TRS Plenaryకి కల్వకుంట్ల కవిత ఎందుకు రాలేదు.. కారణాలేంటి.. కనీసం ఫ్లెక్సీల్లో కూడా కనిపించలేదేం.. అసలేం జరిగింది..!?

ABN , First Publish Date - 2021-10-30T20:32:27+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి కవిత ఎందుకు హాజరుకాలేదు. ఇప్పుడిదే గులాబీ పార్టీలో హాట్‌ టాపిక్‌...

TRS Plenaryకి కల్వకుంట్ల కవిత ఎందుకు రాలేదు.. కారణాలేంటి.. కనీసం ఫ్లెక్సీల్లో కూడా కనిపించలేదేం.. అసలేం జరిగింది..!?

టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి కవిత ఎందుకు హాజరుకాలేదు. ఇప్పుడిదే గులాబీ పార్టీలో హాట్‌ టాపిక్‌. బుర్జ్‌ ఖలీఫాపై బతుకమ్మ ఉత్సవం నిర్వహించిన తోటి నిజమాబాద్‌ నేతలు ప్లీనరీకి అటెంట్‌ అయ్యారు. మరి కవిత ఎందుకు ప్లీనరీకి అటెంట్‌ కాలేదు. ప్లీనరీలో ఏం జరుగుతుందో కవితకు ముందే తెలుసా? కేసీఆర్‌ కూతురు కవిత అలిగారా? ఎవరిపై ఈ అలక? వచ్చే సంవత్సరం కొత్తలో ఎమ్మెల్సీ పదవికాలం పూర్తికావస్తున్న కవితకు కొత్త పదవిపై సీఎం కేసీఆర్‌ క్లారిటీ ఇవ్వలేదా..? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


రామన్నతో రాఖీ కట్టించుకోని కవితక్క

గతంలో రాఖీ పండగ సందర్బంగా కేటీఆర్‌కు రాఖీ కట్టకపోవడం కూడా అప్పట్లో చర్చకు దారితీసింది. అన్న చెల్లెళ్ల మధ్య అంతరం పెరిగిందన్న  ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో ఆమె విదేశాల్లో ఉన్న కారణంగానే రాఖీ కట్టలేకపోయినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే ఇప్పుడు ప్లీనరీలో కనిపించిన దృశ్యాలు చూస్తున్నవారిలో మళ్లీ  ఉహాగానాలు మొదలయ్యాయి.


అంతా రామన్నే, కనిపించని కవితక్క..!

టీఆర్‌ఎస్‌ కార్యక్రమాలు అంటే ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్‌, కూతురు కవిత ఎంట్రీ ఇచ్చినప్పుడు ఉండే సందడే వేరుగా ఉంటుంది. ప్లీనరీలో కేటీఆర్‌ మాస్‌ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆ జోష్‌ కనిపించింది. ప్రచార ప్లెక్సీల్లోనూ కేసీఆర్‌ లెవల్లో కేటీఆర్‌ మార్క్‌ కనిపించింది. అయితే ఎక్కడా కవితకు అంతగా ప్రాధాన్యత లభించినట్లు లేదని ఫ్లెక్సీల హంగామా చూసిన నేతలు అనుకునేమాట. దీనికి తోడు ప్లీనరీ నిర్వహించిన వేదికపై ఎవరెవరికి చోటు ఉంటుందనేది ముందే జరిగే నిర్ణయం. వేదికపై మంత్రులకు, పార్టీ కార్యవర్గసభ్యులకు మాత్రమే చోటు కల్పించారు. టీఆర్‌ఎస్‌లో మహామహులుగా ఉన్న మిగతావారందరూ వేదికకు ఎదురుగా ఒక విదంగా లోకల్‌భాషలో చెప్పాలంటే కిందనే కూర్చున్నారు. కవిత ప్లీనరీకి వచ్చినా జరగాల్సింది ఇదే అనే మాటలు వినిపిస్తున్నాయి.


కవిత ఏమనుకున్నారు..!?

ప్లీనరీ వేదికపై మంత్రులు, రాష్ట్రకార్యవర్గం మాత్రమే కూర్చుండేలా ప్లాన్‌ చేశారు. కేసీఆర్‌ కూతురు కవిత మంత్రి కాదు, రాష్ట్ర కార్యవర్గసభ్యురాలూ కాదు. కేవలం ఎమ్మెల్సీ మాత్రమే. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ వేదికకు ఎదురుగా మాత్రమే ఆసీనులు కావాల్సివచ్చింది. గ్రాండ్‌గా నిర్వహిస్తున్న వేడుకలో వేదికపై చోటులేకుండా వెళ్లడం ఎందుకనుకున్నారో ఏమో కవిత అక్కడకు వెళ్లకుండా గమ్మున ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.


