డబుల్ సెంచరీ కొట్టిన టీఎంసీ.. బీజేపీ ఎన్ని సీట్లలో ఆధిక్యంలో ఉందంటే..

ABN , First Publish Date - 2021-05-02T17:45:49+05:30 IST

ఎనిమిది దశల్లో సుదీర్ఘంగా జరిగిన పశ్చిమ బెంగాల్ శాసన సభ

డబుల్ సెంచరీ కొట్టిన టీఎంసీ.. బీజేపీ ఎన్ని సీట్లలో ఆధిక్యంలో ఉందంటే..

కోల్‌కతా : ఎనిమిది దశల్లో సుదీర్ఘంగా జరిగిన పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల ప్రారంభ ఫలితాలను చూసినపుడు బీజేపీ పైకి చెప్పిన స్థాయిలో విజయాలు సాధించే అవకాశాలు కనిపించడం లేదు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు అందిన సమాచారం ప్రకారం అధికార పార్టీ టీఎంసీ 202 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది.  బీజేపీ కనీసం 100 స్థానాలనైనా దక్కించుకోవడం కష్టమేననిపిస్తోంది. 


ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం 202 స్థానాల్లో టీఎంసీ ఆధిక్యంలో ఉంది. బీజేపీ 77 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు ముందంజలో ఉన్నారు. ఇద్దరు స్వతంత్రులు, ఏజేఎస్‌యూ పార్టీ అభ్యర్థి ఒకరు ముందంజలో ఉన్నారు. 


దీనినిబట్టి ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ సునాయాసంగా మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకోగలదని భావించవచ్చు. బీజేపీ, టీఎంసీ మధ్య చాలా థ్రిల్లింగ్‌గా ఈ ఎన్నికల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీ తరపున పశ్చిమ బెంగాల్‌లో ప్రచారం చేసినప్పటికీ కనీసం 100 స్థానాలనైనా దక్కించుకునే అవకాశం కనిపించడం లేదు. 


మమత బెనర్జీ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై వెనుకబడినట్లు తెలుస్తోంది. నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి ఆమె సుమారు 5,000 ఓట్లతో వెనుకబడినట్లు తెలుస్తోంది. 


పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అనంతరం బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ కైలాశ్ విజయవర్గీయ మాట్లాడుతూ, రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు తుది ఫలితానికి సంకేతం కాదన్నారు. 




Updated Date - 2021-05-02T17:45:49+05:30 IST