ప్రాణాలతో ఆ(వే)ట!

ABN , First Publish Date - 2021-10-27T05:05:59+05:30 IST

- మెళియాపుట్టి మండలం భరణికోట గ్రామానికి చెందిన పద్మ అనే మహిళ ఈ నెల 16న భర్త చేతిలో హత్యకు గురైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణికావేశానికి గురైన భర్త జగ్గారావు ఇంట్లో ఉన్న నాటు తుపాకీతో కాల్చడంతో పద్మ కుప్పకూలిపోయింది. తల్లి మృతిచెందడం, తండ్రి జైలుపాలు కావడంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. ... ఇలా గడిచిన ఐదేళ్లలో ముగ్గురు గిరిజన మహిళలు నాటు తుపాకీకి బలయ్యారు. కుటుంబ కలహాల కారణంగా క్షణికావేశానికి గురవుతున్న వారు ఇళ్లలో ఉన్న నాటు తుపాకులతో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

ప్రాణాలతో ఆ(వే)ట!

నాటుతుపాకీకి బలవుతున్న వన్యప్రాణులు

కుటుంబ కలహాలతో వాటితోనే హత్యలు

గిరిజన ప్రాంతాల్లో పెరుగుతున్న ఘటనలు

పట్టించుకోని అటవీ శాఖ అధికారులు

(మెళియాపుట్టి)

- మెళియాపుట్టి మండలం భరణికోట గ్రామానికి చెందిన పద్మ అనే మహిళ ఈ నెల 16న భర్త చేతిలో హత్యకు గురైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణికావేశానికి గురైన భర్త జగ్గారావు ఇంట్లో ఉన్న నాటు తుపాకీతో కాల్చడంతో పద్మ కుప్పకూలిపోయింది. తల్లి మృతిచెందడం, తండ్రి జైలుపాలు కావడంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. 

... ఇలా గడిచిన ఐదేళ్లలో ముగ్గురు గిరిజన మహిళలు నాటు తుపాకీకి బలయ్యారు. కుటుంబ కలహాల కారణంగా క్షణికావేశానికి గురవుతున్న వారు ఇళ్లలో ఉన్న నాటు తుపాకులతో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మద్యం మత్తులో జరిగిన ఘటనలూ ఉన్నాయి. కొండలు, అడవుల్లో వన్య ప్రాణులను వేటాడేందుకు గిరిజనులు మరణాయుధాలతో పాటు నాటు తుపాకులను వినియోగిస్తున్నారు. బల్లేలు, శూలాలు, కత్తులను సొంతంగానే తయారు చేస్తున్నారు. నాటు తుపాకులను ఒడిశా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వాటితో వన్య ప్రాణులను వేటాడుతున్నారు. వాటిని వేటాడం నిషేధమన్న విషయం చాలామందికి తెలియదు. అటవీ శాఖ అధికారులు కూడా అవగాహన కల్పించడం లేదు. దీంతో అటవీ, గిరిజన ప్రాంతాల్లో వన్య ప్రాణుల వేట యథేచ్ఛగా సాగిపోతోంది. ప్రధానంగా మందస, మెళియాపుట్టి, పాతపట్నం, కొత్తూరు, హిరమండలం, ఎల్‌.ఎన్‌.పేట, భామిని, సీతంపేట మండలాల్లోని అటవీ, గిరిజన ప్రాంతాల్లో వేట జోరుగా సాగుతోంది. కొందరు వ్యాపారులు, దళారులు రంగప్రవేశం చేసి అమాయకులతో వేట సాగిస్తున్నారు. వారికి కొంత మొత్తం చేతిలో పెట్టి వన్యప్రాణుల మాంసాన్ని మైదాన ప్రాంతాల్లో అధిక ధరకు విక్రయిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఇదో రాకెట్‌లా సాగుతోంది. వేటలో భాగంగా ఒక్కోసారి మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయి. కొద్దిరోజుల కిందట కొత్తూరు మండలం పొన్నుటూరు సమీపంలో ఇద్దరు యువకులు విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డారు.


 చట్టాలు అమలు చేస్తున్నా..

 వన్య ప్రాణుల పరిరక్షణకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలుచేస్తున్నా ఫలితం లేకపోతోంది. ఒక తరం వారు చూసే అరుదైన పక్షులు, జంతువులు మరో తరం వారు చూడలేకపోతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. సువిశాల అటవీ ప్రాంతం జిల్లా సొంతం. అరుదైన పక్షులు, జంతువులు అటవీ ప్రాంతంలో స్వేచ్ఛగా సంచరించేవి. కానీ వాటిపై అక్రమార్కుల కన్ను పడింది. వేటాడి వధిస్తున్నారు. మాంసంతో పాటు అవయవాలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు అమాయకులను రొంపిలో దించుతూ వారితో వేట సాగిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన మండలాల్లో రవాణా సౌకర్యం లేని కొండ ప్రాంతాలు, అడవుల్లో జంతువుల వేట సాగుతోంది. 


 యథేచ్ఛగా తుపాకుల వినియోగం

సాధారణంగా తుపాకుల వినియోగించడానికి తర్పీదు అవసరం. కానీ గిరిజన ప్రాంతాల్లో నాటు తుపాకులను యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. ఒడిశా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కొండ శిఖర గ్రామాల్లో ఆత్మరక్షణకు కొందరు తీసుకుంటుండగా.. ఎక్కువ మంది వన్యప్రాణులను వేటాడేందుకు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఇంటికో నాటు తుపాకీ ఉందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావుడి చేసే అటవీ శాఖ అధికారులు తరువాత ఆ మాటే మరచిపోతున్నారు. అడవుల్లో విలువైన సంపద పక్కదారి పడుతున్నట్టే వన్యప్రాణులు కూడా కనిపించకుండా పోతున్నాయి. ఇప్పటికైనా జిల్లా అటవీ శాఖ అధికారులు స్పందించాల్సిన అవసరముంది. 


ప్రత్యేక చర్యలు

వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. వాటిని వేటాడం, తుపాకులు కలిగి ఉండడం కూడా నేరం. అందుకే దీనిపై గిరిజన ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఈ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కేసులు నమోదు చేస్తాం.

- రౌతు రాజశేఖర్‌, అటవీ శాఖ రేంజర్‌, పాతపట్నం

Updated Date - 2021-10-27T05:05:59+05:30 IST