ltrScrptTheme3

ఎందుకీ అచంచల విధేయత?

Oct 12 2021 @ 01:23AM

‘అధికారంతో అంటకాగడం ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యం కాదు. భారత దేశాన్ని ప్రపంచ అగ్ర రాజ్యాల్లో ఒకటిగా మార్చడమే ఆయన ధ్యేయం’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సంసద్ టీవీకి ఇచ్చిన తాజా ఇంటర్వ్వూలో ఆయన చెప్పిన మాటలు మోదీని ప్రజలు మరింతగా అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి.


‘మోదీ బలం ఏమిటి?’ అని అడిగినప్పుడు ఆయన ఎంత విమర్శలకు గురయితే అంత బలోపేతమవుతారని అమిత్ షా చెప్పారు. సాధారణంగా బలమైన నిర్ణయాలు తీసుకునే వారిపైనే విమర్శలు ఎక్కుపెడతారు. గాంధీనగర్ నుంచి న్యూఢిల్లీ వరకు చేసిన అధికార ప్రస్థానంలో అభివృద్ధినే తన ప్రధాన అస్త్రంగా మోదీ ఉపయోగించుకున్నారు. భుజ్‌లో భూకంపం సంభవించిప్పుడు చేసిన నిర్మాణ కార్యక్రమాల నుంచి ప్రభవించిన ‘గుజరాత్ అభివృద్ధి నమూనా’ దేశంలో అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా మారేంతవరకూ ఆయన విశ్రమించలేదు. మోదీ సాధించిన అభివృద్ధే గుజరాత్‌లో ఆయన 14 సంవత్సరాలు అధికారంలో ఉండడానికి, ఇప్పటికీ బిజెపి తిరుగులేని విజయాలు సాధించడానికి కారణమవుతోంది. మోదీ ముఖ్యమంత్రి కాగానే స్కూళ్లలో నూటికి నూరు శాతం విద్యార్థులు హాజరు కావాలన్న సంకల్పాన్ని ఒక ఉద్యమంగా చేపట్టారు. తల్లిదండ్రుల కమిటీలను నియమించారు. ఉపాధ్యాయులకు బాధ్యతలు నిర్ణయించారు. దీంతో మధ్యలో చదువు మానివేసే విద్యార్థుల శాతం 37 నుంచి ఒక శాతం కంటే తక్కువకు చేరుకుంది. మోదీ ఎందుకు విద్యకు ఇంత ప్రాధాన్యత నిచ్చారని అడిగితే చదువులేని వ్యక్తి దేశానికి భారం అవుతాడని, అతడికి రాజ్యాంగం కల్పించిన బాధ్యతలు కానీ హక్కులు కానీ తెలియవని, అతడెలా మంచి పౌరుడు అవుతాడని అమిత్ షా ప్రశ్నించారు. మోదీ ఆలోచనా విధానం ఎంత గొప్పదో ఈ జవాబుతో మనకు అర్థమవుతుంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా భావించిన ఆదివాసీల అభ్యున్నతిపై కూడా మోదీ అదే విధంగా దృష్టిసారించారు. గుజరాత్‌లో పారిశ్రామిక అభివృద్ధికి వెన్నెముకగా నిలిచిన కోస్తా తీరాన్ని కూడా అభివృద్ధి పరిచారు. ఒకప్పుడు పిల్లలు క్రికెట్ ఆడుకునే మైదానంలా ఉండే సబర్మతీ నదీ పరీవాహక ప్రాంతాన్ని పునరుద్ధరించి నదీ జలాలు ఉరకలెత్తేలా చేశారు.


మోదీ ఎవరి మాట వినరని, తన స్వంత నిర్ణయాలు తీసుకుంటారని, నియంతలా వ్యవహరిస్తారని ప్రతిపక్షాలు, కుహనా మేధావులు నిత్యం హోరెత్తి ప్రచారం చేస్తూనే ఉంటారు. కాని మోదీ నిర్వహించినన్ని సమావేశాలు మరెవరూ నిర్వహించి ఉండరు. విద్యార్థులనుంచి శాస్త్రవేత్తల వరకు, ఉన్నత స్థాయి అధికారులనుంచి ముఖ్యమంత్రుల వరకూ మోదీ నిరంతరం చర్చల్లోనే ఉంటారు. ‘మోదీని, ఆయన పనితీరును నేను ఎంతో సన్నిహితంగా పరిశీలించాను, ఆయన లాగా ఓపికగా వినేవారు మరొకరుండరు. సమస్యఏదైనా ఆయన ప్రతి ఒక్కరి వింటారు. చివరగా మాట్లాడతారు. ఆ తర్వాతే సరైన నిర్ణయం తీసుకుంటారు’ అని అమిత్ షా చెప్పారు.కేంద్ర కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ప్రతి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. అమిత్ షా ఇంకా ఇలా చెప్పారు: 


