రేడియోలో టీటీడీ ప్రసారాలను ఎందుకు నిలిపివేశారు: బీజేపీ

ABN , First Publish Date - 2021-11-26T06:41:51+05:30 IST

తిరుపతి కేంద్రంగా ఆలిండియా రేడియోలో ప్రతిరోజూ ఉదయం సుప్రభాతం, తోమాల, కొలువు, అర్చన వంటి సేవలను వేకువజాము 3 నుంచి 6 గంటల వరకు ప్రసారం చేసేవారు. కొన్నాళ్లుగా ఈ ప్రసారాలను టీటీడీ రద్దు చేసింది.

రేడియోలో టీటీడీ ప్రసారాలను ఎందుకు నిలిపివేశారు: బీజేపీ

తిరుమల, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): తిరుపతి కేంద్రంగా ఆలిండియా రేడియోలో ప్రతిరోజూ ఉదయం సుప్రభాతం, తోమాల, కొలువు, అర్చన వంటి సేవలను వేకువజాము 3 నుంచి 6 గంటల వరకు ప్రసారం చేసేవారు. కొన్నాళ్లుగా ఈ ప్రసారాలను టీటీడీ రద్దు చేసింది. ఎందుకిలా టీటీడీ చేసిందో భక్తులకు చెప్పాలని బీజేపీ నేత భానుప్రకా్‌షరెడ్డి డిమాండ్‌ చేశారు. తిరుమలలోని శ్రీవారి ఆలయం ముందు గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆలిండియా రేడియో ద్వారా చిత్తూరు, కడప జిల్లాలతో పాటు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో శ్రోతలు నిరంతరం వింటూ స్వామిని కొలుస్తున్నారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉండే భక్తులూ మొబైల్‌ ఫోనులోని న్యూస్‌ ఆన్‌ ఎయిర్‌ యాప్‌ ద్వారా ఈ ప్రసారాలను వింటున్నారన్నారు. ఈ ప్రసారాలపై ఆలిండియా రేడియోతో ఉన్న ఒప్పందాన్ని నవంబరు ఒకటో తేదీ నుంచి టీటీడీ అధికారులు ఎందుకు రద్దు చేసుకున్నారో చెప్పాలన్నారు. ఈ అంశంపై వారం కిందట టీటీడీ ఈవోను కూడా కలిసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఈ ప్రసారాలను ఎందుకు, ఎవరు,, దేనికోసం ఆపేశారో తెలియజేయాలన్నారు. ధార్మిక కార్యక్రమాలకు పెద్దపీట వేయాల్సిన టీటీడీ వెంటనే ఆలిండియా రేడియోలో ఆ ప్రసారాలను పునరుద్ధరించాలన్నారు. 


సొంతఛానల్‌, రేడియో ఉన్నందువల్లే 

శ్రీవారి ఆలయంలో జరిగే సుప్రభాతం, ఇతర సేవలను శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌, ఎస్వీబీసీ రేడియో, ఎస్వీ ఎఫ్‌ఎం రేడియో ద్వారా ప్రసారం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆకాశవాణి ద్వారా ఈ ప్రసారాలను నిలుపుదల చేయించినట్టు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. 2018లో ఆలిండియా రేడియోతో చేసుకున్న ఒప్పందం మేరకు ఈ సేవల ప్రసారానికి ఏడాదికి రూ.35 లక్షలు చెల్లించాల్సి ఉందన్నారు. టీటీడీ ఎఫ్‌ఎం రేడియో, ఎస్వీబీసీ రేడియోలో శ్రీవారి ఆలయంలో జరిగే సుప్రభాతం, తోమాల, అర్చన ఇతర సేవలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు గుర్తుచేశారు. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి టీటీడీ రేడియోల్లో ప్రసారాలను వినాలని కోరారు. 

Updated Date - 2021-11-26T06:41:51+05:30 IST