విస్తారంగా వర్షాలు

ABN , First Publish Date - 2021-10-30T06:30:01+05:30 IST

జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవి ఖరీఫ్‌ పంటలకు జీవం పోశాయి.

విస్తారంగా వర్షాలు
జలమయమైన ఒంగోలులోని కర్నూల్‌రోడ్డు

ఖరీఫ్‌కు జీవం.. రబీ సాగుకు ఊతం

ఒంగోలు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవి ఖరీఫ్‌ పంటలకు జీవం పోశాయి. రబీ సాగుకు సానుకూల వాతావరణాన్ని కల్పించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గురువారం రాత్రి నుంచి జిల్లాఅంతటా జల్లులు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయానికి సగటున జిల్లాలో 4.9మి.మీ వర్షపాతం నమోదైంది. కందుకూరు, కనిగిరి, ఒంగోలు, కొండపి నియోజకవర్గాల్లో భారీవర్షం కురిసింది. పర్చూరు, ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గాల్లో ఒక మోస్తరుగా పడింది. అత్యధికంగా శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి కందుకూరులో 93.25మి.మీ వర్షపాతం నమోదైంది. ఒంగోలు మండలం ఉలిచిలో 87.0, సి.ఎస్‌.పురం మండలంలో 85.25, సింగరాయకొండలో 78.50, చినగంజాంలో 55.0, జరుగుమల్లిలో 53.0, టంగుటూరులో 52.0, వీవీపాలెంలో 50.50, ఒంగోలులో 44.50, కొండపిలో 42.25, వెలిగండ్లలో 40.0మి.మీ  వర్షం కురిసింది. కాగా డ్రైనేజీ వ్యవస్థ సరిలేక ఒక మోస్తరు వర్షానికే ఒంగోలు నగరంలో వర్షపునీరు రోడ్లపై చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.  భారీవర్షాలతో సీఎస్‌పురం మండలం బైరవకోన జలపాతం నుంచి భారీగా నీరు పడుతూ కనువిందు చేయగా ఇతర ప్రాంతాల్లో వాగులు, వంకల్లోకి నీరు చేరుతోంది. 


పంటలకు మేలు

తాజా వర్షాలు వ్యవసాయ రంగానికి బాగా ఉపకరించనున్నాయి. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 5.19లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. అందులో ఇంచుమించు 2.78లక్షల ఎకరాలు కంది, పత్తి, మిర్చి వంటి పంటలు ఉన్నాయి. పక్షంరోజులుగా సరైన వర్షం లేక అవి వాడుముఖం పట్టాయి. అలాంటి పంటలకు తాజా వర్షం జీవం పోసింది. అదే సమయంలో రబీ సీజన్‌ పంటల సాగుకు బాగా అనుకూలత ఏర్పడనుంది. ప్రధానంగా పొగాకు, శనగ విస్తారంగా సాగు కానున్నాయి. కాస్త తెరపి ఇచ్చిన వెంటనే పొగాకు, మిర్చి నాట్లు... శనగ, మినుము విత్తనాల వెదలు ప్రారంభం కానున్నాయి. అలాగే మాగాణి ప్రాంతంలో వరినాట్లు కూడా ఊపందుకోనున్నాయి. కాగా కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో అక్కడక్కడా కోసి ఉన్న సజ్జ కుప్పలకు కాస్తంత నష్టం జరిగే అవకాశం ఉంది.  వర్షం అధికమైతే గిద్దలూరు ప్రాంతంలో వేసిన శనగ విత్తనాలు కుళ్లిపోతాయన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.  







Updated Date - 2021-10-30T06:30:01+05:30 IST