వాళ్లే లేనప్పుడు ఈ రాద్ధాంతమెందుకు?

ABN , First Publish Date - 2021-10-14T08:15:38+05:30 IST

డా. ఎం.వి. రమణారెడ్డికి నివాళిగా సెప్టెంబర్‌ 30న ఆంధ్రజ్యోతిలో నేను రాసిన వ్యాసంపై ‘చనిపోయిన వాళ్లపై చెడ్డగా మాట్లాడటం తన సంస్కారం కాద’ని చెబుతూనే చెడుగా స్పందించిన రాజులపల్లి ప్రతాపరెడ్డి క్షణికావేశంలో అలా రాసినట్లు...

వాళ్లే లేనప్పుడు ఈ రాద్ధాంతమెందుకు?

డా. ఎం.వి. రమణారెడ్డికి నివాళిగా సెప్టెంబర్‌ 30న ఆంధ్రజ్యోతిలో నేను రాసిన వ్యాసంపై ‘చనిపోయిన వాళ్లపై చెడ్డగా మాట్లాడటం తన సంస్కారం కాద’ని చెబుతూనే చెడుగా స్పందించిన రాజులపల్లి ప్రతాపరెడ్డి క్షణికావేశంలో అలా రాసినట్లు కనిపిస్తోంది. నేను గానీ, నిఖిలేశ్వర్‌ గానీ, మరొకరు గానీ రాసిన వ్యాసాల్లో రమణారెడ్డి చేశాడని, చేయించాడని చెబుతున్న ఏ హత్యలనూ సమర్థించలేదు. హత్య జరిగిన సమయంలో నేనూ రమణారెడ్డి నేరస్థలానికి 800 పైచిలుకు కిలోమీటర్ల దూరంలోని విశాఖపట్నంలో ఉన్నానని చెప్పడమే నా ఉద్దేశం. సాక్ష్యం చెప్పిన అమ్మాయి మెడికో అని రాయడంలో అగౌరవమేమిటో, ఆడవాళ్లను గౌరవించకపోవడమేమిటో, ఏ భాషలో అలాంటి అర్థం ఉందో ప్రతాపరెడ్డే చెప్పాలి. కాకినాడలో ఉన్న అమ్మాయి ఆ రోజు రాత్రి తాను నాన్న పక్కనున్న మంచంలో పడుకుని ఉన్నానని చెప్పడమే దిగ్ర్భాంతి కాని, తప్పుడు సాక్ష్యం చెప్పడానికి క్షోభించడానికి సంబంధం ఏముంది?


‘ఎలిబీ’ పెట్టుకునే అవకాశాలను నిరూపించగలిగే సాక్ష్యాల సేకరణ అన్ని కేసుల్లోనూ సాధ్యం కాదు. తరిమెల నాగిరెడ్డి గొప్ప వ్యక్తి అని, తన కేసులో డిఫెన్సు సాక్షిగా పిలవాలని రమణారెడ్డి అనుకోకపోవటం ఆయన సంస్కారం. పైగా నాగిరెడ్డి 1976 ఆగస్టులో విచారణ ప్రారంభమైన నాటికే చనిపోయారు. ఎలిబీ ఉండాలని రమణారెడ్డి భావిస్తే ఆ రోజు మంచి అవకాశం ఉంది. ఆ రోజు సాయంత్రం విశాఖ మున్సిపల్‌ స్టేడియంలో వి. రామలింగాచారి అధ్యక్షతన చాలా పెద్ద బహిరంగసభలో నాగిరెడ్డి ప్రసంగించారు. ఆ సభలో మాట్లాడమని నన్ను, రమణారెడ్డిని కూడా నిర్వాహకులు అడిగారు. నేను మాట్లాడాను గాని, రమణారెడ్డి మాట్లాడలేదు. అప్పటికి ఈనాడు దినపత్రిక ఒక్క విశాఖపట్నంలోనే ఉంది. మరుసటి రోజు మొదటి పేజీలో వేదికపై ఉన్న మా ఫోటో ప్రచురితమైంది. ఎలిబీ కావాలనుకుంటే ఇంతకంటే మంచి సాక్ష్యం ఏముంది?


