ఎన్నికలపై ఎందుకంత తాపత్రయం

ABN , First Publish Date - 2021-01-24T05:32:20+05:30 IST

హెల్త్‌ ఎమర్జెన్సీ సమయంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారా? ఎందుకంత తాపత్రయం.. ఎవరికిచ్చిన హామీ కోసం, ఎవరికి లబ్ధి చేసేందుకు ఇంతలా పట్టు బడుతున్నారు? అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై స్పీకర్‌ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. శ్రీకాకుళంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీతారాం మాట్లాడారు.

ఎన్నికలపై ఎందుకంత తాపత్రయం
మాట్లాడుతున్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం

హెల్త్‌ ఎమర్జెన్సీ సయమంలో అవసరమా?

 ఎవరైనా కరోనా సోకి మరణిస్తే ఎవరిదీ బాధ్యత?

 ఎస్‌ఈసీపై మండిపడిన స్పీకర్‌ తమ్మినేని 

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జనవరి 23: హెల్త్‌ ఎమర్జెన్సీ  సమయంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారా? ఎందుకంత తాపత్రయం.. ఎవరికిచ్చిన హామీ కోసం, ఎవరికి లబ్ధి చేసేందుకు ఇంతలా పట్టు బడుతున్నారు? అని  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై స్పీకర్‌ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. శ్రీకాకుళంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీతారాం మాట్లాడారు. ‘ఎస్‌ఈసీ ప్రెస్‌మీట్‌ చూస్తుంటే ఓ పొలిటికల్‌ ప్రెస్‌మీట్‌ గుర్తొచ్చింది. ఏదో రాసుకుని వచ్చి చదివేసి వెళ్లిపోయారు. ఉద్యోగులు, రాష్ట్ర ప్రజలు ఏమైపోతారన్నది ఆయనకు అక్కర్లేదు.  రాజ్యాంగం ప్రకారం 2018లో జరగాల్సిన  పంచాయతీ ఎన్నికలు 2021లో నిర్వహించడానికి గల ప్రధాన కారకులెవరో ఎస్‌ఈసీయే చెప్పాలి. ప్రస్తుతం కరోనా రెండోదశ తీవ్రంగా ఉంది.  ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడంలో అంతరార్థం ఏమిటో చెప్పాలి. ఎన్నికల కోసం వలస వెళ్లిన వారిని జిల్లాలకు రప్పిస్తారు. వారి ద్వారా కరోనా వైరస్‌ మళ్లీ వ్యాపించే అవకాశముంది. కరోనా సోకి ఎవరైనా మరణిస్తే ఆ బాధ్యత ఎవరు వహిస్తారో ఎన్నికల కమిషనర్‌ వెల్లడించాలి. కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఒకటి, రెండు విడతల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే తప్పేంటి?. మీ హయాంలోనే ఎన్నికలు జరగాలా?.. లేకుంటే జరగవా? ఇది నియంతృత్వ పోకడ కాదా? ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తారా? వారిని బెదిరించే ప్రయత్నాలు చేస్తారా?..  రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ఎన్నికలు నిర్వహించాలని సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని మరిచిపోయారా?. ఎన్నికలు వద్దని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు తెగేసి చెప్పాయి. రేపు పోలీసులు కూడా చెబుతారు. కొద్దిమంది కోసం ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయం సరికాదు. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టాకే  ఎన్నికలు నిర్వహించాలి’ అని స్పీకర్‌ సీతారాం పేర్కొన్నారు.  

Updated Date - 2021-01-24T05:32:20+05:30 IST