
పొరపాటున చేస్తారో.. లేదా కావాలని చేస్తారో.. తెలీదు గానీ, కొందరు చేసే పనులు ఎదుటి వారికి విపరీతమైన కోపం తెప్పిస్తుంటాయి. మరికొందరైతే చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేసి, చివరికి దారుణాలకు ఒడిగడుతుంటారు. అటువంటిదే మధ్యప్రదేశ్‌లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. భర్త రోజూ టీవీ చూస్తున్నాడని భార్యకు కోపం వచ్చింది. ఎంతసేపు టీవీ చూస్తావ్! బయటికి రా.. అంటూ ఓ రోజు మందలించింది. అయినా వినకపోవడంతో కోపంతో లోపలికి వెళ్లిన ఆమె.. ఎంత పని చేసిందంటే..
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛత్తర్‌పూర్‌కు చెందిన సంజయ్ సోనీ తన భార్య, కొడుకుతో కలిసి నివాసం ఉంటున్నాడు. వారం క్రితం హోలీ సందర్భంగా స్థానికంగా ప్రజలంతా రంగులు చల్లుకుంటున్నారు. సంజయ్ సోనీ భార్య కూడా అందరితో కలిసి హోలీ ఆడుతోంది. అయితే సంజయ్ సోనీ మాత్రం ఇంట్లో టీవీ చూస్తూ ఉన్నాడు. దీంతో తనతో పాటూ హోలీ ఆడాలని భర్తను పిలిచింది. ఎప్పుడూ టీవీ చూస్తూ ఉంటావ్! బయటికి రా.. అంటూ పలుమార్లు కేకలు పెట్టింది. అయినా సంజయ్ మాత్రం ఇంట్లోనే ఉన్నాడు. దీంతో ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది. కొద్దిసేపటి తర్వాత ముఖం కడుక్కునేందుకు బయటికి వచ్చిన భర్తపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంత సేపటి నుంచి పిలుస్తుంటే.. లెక్కలేదా.. అంటూ ఇనుప రాడ్ తీసుకుని ఎడమ కన్నుపై బలంగా కొట్టింది.
ఈ దాడిలో సంజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో సంజయ్ భార్య.. భయంతో ఇంట్లోని నగలు, నగదు తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన సంజయ్‌ని.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బలమైన దెబ్బ తగలడంతో కంటి చూపు పోయిందని డాక్టర్లు తెలిపారు. దీంతో ఒక్కసారిగా సంజయ్ షాక్ అయ్యాడు. తన తల్లి, కొడుకుతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు హోలీ ఆడడం ఇష్టం లేకపోవడతో.. ఇంట్లోనే టీవీ చూస్తున్నానని చెప్పాడు. ఇంత చిన్న కారణానికే తనపై భార్య దాడి చేసిందని వాపోయాడు. తన భార్యపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు.
ఇవి కూడా చదవండి