ltrScrptTheme3

ఫీల్డ్‌ అసిస్టెంట్లపై కత్తి దూయడమెందుకు?

Oct 19 2021 @ 00:20AM

మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం (‘నరేగా’) లో తెలంగాణ ప్రభుత్వం తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్ల(ఎఫ్ఎ‌) పునర్నియామకం చర్చ మరల తెర మీదికి వచ్చింది. అక్టోబర్ 8న రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ శాసనసభ్యురాలు సీతక్క ప్రసంగిస్తూ, తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను కేసీఆర్ పెద్ద మనసుతో క్షమించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ సమాధానమిచ్చారు. 


2006లో ‘నరేగా’ ప్రారంభమైనప్పటి నుంచి ఎఫ్ఎ వ్యవస్థ అమలులో ఉంది. వీరు స్థానికంగా కార్మికుల నుంచి పనుల డిమాండ్ స్వీకరణ, పని ప్రదేశంలో హాజరు పట్టీ బాధ్యత, పనుల పురమాయింపు తదితర బాధ్యతలు నిర్వహిస్తుంటారు. గ్రామంలో కార్మికులతో ప్రత్యక్షంగా సంబంధం కలిగిఉండే ఏకైక ప్రభుత్వ ప్రతినిధులు ఈ ఫీల్డ్‌ అసిస్టెంట్లే. 


నరేగా పథకం అమలులోకి వచ్చినప్పుడు మొదట్లో రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఫీల్డ్‌ అసిస్టెంట్ల నియామకం జరిగాయి. 2009 తర్వాత ఖాళీ అయిన ఉద్యోగాలకు స్థానిక ఉపాధి హామీ కార్మికుల్లో ఎక్కువగా పని చేసిన వారిని పరిగణనలోకి తీసుకుని అందులో ఒకరిని ఎంపిక చేసేవారు. 2019 నాటికి రాష్ట్రంలో ఉన్న 7,600 ఎఫ్ఎలలో దాదాపు రెండువేల మంది మహిళలు, సుమారు 3,600 మంది ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందినవారు ఉన్నారని అంచనా. ప్రభుత్వం ప్రతి ఏటా జూలైలో ఒక సంవత్సరానికి గాను కాంట్రాక్టు పద్ధతిలో ఎఫ్ఎలను నియమిస్తోంది. వీరికి దాదాపు రూ.10వేల వరకు జీతం చెల్లిస్తారు. 2019 జూలై నెలలో ఎఫ్ఎల కాంట్రాక్టులను పొడిగించకుండా డిసెంబరు వరకు కాలయాపన చేసి, అప్పుడు కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఎఫ్ఎలకు కొన్ని టార్గెట్లను నిర్దేశించింది. ఈ టార్గెట్‌లకు వ్యతిరేకంగా సమ్మె చేయడంతో ప్రభుత్వం మార్చి 2020లో వారిని విధుల నుంచి తొలగించింది.


ఎఫ్ఎల తొలగింపు సమస్యపై స్పందిస్తూ కేసీఆర్ నాలుగు కొత్త వాదనలు ముందుకు తెచ్చారు. మొదటిది– వారిని తొలగించిన తర్వాత రాష్ట్రంలో ‘నరేగా’ నిధుల వినియోగం పెరిగింది, కార్మికులకు ఎక్కువ ఉపాధి కల్పన జరిగింది. రెండవది– గతంలో ఈ పథకం కింద వనరుల కల్పనలో ఘోరమైన అవినీతి జరిగేది, ఇప్పుడు పనుల కల్పన సక్రమంగా జరుగుతున్నది. మూడు– దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పనులు గ్రామ పంచాయతీల కనుసన్నలలో నడుస్తున్నాయి. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా 'నరేగా' అమలులో ఒక సమాంతర వ్యవస్థ నడుస్తున్నది. దీన్ని తొలగించి పథకం అమలు బాధ్యతను పంచాయతీలకు అప్పగించాలి. నాలుగు– అసలు ఎఫ్.ఎ.లు ఉద్యోగులే కాదు. కానీ ఉద్యోగులనే భ్రమలో సమ్మె చేశారు. 


కేసీఆర్ తన మొదటి వాదనలో ఫీల్డ్‌ అసిస్టెంట్ల తొలగింపు తర్వాత ‘నరేగా’ నిధుల వినియోగం పెరిగిందని, ఉపాధి కల్పన పెరిగిందని అన్నారు. కానీ ఇవి అర్ధసత్యాలని గణాంకాలు తెలియజేస్తున్నాయి. నిజానికి వారిని తొలగించిన తర్వాత 2018–19 కంటే 2019–20లో పని దినాలు దాదాపు 10శాతం తగ్గాయి. ఇక 2020–21లో నిధుల వినియోగం, ఉపాధి కల్పన పెరిగిన మాట వాస్తవమే. కానీ ఆ పెరుగుదల కొవిడ్ కారణంగా జరిగింది. ఇది ఒక్క తెలంగాణా రాష్ట్రంలో మాత్రమే గాక దేశవ్యాప్తంగా పని దినాలు సుమారు 39శాతం పెరిగాయి. ఇదే సమయంలో పని దినాల వృద్ధి, తెలంగాణలో 47శాతంగా ఉంది. ఈ పరిస్థితిలో ఎఫ్ఎలను తొలగించడం వలన ‘నరేగా’ అమలు మెరుగు పడిందనటం బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టడమే. కొవిడ్ సమయంలో వలసకార్మికులు స్వగ్రామాలకు తిరిగిరావడం, లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయినవారు ఉపాధి హామీ పథకాన్ని ఆశ్రయించడం... ఇవీ నిధుల వినియోగం పెరగడానికి కారణం.