మదనపల్లి స్పిన్నింగ్‌ మిల్‌లో హత్య జరిగిన రోజు ఒకవైపు కార్మికుల సర్వసభ్య సమావేశం జరుగుతుండగా ఎర్రన్న అనే కడుపు మండిన కార్మికుడు టైం కీపర్‌ కృష్ణమూర్తిని చంపాలనుకుని, తనయత్నానికి అడ్డం పడిన వాచ్‌మెన్‌ తల నరికాడు. ఈ హత్యకు రమణారెడ్డికి ఏమాత్రం సంబంధం లేదు. ప్రోత్సహించిందీ లేదు. ఈ విషయం స్పష్టంగా తెలుసు కనుకనే మిల్లు యజమానులు కూడా ఎంత ఒత్తిడి వచ్చినా ఆ ఒక్క ఎర్రన్న పైనే కేసు పెట్టారు.


ఇక రాయలసీమ విషయానికొస్తే చివరివరకూ రమణారెడ్డి ఒకే అభిప్రాయంతో ఉన్నారు. దానికోసమే అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌తో తగాదాపడి శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు విషయానికొస్తే ‘ఇతనిపై విసిగిపోయి అధికారంలో ఉన్న ఆయన పార్టీ ప్రభుత్వమే అప్పీలు చేసింది నిజమా?’ అనే సందేహం వెలిబుచ్చారు. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేసిన సందర్భంలో నేనూ, రమణారెడ్డి చాలాకాలం ఢిల్లీలో ఉన్నాం. లండన్‌ ఉన్న రాం జఠ్మలానితో మాట్లాడి ఆయన్ను న్యాయవాదిగా కుదిర్చింది ఎన్‌టిఆర్‌గారే (1989 చివరిలో). ఆయనతో చెప్పి ఆ అప్పీలు ఉపసంహరించుకునేట్లు చేద్దామని సహచర జమ్మలమడుగు శాసనసభ్యుడు ఎంత ఒత్తిడి చేసినా వ్యక్తిగత సమస్య గూర్చి ఎన్‌టిఆర్‌తో మాట్లాడనని చెప్పిన రమణారెడ్డి సంస్కారం ముందు మీ క్షోభ ఎంత ప్రతాపరెడ్డిగారూ. మీ వెంకట సుబ్బారెడ్డి కుటుంబం పడిన క్షోభ గురించే ప్రస్తావించారే గాని, ఆయన కారణంగా క్షోభపడి, రోడ్డునపడ్డ వేలమంది కార్మికులు, వారి భార్యాపిల్లల ఆకలి బాధల మాటేమిటి?


ఏమైనా మన మధ్య సజీవంగా లేని ఇద్దరు వ్యక్తుల మధ్య న్యాయాన్యాయ సమీక్ష చేయటం సబబు కాదు కనుక వదిలేద్దాం! హత్యా రాజకీయాలు మొదలవ్వకూడదు కానీ, ఒకసారి ప్రారంభమైన తర్వాత మన అనుచరులే మన కంట్రోల్‌లో ఉండరు. రమణారెడ్డి జీవితంలోనూ ఈ హత్యల పరంపరలో ఎక్కువ భాగం ఆయన ప్రమేయం లేకుండా జరిగినవే. కాకుంటే అనుచరుల్ని ఆదుకోవటం తప్పలేదు.


డా. రమణారెడ్డి సాహిత్య కృషిని, తీవ్రమైన అనారోగ్యంతో ఆక్సిజన్‌ సిలిండర్‌ పక్కన పెట్టుకుని కూడా అనితరమైన సాహిత్య కృషి చేశాడనేదే వివిధ పత్రికలలో నివాళి వ్యాసాలు రాసిన అందరి అభిప్రాయం. స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌కి, రాసిన వ్యక్తి భావాలకు మధ్య తేడా తెలియని స్థితిలో ఉన్న ప్రతాపరెడ్డి జ్ఞానం ప్రశ్నార్థకమే.

చెరుకూరి సత్యనారాయణ

Updated Date - 2021-10-14T08:15:38+05:30 IST