అత్తాకోడళ్ల మధ్య గొడవ.. మొబైల్ లాక్కుందని కోడలి ఘాతుకం.. పాప ఏడుపు విని వెళ్తే..

ABN , First Publish Date - 2021-08-30T18:15:11+05:30 IST

అత్తాకోడళ్లు అన్నాక గొడవలు సహజం. అయితే ఇది ఎంత వరకూ వెళ్తుందనేదే సమస్య. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్‌లో జరిగిన ఘటన అందర్నీ షాక్‌కు గురిచేసింది.

అత్తాకోడళ్ల మధ్య గొడవ.. మొబైల్ లాక్కుందని కోడలి ఘాతుకం.. పాప ఏడుపు విని వెళ్తే..

ఇంటర్నెట్ డెస్క్: అత్తాకోడళ్లు అన్నాక గొడవలు సహజం. అయితే ఇది ఎంత వరకూ వెళ్తుందనేదే సమస్య. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్‌లో జరిగిన ఘటన అందర్నీ షాక్‌కు గురిచేసింది. అత్తాకోడళ్ల మధ్య చిన్న విషయంలో జరిగిన గొడవ ఆ కుటుంబంలో కల్లోలం నింపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివసించే కన్హయ యాదవ్ అనే వ్యక్తికి రాణీ దేవి(35)తో కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. కన్హయ తల్లితో రాణికి చాలాసార్లు గొడవలు జరిగాయి. తాజాగా శనివారం కూడా వీళ్లిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. కోడలు మొబైల్ ఎక్కువగా వాడుతోందని అత్త గొడవ పెట్టుకుంది. ఈ గొడవ జరిగిన సమయంలో కన్హయ ఇంట్లో లేదు. ఈ గొడవ పెద్దదవడంతో.. అత్తగారు ఆవేశంగా కోడలి మొబైల్ లాక్కుంది.


కోడలికి మొబైల్ ఇవ్వకుండా తన దగ్గరే దాచుకుంది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన రాణీ దేవి.. మేత మేపడానికి పశువులను బయటకు తీసుకెళ్లింది. తన వెంటన నాలుగేళ్ల పెద్ద కుమార్తెను, 10 నెలల చిన్న కుమార్తెను కూడా తీసుకెళ్లింది. పశువులకు మేత మేపిన అనంతరం తిరిగి వచ్చే దారిలో.. రాణీ దేవి భయంకరమైన నిర్ణయం తీసుకుంది. మార్గమధ్యంలో ఉన్న పెద్ద బావి దగ్గరకు వెళ్లి చేతిలోని పది నెలల పాపను బావిలో పడేసింది. పెద్ద కుమార్తెను కూడా అలాగే బావిలోకి తోసేసింది. అనంతరం తాను కూడా బావిలోకి దిగి ఉరేసుకుంది. అయితే పెద్ద కుమార్తె బావిలోకి దిగే మెట్లపై పడటంతో ప్రాణాలు కాపాడుకోగలిగింది.


పైనుంచి పడటంతో గాయాలపాలైన సదరు బాలిక పెద్దగా ఏడ్చేసింది. ఆమె ఏడుపు విని అక్కడకు చేరుకున్న స్థానికులు బావిలో కనిపించిన దృశ్యం చూసి స్థాణువులైపోయారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, బావిలోని పాపను కాపాడారు. అలాగే మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం చేయడానికి స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబానికి అప్పగించారు.

Updated Date - 2021-08-30T18:15:11+05:30 IST