శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా.. విక్రమసింఘె ప్రమాణ స్వీకారం

ABN , First Publish Date - 2022-07-16T08:13:17+05:30 IST

గొటబాయ రాజపక్స శ్రీలంక అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు ఆ దేశ పార్లమెంటు స్పీకర్‌ మహింద యప అబెవర్దన అధికారికంగా ప్రకటించారు.

శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా.. విక్రమసింఘె ప్రమాణ స్వీకారం

20న పార్లమెంటులో అధ్యక్ష పదవికి ఎన్నిక

కొలంబో, జూలై 15: గొటబాయ రాజపక్స శ్రీలంక అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు ఆ దేశ పార్లమెంటు స్పీకర్‌ మహింద యప అబెవర్దన అధికారికంగా ప్రకటించారు. జూలై 14 నుంచే వర్తించేటట్టుగా రాజపక్స రాజీనామా చేశారని.. ఆయన రాసిన లేఖ తనకు అందిందని అబెవర్దన వెల్లడించారు. కొత్త అధ్యక్షుడిని పార్లమెంటు ఎన్నుకునే ప్రక్రియ ముగిసేవరకూ ప్రధాని రణిల్‌ విక్రమసింఘెనే తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు. శనివారం పార్లమెంటు సమావేశం అవుతుందని, వారంరోజుల్లోగా కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. అధ్యక్ష పదవికి నామినేషన్లను జూలై 19న స్వీకరిస్తామని.. 20న సభ్యులు కొత్త ప్రెసిడెంట్‌ను ఎన్నుకుంటారని స్పీకర్‌వెల్లడించారు. కాగా.. అధ్యక్షుడి రాజీనామాను స్పీకర్‌ లాంఛనంగా ప్రకటించడంతో రణిల్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు అధికారాలను బలోపేతం చేసేలా 19వ రాజ్యాంగ సవరణను పునరుద్ధరిస్తానని, శాంతిభద్రతలను కాపాడుతానని ఆయన ప్రకటించారు. 2015లో విక్రమసింఘె ప్రధానిగా ఉన్నప్పుడే.. ఈ సవరణ ద్వారా అధ్యక్షుడి అధికారాలను తగ్గించి, పార్లమెంటు అధికారాన్ని పెంచారు. కానీ, గొటబాయ హయాంలో మరో సవరణ ద్వారా పార్లమెంటును బలహీనం చేసి అధ్యక్షుడి అధికారాలను బలోపేతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే విక్రమసింఘె ఈ అంశంపై దృష్టిసారించారు. అంతేకాదు.. అధ్యక్షుడిని ఉద్దేశించి గౌరవపూర్వకంగా ఉపయోగించే ‘హిజ్‌ ఎక్సలెన్సీ’ అనే పదాన్ని నిషేధించాలని, అధ్యక్ష పతాకాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. కాగా.. వచ్చేవారం జరిగే అధ్యక్ష ఎన్నికల్లో విక్రమసింఘెకు మద్దతు తెలపాలని అధికార ‘శ్రీలంక పొదుజన పేరమున(ఎస్‌ఎల్‌పీపీ)’ పార్టీ నిర్ణయించింది. కాగా, గొటబాయ సోదరులైన లంక మాజీ ప్రధాని మహింద రాజపక్స, మాజీ ఆర్థిక మంత్రి బసిల్‌ రాజపక్స జూలై 28 దాకా దే శం విడిచి వెళ్లకుండా సుప్రీంకోర్టు నిషేధం విధించింది. దేశ ఆర్థిక సంక్షోభంపై ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. 


1978 తర్వాత ఇదే

ప్రజా తీర్పుతో కాకుండా.. శ్రీలంకలో అధ్యక్షుడిని ఎంపీలు రహస్య ఓటింగ్‌ ద్వారా ఎన్నుకోవడం 1978 తర్వాత ఇదే తొలిసారి. 1982, 1988, 1994, 1999, 2005. 2010, 2015, 2019లో అధ్యక్షుడిని ప్రజలే ఎన్నుకొన్నారు. 1993లో మాత్రం.. అప్పటి అధ్యక్షుడు రణసింఘె ప్రేమదాస హత్యకు గురికావడంతో ఆ పదవి ఖాళీ అయింది. కానీ, పార్లమెంటు డీబీ విజెతుంగను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఆమోదించడంతో అప్పట్లో ఎన్నిక జరగలేదు. 20న అధ్యక్షుడిగా ఎన్నికయ్యే వ్యక్తి పదవీకాలం 2024 నవంబరు దాకా ఉంటుంది. అధ్యక్ష పదవి రేసులో విక్రమసింఘెనే ముందంజలో ఉన్నట్టు సమాచారం. ఆయనకు పోటీగా తదుపరి స్థానంలో సాజిత్‌ ప్రేమదాస ఉన్నారు. 

Updated Date - 2022-07-16T08:13:17+05:30 IST