‘మోదీతో ఈ విషయంలో కూడా నాకు చాలా సందర్బాల్లో స్వానుభవం ఉన్నది. ఒకరోజు పార్టీ కార్యదర్శులనందరినీ ఆయన తన ఇంటికి పిలిచారు. దాదాపు ఆరు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా పరిచయం చేయనవసరం లేకుండానే ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడారు. అందరి అభిప్రాయాలను తెలుసుకున్నారు.చివరగా ఒక్కొక్కరి పనితీరునూ ఆయనే వివరించారు. ఎవరెవరు కార్యరంగంలో పనిచేస్తున్నారో, ఎవరు కేవలం ట్వీట్లకే పరిమితం అవుతున్నారో మోదీ స్వయంగా వివరిస్తుంటే మా అందరికీ ఆశ్చర్యం కలిగించింది. పార్టీ కార్యదర్శుల పనితీరు కూడా ఒక ప్రధాన మంత్రి పదవిలో ఉన్నప్పటికీ ఆయన ఎంత నిశితంగా పరిశీలిస్తారో, ఎలా నివేదికలు తెప్పించుకుంటారో తెలిసి ఆశ్చర్యం కలిగింది. పనిచేయకుండా కేవలం మాటలతో కాలక్షేపం చేసేవారిని మోదీ ఇష్టపడరన్న విషయం కూడా నాకు అర్థమైంది’. 


మోదీ ఎన్నికల్లో గెలవడం కోసమో, స్వల్పకాలిక ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకోరు. తాను తీసుకునే నిర్ణయాల వల్ల స్వల్పకాలంలో కొన్ని నష్టాలు ఎదురవుతాయని తెలిసినప్పటికీ జాతీయ ప్రయోజనాలు సాధించేందుకు ఆ నిర్ణయాలు తీసుకునేందుకు ఆయన వెనుకాడరు. ఒకోసారి పార్టీ మద్దతు దారులకు వ్యతిరేకంగా ఉండే నిర్ణయాలను కూడా దేశ ప్రయోజనాల కోసం తీసుకోవాల్సి వస్తుందని అమిత్ షా చెప్పారు. నల్లధనం పై దాడి, ఆర్థిక సంస్కరణల విషయంలో వెనుకంజ వేయకపోవడం, పన్నుల ఎగవేతలో లోపాలు పూరించడం మూలంగా బిజెపికి ఓటు వేసిన వారికి కూడా కష్టాలు ఎదురవుతాయని తెలిసినప్పటికీ మోదీ వెనుకాడరు. అయినప్పటికీ ఆయన మద్దతు దారులు మోదీకి వ్యతిరేకం ఎందుకు కారు? ఈ చర్యల వల్ల మోదీకి వచ్చే వ్యక్తిగత లాభం ఏమీ ఉండదు, దేశానికే అంతిమంగా ప్రయోజనం జరుగుతుందని వారికి బాగా తెలుసు. అందుకే ఇవాళ ఆర్థికవ్యవస్థ తీరుతెన్నుల్ని మార్చేందుకు, భారత దేశంలో అభివృద్ధి నిరాఘాటంగా జరిగేందుకు అతివేగంగా తీసుకుంటున్న నిర్ణయాలు విమర్శలకు కారణం కావచ్చు. ఈ విషయం తెలిసినప్పటికీ మోదీ సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనతికాలంలో వాటి ఫలితాలు తెలిసిన తర్వాత ఆయన ఇవాళ ఆ నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో అర్థమయి తీరుతుంది. ముందు చూపు గల వాళ్లు తీసుకునే నిర్ణయాలను సమకాలికులు ఎప్పుడూ మెచ్చరు అన్నారు ఒక మేధావి. మోదీ విషయంలో కూడా అది వర్తిస్తుంది. 


క్రమశిక్షణ కు మోదీ ఎంతో ప్రాధాన్యత నిస్తారు. అత్యంత రహస్యంగా ఉంచాల్సిన విషయాలు, నిర్ణయం తీసుకునేముందు చర్చల దశలో ఉన్న విషయాలు బయటకు పొక్కడం ఆయనకు ఇష్టం ఉండదు. అంత మాత్రాన సమష్టి నిర్ణయ ప్రక్రియను ఆయన ఏనాడూ వదిలిపెట్టలేదు. మోదీ అధికారంలోకి రాకముందు వందలాది కుంభకోణాలు, నేతలపై అవినీతి ఆరోపణలు ఉండేవి. ఇప్పుడు ఏడేళ్ల మోదీ పాలన తర్వాత ఒక్క కుంభకోణమైనా ప్రస్తావించడానికి కూడా కనపడడం లేదు. మోదీ హయాంలో భారత దేశం ప్రపంచంలోని బలమైన ఆర్థిక వ్యవస్థల్లో 6వ స్థానానికి చేరుకుంది. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం కష్టపడి పనిచేయడం మోదీ అలవాటు.అందుకే ఆయన భారత దేశాన్ని 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థికవ్యవస్థగా మారుస్తామని ప్రకటించారు.ఈ ప్రకటన నిజం కావడానికి ఎంతో దూరం లేదు. మోదీ సంకల్ప బలమే ఆయన విజయ రహస్యం.

వై. సత్యకుమార్

బిజెపి జాతీయ కార్యదర్శి

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.