
కాకినాడ క్రైం, సెప్టెంబరు 22:
అనుమానంతో భార్యను కడతేర్చిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి
అరెస్ట్ వివరాలను బుధవారం సాయంత్రం టూటౌన్ పోలీస్స్టేషన్లో డీఎస్పీ
వి.భీమారావు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పెదపాడు మండలం
తాళ్లగూడానికి చెందిన మానేపల్లి గంగరాజు ఐటీఐ చదువుకుని ప్లంబింగ్ పనులు
చేసుకుంటూ, వేసవి సెలవుల్లో కంప్యూటర్ కోర్సు నేర్చుకునేవాడు. ఇదే క్రమంలో
గణపవరం మండలం కాశిపాడుకు చెందిన సుధారాణి కంప్యూటర్ తరగతికి వచ్చేది.
అక్కడ వారు ప్రేమించుకుని పెద్దల సమ్మతితో తాళ్లగూడెంలోని చర్చిలో 13
ఫిబ్రవరి 2021న వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లు సజావుగానే వారి కాపురం
సాగింది. అయితే శ్రీకాంత్ అనే వ్యక్తితో సుధారాణి మాట్లాడుతుండడంతో
గంగరాజు అనుమానం పెంచుకున్నాడు. అతనితో మాట్లాడవద్దని భార్యను
హెచ్చరించాడు. ఈ విషయమై మనస్పర్థలు తలెత్తడంతో సుధారాణి కాకినాడ ఆర్ఎంసీలో
అనస్తీసియా కోర్సులో చేరి హాస్టల్లో చదువుకుంటోంది.
తనకు ఇష్టం
లేకపోయినా చదువుకోవడంతో పాటు అనుమానం పెంచుకోవడంతో భార్యను హతమార్చాలని
గంగరాజు నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం ఈనెల 17న కాకినాడ కోకిల సెంటర్
ద్వారకా రెసిడెన్సీలో గది తీసుకున్నాడు. అక్కడకు తన భార్యను రప్పించాడు.
రెండు రోజుల గడిపిన అనంతరం అదను చూచి ఈనెల 20వ తేదీ అర్ధరాత్రి 1 గంట
ప్రాంతంలో చాకుతో కంఠంపై పొడిచి చంపేసి తన స్వగ్రామం పరారయ్యాడు.
సుధారాణిని కట్టుకున్న భర్తే హత్యచేశాడని మేనమామ మాండ్రు రాజేష్ టూటౌన్లో
ఫిర్యాదు చేశాడు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ భీమారావు ఉత్తర్వుల
మేరకు సీఐ ఈశ్వరుడు నిందితుని కోసం గాలిస్తుండగా బుధవారం ఉదయం మానేపల్లి
గంగరాజును ఆనందభారతి వెనకాల రామకృష్ణారావుపేట జెండారోడ్డు సమీపంలో అరెస్ట్
చేశారు.