ఆడిపోసుకోవడం విడ్డూరం.


ఎనిమిదేళ్ళక్రితం రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది ఆంధ్రప్రదేశ్. ఈ దుస్థితికి కారణం మీరు కాదా? ఈ మూడేళ్ళలో ఒక్క అభివృద్ధి పథకానికైనా పునాది రాయి వేసారా? ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా? ఒక్క ఎకరానికి నీరు ఇచ్చారా? 25మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని, ప్రతి జిల్లాను ఒక హైదరాబాద్ చేస్తానని, హోదావస్తే లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని యువతని మభ్యపెట్టారు. అధికారంలోకి వచ్చాక అన్ని విషయాల్లోనూ చేతులెత్తేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలులోకి తెస్తామని హామీ ఇచ్చి ఉద్యోగులను మభ్యపెట్టారు. అధికారంలోకి వచ్చాక కమిటీలతో కాలం వెళ్ళదీస్తున్నారు. అయిదేళ్లలో రాష్ట్రాన్ని మద్యరహితంగా మారుస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు మద్యం ధరలు 90శాతం పెంచి పేదల రక్తాన్ని కాసులుగా పిండుకొంటున్నారు. దశలవారీ మద్య నిషేదం హామీ ఒట్టి బూటకంగా మిగిలిపోయింది. నవరత్నాల పేరుతో చెప్పింది కొండంత, ప్రజలకు దక్కింది గోరంత. మేనిఫెస్టోలో పెట్టిన హామీలు, పాదయాత్రలో చేసిన వాగ్దానాలు అన్నీ అమలు చేసినట్లు అబద్ధాల ప్రకటనలతో ప్రజల కళ్ళకి గంతలు కడుతున్నారు. రైతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మహిళలు... ఇలా ఏ వర్గం వారు ఏ సమస్యపై పోరాడినా దానికి రాజకీయ ఉద్దేశాలను ఆపాదించి బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను పునరావృతం కాకుండా చూస్తామని చెప్పడం ప్రభుత్వ భాధ్యత. అది చెప్పకుండా తెలుగుదేశం వారే కారణమని అలవాటైన ఎదురుదాడి చేస్తున్నారు.


బాధ్యత లేని, భవిష్యత్తు గురించి ఆలోచించటం చేతకాని పాలన వల్లనే రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టింది. గత ఐదేళ్లు అంతర్జాతీయ వేదికలపై ఒక వెలుగువెలిగిన ఆంధ్రప్రదేశ్‌ను  అధోగతి పాలుచేశారు. 70శాతం పూర్తి అయిన పోలవరంపై పీటముడి పడింది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రాణాధారమైన పోలవరంపై నీలినీడలు కమ్ముకొన్నాయి. పోలవరానికి భారీగా నిధులు కోతపెట్టినా కేంద్రాన్ని నిలదీయకుండా మోకరిల్లింది జగన్ ప్రభుత్వం. తన కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. మూడేళ్ళుగా రాష్ట్రంలో సాగునీటి రంగం పడకేసింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. మూడేళ్ళలో ఒక్క ఎకరానికి సాగునీరు ఇచ్చిన దిక్కు లేదు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి లేదు. వైసీపీ టెర్రరిస్ట్ పాలన మూలంగా పారిశ్రామిక రంగం పూర్తిగా పడకేసింది. అనేక పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు పారిపోయాయి. రాష్ట్రంలో చదువుకున్న యువత ఉద్యోగ అవకాశాలు లేక పడుతున్న వేదన అంతులేనిది. ఎన్నికల ముందు లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన జగన్ నిరుద్యోగ యువతను దగా చేశారు. రాష్ట్రంలో ఉన్న సహజ సంపదను దోపిడీ చేశారు. ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారం ఇస్తే ప్రజా శ్రేయస్సును విస్మరించి స్వప్రయోజనాలే ధ్యేయంగా పాలన సాగించిన మీరు రాష్ట్రానికి మంచి చేశారో చెడు చేశారో ఒక్కసారైనా ఆత్మపరిశీలన చేసుకోండి. ప్రజాక్షేత్రంలో మీరు బలహీనపడుతున్న విషయం మీకు స్పష్టంగా అర్థం కావడంతో మీ శిబిరంలో కలవరం మొదలైంది. అందుకే తెలుగుదేశం పొత్తుల గురించి మాట్లాడకపోయినా మీ వందిమాగధులు, మీ సకల శాఖామాత్యులు రెండురోజులుగా పొత్తులపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీ పరిపాలన బ్రహ్మాండం అని మీరే చెప్పుకొంటున్నప్పుడు, 175 సీట్లు గెలుస్తామన్న ధీమా మీకున్నప్పుడు– ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకొంటే మీకెందుకంత బాధ?

యనమల రామకృష్ణుడు

టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు

Read more