ఇక గతంలో ‘నరేగా’లో సుస్థిర వనరుల కల్పన జరగలేదన్న కేసీఆర్ వాదనను చూద్దాం. 2019 లో సుస్థిర వనరుల కల్పనలో తెలంగాణా రాష్ట్రం దేశవ్యాప్తంగా ఐదవ స్థానంలో నిలిచిందని సాక్షాత్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించింది. ఇప్పుడు కేసీఆర్ అవన్నీ తప్పని చెబుతున్నారా? అలాగే గతంలో ‘నరేగా’లో భాగంగా లక్షల ఫార్మ్ పాండ్స్ నిర్మించినట్లు, హరిత హారం కింద లక్షలాది మొక్కలను నాటినట్లు కేసీఆర్ స్వయంగా ఇచ్చిన ప్రకటనలను వాపసు తీసుకుంటున్నారా అన్నది స్పష్టం చేయాలి. 


‘నరేగా’ వ్యవస్థ పంచాయతీరాజ్‌కు సమాంతర వ్యవస్థగా పని చేస్తుంది, తద్వారా పంచాయతీలకు సంక్రమించిన అధికారాలను కాలరాస్తుందన్న అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తపరిచారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం, సెక్షన్ 16(1) ప్రకారం గ్రామ సభ, వార్డుసభ సూచనల మేరకు గ్రామ పంచాయతీలో చేపట్టాల్సిన ప్రాజెక్టు పనులను అమలు చేసి పర్యవేక్షించే బాధ్యత గ్రామ పంచాయతీలదే. ఈ గ్రామసభలకు సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. కానీ తెలంగాణలో గ్రామసభలు తూతూ మంత్రంగా నడుస్తున్నాయి. ఎంపిక చేయాల్సిన పనుల జాబితాలు ముందుగానే పై స్థాయిలో నిర్ణయిస్తున్నారు. గ్రామ సభలో పాల్గొన్నవారు ఆ జాబితాను ఆమోదిస్తారు తప్ప గ్రామానికి అవసరమైన పనులు ఏమిటన్న విషయంపై సీరియస్ చర్చ జరగదు. గతంలో, ఉపాధి హామీ పథకంలో చేపట్టబోయే పనుల గురించి గ్రామసభల ప్రక్రియతో సంబంధం లేకుండా కేసీఆర్ చేసిన ప్రకటనలు ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. 


ప్రభుత్వం ఒకవైపు పనుల ఎంపికలో గ్రామ సభల అధికారాలను కాలరాస్తూనే, మరో వైపు గ్రామ పంచాయతీ అధికారాలను నరేగా గౌరవించలేదనడం ఏమి న్యాయం? అలాగే సర్పంచులు అధ్యక్షత వహిస్తున్న సోషల్ ఆడిట్, గ్రామసభలు అవినీతిని నిర్ధారించి అధికారుల నుంచి రికవరీలు, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలూ సిఫారసు చేస్తే వాటిని అధికార స్థాయిలో తిరస్కరించడం పంచాయతీల బలాన్ని ఎలా పెంచుతుందో ఏలినవారే చెప్పాలి. 


ఫీల్డ్ అసిస్టెంట్లు అసలు ఉద్యోగులే కారని, వారికి సమ్మె హక్కు లేదని అనడం ద్వారా కాంట్రాక్టు ఉద్యోగులకు తమ పాలనలో ఎలాంటి హక్కులు లేవని కేసీఆర్ స్పష్టం చేసినట్లయింది. సమ్మె అనేది రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కు అన్న విషయాన్ని రాష్ట్ర సాధనలో ఉద్యమ నాయకునిగా కీలక పాత్ర పోషించిన కేసీఆర్‌కి గుర్తు చేయాల్సిరావడం విషాదం.


దేశంలో ‘నరేగా’ అమలులో తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉండడంలో ఎఫ్ఎల పాత్ర కాదనలేనిది. అయితే రాష్ట్రంలో రూ.4వేల కోట్ల పైచిలుకు ఖర్చు జరుగుతున్న ఉపాధి హామీ పథకంలో తమ పార్టీకి చెందినవారు ఎఫ్ఎలుగా లేకపోవడం తెరాస నాయకత్వానికి కంటగింపుగా మారినట్లుగా అగుపిస్తోంది. నిజానికి పంచాయతీలకు, ఉపాధి హామీ పథకం అమలులో ఎక్కువ పాత్ర ఇవ్వదలచుకుంటే ఎఫ్ఎలను కొనసాగిస్తూ కూడా ఆ పని కొనసాగించవచ్చు. కానీ అలా చేయకుండా వారిని తొలగించడానికి అర్థం లేని వాదనలు తెరమీదికి తెస్తున్నట్లు పై చర్చతో అర్థమవుతోంది. 


2014లో కొత్తగా ఎన్నికైన మోదీ ప్రభుత్వం, ఉపాధి హామీ పథకాన్ని అటక మీదికి ఎక్కించడానికి ప్రయత్నాలు చేసినప్పుడు, ఆ ప్రయత్నాలను వ్యతిరేకించడంలో కేసీఆర్ చొరవ తీసుకున్నారు. అలాంటి కేసీఆర్ నేడు కేవలం తమ పార్టీ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యమనుకునే నాయకుడిగా మిగిలిపోతారా లేక సామాజిక న్యాయం కోసం ‘నరేగా’ కార్మికుల తరపున నిలబడి ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటారా అన్నది త్వరలో తేలిపోతుంది. 

అజయ్ పల్లె స్వేరో

చక్రధర్ బుద్ధ

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.