ఏడో అంతస్తు నుంచి పడి మృతి.. ఆత్మహత్యే అనుకున్నారు.. బెడ్రూంలో రక్తపు మరకలు.. భార్య, కొడుకును నిలదీస్తే..

ABN , First Publish Date - 2022-02-12T23:57:17+05:30 IST

అపార్ట్‌మెంట్ దగ్గర 54ఏళ్ల వ్యక్తి మృతదేహాం ఉండటంతో ఆ వైపు నుంచి వెళ్లేవాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న అధికారులు.. ఆ వ్యక్తిని గుర్తించి మృతదేహాన్ని పోస్ట్‌మా

ఏడో అంతస్తు నుంచి పడి మృతి.. ఆత్మహత్యే అనుకున్నారు.. బెడ్రూంలో రక్తపు మరకలు.. భార్య, కొడుకును నిలదీస్తే..

ఇంటర్నెట్ డెస్క్: అపార్ట్‌మెంట్ దగ్గర 54ఏళ్ల వ్యక్తి మృతదేహాం ఉండటంతో ఆ వైపు నుంచి వెళ్లేవాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న అధికారులు.. ఆ వ్యక్తిని గుర్తించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తులో భాగంగా తొలుత అతడు ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావించారు. అయితే బెడ్రూంలో రక్తపు మరకలు చూసి అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. తర్వాత భార్య, కొడుకును నిలదీశారు. దీంతో సంచలన విషయం బయటపడింది. ఇంతకూ ఏం జరిగిందంటే..


ముంబైలోని వీరదేశాయి రోడ్‌లో ఎస్ఐడీబీఐ బ్యాంకు క్వార్టర్సు దగ్గర 54 ఏళ్ల వ్యక్తి మృతదేహం ఉందని శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారం అందింది. దీంతో అధికారులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అనంతరం మృతుడిని ఎస్ఐడీబీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ శాంతన్‌ కుమార్‌గా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి.. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే శాంతన్ కుమార్ ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు తొలుత భావించి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగానే అతడి గదిని పరిశీలించారు. అయితే శాంతన్ కుమార్ గదిలో రక్తపు మరకలు చూసిన అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే శాంతన్ కుమార్‌ భార్య జయశీల, కొడుకు అర్వింద్‌లను విచారించారు. 




మొదట తమకు ఏం తెలియదని బుకాయించిన ఇరువురూ.. తర్వాత తప్పు ఒప్పుకున్నారు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు శాంతన్ కుమార్ చేతిని కత్తితో కోసి, తర్వాత అతడిని కిందకు తోసేసినట్టు పేర్కొన్నారు. డబ్బుల విషయంలో కఠినంగా ఉండటం వల్లే హత్య చేసినట్టు వెల్లడించారు. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాలని డబ్బులు అడిగితే.. రెండేళ్లుగా నిరాకరిస్తున్నట్టు అర్వింద్ చెప్పాడు. ఇదే విషయంలో గురువారం కూడా గొడవ జరిగిందని వెల్లడించారు. ఈ క్రమంలోనే తండ్రిని హత్య చేసినట్టు వివరించాడు. దీంతో తల్లీకొడుకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2022-02-12T23:57:17+05:30 IST