కరోనా నుంచి కోలుకున్నాక టూత్ బ్రష్ మార్చండి...నిపుణుల సిఫార్సు

ABN , First Publish Date - 2021-05-07T12:09:25+05:30 IST

కరోనా రోగి వాడిన టూత్ బ్రష్, నాలుక క్లీనర్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని నిపుణులు తాజాగా హెచ్చరించారు...

కరోనా నుంచి కోలుకున్నాక టూత్ బ్రష్ మార్చండి...నిపుణుల సిఫార్సు

న్యూఢిల్లీ : కరోనా రోగి వాడిన టూత్ బ్రష్, నాలుక క్లీనర్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని నిపుణులు తాజాగా హెచ్చరించారు. అందుకే కరోనా నుంచి  కోలుకున్నాక మీ టూత్ బ్రష్, నాలుక క్లీనర్‌ను మార్చాలని నిపుణులు సిఫార్సు చేశారు. కొవిడ-19 నుంచి కోలుకున్న వ్యక్తి వెంటనే వారు వాడిన టూత్ బ్రష్, నాలుక క్లీనర్లను మార్చాలని దంతవైద్యులు సూచించారు. దీనివల్ల ఇది వాడే వ్యక్తికి తిరిగి కరోనా సంక్రమించే అవకాశాల నుంచి రక్షించడమే కాకుండా,ఇంట్లో అదే వాష్ రూంను ఉపయోగించే ఇతరులను కూడా కాపాడవచ్చని నిపుణులు చెప్పారు. మీరు లేదా మీ కుటుంబసభ్యులు, స్నేహితులు ఎవరైనా కొవిడ్ నుంచి కోలుకుంటే మీరు వాడిన టూత్ బ్రష్, నాలుక క్లీనర్ లను వెంటనే మార్చాలని, ఇవి వైరస్ ను వ్యాప్తి చేస్తాయని న్యూఢిల్లీ లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీ డెంటల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ప్రవేష్ మెహ్రా చెప్పారు.


కాలానుగుణ ఫ్లూ, దగ్గు, జలుబు నుంచి కోలుకున్న వారెవరైనా టూత్ బ్రష్, నాలుక క్లీనర్లను మార్చాలని  ఆకాష్ హెల్త్‌కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెంట్ (డెంటల్) డాక్టర్ భూమికా మదన్ సిఫారసు చేశారు. కరోనా వచ్చాక 20 రోజుల తర్వాత మీ టూత్ బ్రష్, నాలుక క్లీనర్లను మార్చాలని డాక్టర్ భూమికా సూచించారు.టూత్ బ్రష్ మీద కాలక్రమేణా ఏర్పడిన బాక్టీరియా, వైరస్ శ్వాసకోశ అంటువ్యాధులకు కారణమవుతుందని డాక్టర్ భూమికా వివరించారు. నోటిలో వైరస్ ఏర్పడకుండా తగ్గించేందుకు బీటాడిన్ గార్గ్లే లేదా మౌత్ వాష్ వినియోగించాలని, మౌత్ వాష్ అందుబాటులో లేకపోతే వెచ్చని సెలైన్ వాటర్ తో నోటిని శుభ్రం చేసుకోవాలని డాక్టర్ భూమికా సూచించారు. రోజుకు రెండుసార్లు బ్రష్ చేస్తూ నోటి శుభ్రత పాటించాలని డాక్టర్ వివరించారు.

Updated Date - 2021-05-07T12:09:25+05:30 IST