కవిత దుబాయ్‌ నుంచి రాలేదా..? 

ప్లీనరీకి ముందు దుబాయ్‌ బుర్జ్‌ ఖలీఫాలో  బతుకమ్మను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసిన కల్వకుంట్ల కవిత పార్టీ వేడుక సమయంలో ఎక్కడ ఉందనే ప్రశ్నలు అందరి మదిని తొలిచాయి. దుబాయ్‌ ఉత్సవాల్లో పాల్గొన్న నిజామాబాద్‌ నేతల్లో అందరుకాకపోయినా ఎక్కువమంది ప్లీనరీకి అటెండయ్యారు. కాస్త జ్వరం ఉన్నందునే కవిత ప్లీనరీకి రాలేదని మొదట ప్రచారం జరిగింది. అయితే అంతకుమించి కారణం మరోటి ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ వేదికపై ఆమెకు చోటు దక్కదని తెలిసి ముందుజాగ్రత్తగానే కవిత ప్లీనరీకి దూరంగా ఉన్నారనే టాక్‌ వినిపిస్తోంది.


ప్లీనరీలో వెలితి..!

టీఆర్‌ఎస్‌ 20 సంవత్సరాల పండుగ ప్లీనరీని అంగరంగ వైభవంగా నిర్వహించింది. పార్టీ ప్రెసిడెంట్‌గా కేసీఆర్‌ మరోసారి ఎన్నికయ్యారు. ఆ ఆనందక్షణాలను కూతురు కవిత ఎందుకు దగ్గరుండి ప్రత్యక్షంగా చూడలేకపోయింది అనే ప్రశ్న ఇప్పుడు కొంతమందిలో కలుగుతోంది. ప్లీనరీకి అన్నీ తానై చూసిన కేటీఆర్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తండ్రికొడుకులు హెటెక్స్‌ వేదికపై మెరిసిపోతుంటే అక్కడో వెలితి కనబడిందనే ప్రచారం జరుగుతోంది. ఆడబిడ్డ కవిత అక్కడికి ఎందుకు రాలేదనే ప్రశ్నలు వస్తున్నాయి.


హరీష్‌ ఎందుకురాలేదో చెప్పిన కేసీఆర్‌!

ప్లీనరికి దాదాపుగా నేతలంతా హాజరయ్యారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం కారణంగా అక్కడ పార్టీ ఇంఛార్జీలుగా నియమించిన మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్,  ఎమ్మెల్యే బాల్క సుమన్ సహా కొందరు శాసనసభ్యులు అటెండ్‌ కాలేదు. పార్టీ వారికి ఇచ్చిన మినహాయింపు గురించి కేసీఆర్‌ ప్లీనరీలోనే చెప్పారు. ప్లీనరీకి రెండు రోజుల ముందు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని కవిత దుబాయ్ వెళ్ళింది. అక్కడ బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ వీడియో ప్రదర్శనలో పాల్గొంది. ఆమె వెంట బుర్జ్ ఖలీఫాకు వెళ్లి వచ్చిన ఎమ్మెల్యేలు సోమవారం ప్లీనరికి హాజరయ్యారు. కానీ కవిత మాత్రం ప్లీనరీలో కనిపించడకపోవడం ఏంటనే ఆసక్తి అందరిలో కలుగుతోంది.


ప్లీనరీలో కేటీఆర్‌ జోష్‌.. మంత్రి పదవి కవితకు నెరవేరని కలేనా!?

నిజమాబాద్‌ ఎంపీగా ఓడిపోయినప్పటి నుంచి కవిత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. జాగృతి కార్యక్రమాల్లో కూడా స్తబ్ధత నెలకొంది. అయితే ఎమ్మెల్సీ అయ్యాక కవితలో కొంత మార్పు వచ్చింది. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అయినట్లే కనిపించారు. మంత్రి పదవి కోసమే కూతురు కవితను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎమ్మెల్సీని చేశారనే ప్రచారం జరిగింది. అయితే మంత్రి పదవి దక్కకపోవడంతో పాటు ఎమ్మెల్సీ పదవీకాలం కూడా వచ్చే సంవత్సరం కొత్తలో ముగిసిపోనుంది. అన్ని పరిణామాలు గమనిస్తున్న కవిత మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్టుగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జరిగిన ప్లీనరీకి కూడా ఆమె అటెంట్‌ కాకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది.



Updated Date - 2021-10-30T20:32:27+05:30 IST