భర్త హత్య కేసులో భార్య మరో ఇద్దరు అరెస్టు

ABN , First Publish Date - 2022-01-23T04:56:16+05:30 IST

కట్టుకున్న భర్తనే కడతేర్చిన కేసులో భార్యతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు అర్బన్‌ సీఐ చలపతి తెలిపారు.

భర్త హత్య కేసులో భార్య మరో ఇద్దరు అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న సీఐ చలపతి

మైదుకూరు, జనవరి 22 : కట్టుకున్న భర్తనే కడతేర్చిన కేసులో భార్యతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు అర్బన్‌ సీఐ చలపతి తెలిపారు. మండలంలోని మిట్టమానుపల్లెకు చెందిన ముద్ద మల్లేశ్వరి తన భర్త ముద్ద శ్రీను అలియాస్‌ సీతయ్య కనిపించడం లేదంటూ ఇటీవల తమకు ఫిర్యాదు చేసిందన్నారు. తాము విచారణ చేయగా ఆమె మిట్టమానుపల్లెకు చెందిన యర్రబోయిన శివశంకర్‌, దొండపాటి రాజగోపాల్‌తో కలసి తన భర్త శ్రీను మేకలు మేత కోసం సమీపంలోని ముక్కొండలోకి తీసుకెళ్లి శీతల పానియంలో నిద్రమాత్రలు, గుళికలు తాగించి కట్టెలతో బలంగా కొట్టి హత్య చేసి అక్కడే పడవేశారన్నారు. తమ విచారణలో వాస్తవాలు వెలుగు చూశాయని, ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపెడుతున్నట్లు సీఐ తెలిపారు.


గుర్తు తెలియని వ్యక్తి మృతి


పుల్లంపేట, జనవరి 22 : మండల పరిధిలోని అనంతంపల్లెలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్‌ఐ ప్రతా్‌పరెడ్డి తెలిపారు. ఇతడికి 45 సంవత్సరాల వయస్సు ఉంటుందని ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని రాజంపేట మార్చురీకి తరలించామన్నారు. 


చికిత్స పొందుతూ ఉపాధ్యాయురాలు మృతి

కడప క్రైం, జనవరి 22: కడప నగరం కోటిరెడ్డి సర్కిల్‌ వద్ద ఆర్టీసీ అద్దె బస్సులో నుంచి పడి తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయురాలు ఉమాదేవి (56) వేలూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ తెలిపారు. కడప నగరానికి చెందిన ఉమాదేవి చిన్నమాచుపల్లెలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేసేది. ఈనెల 13న పాఠశాలకు వెళ్లేందుకు కోటిరెడ్డి సర్కిల్‌ వద్ద ఆర్టీసీ అద్దె బస్సు ఎక్కారు. ఈమె బస్సులోకి ఎక్కగానే డ్రైవర్‌ వేగంగా వెళుతూ సడెన్‌ బ్రేక్‌ వేయడంతో బస్సులోంచి కిందపడి తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం ఆమెను వేలూరుకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

Updated Date - 2022-01-23T04:56:16+05:30 IST