కర్ణాటక సీఎంను మళ్లీ మార్చబోతున్నారా?

ABN , First Publish Date - 2022-05-02T22:19:03+05:30 IST

కాంగ్రెస్, జేడీఎస్ కూటమిలోని ప్రభుత్వాన్ని కూల్చిన అనంతరం బీజేపీ ప్రభుత్వం ఏర్పడి యడియూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆయన ఎంతో కాలం కొనసాగకుండానే బసవరాజు బొమ్మైని ముఖ్యమంత్రిగా..

కర్ణాటక సీఎంను మళ్లీ మార్చబోతున్నారా?

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి మరోసారి మార్చాబోతున్నారంటూ కమలం పార్టీ నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ కీలక నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం బెంగళూరుకు రానున్నారు. ఆయన ఇక్కడికి వచ్చాక స్థానిక నాయకులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకోనున్నారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. అయితే సీఎం బసవరాజు బొమ్మైతో ఎన్నికలకు వెళ్తే పార్టీకి నష్టమనే కోణంలో పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.


కాంగ్రెస్, జేడీఎస్ కూటమిలోని ప్రభుత్వాన్ని కూల్చిన అనంతరం బీజేపీ ప్రభుత్వం ఏర్పడి యడియూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆయన ఎంతో కాలం కొనసాగకుండానే బసవరాజు బొమ్మైని ముఖ్యమంత్రిగా అధిష్టానం నిర్ణయించింది. ఈయన ముఖ్యమంత్రి అయ్యాక కొద్ది రోజులకే పదవి కోల్పోతున్నారంటూ ప్రచారం జరిగింది. అప్పట్లోనే ఈ విషయమై బొమ్మై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం మార్పు గురించి క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ ఏదీ శాశ్వతం కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని ఇచ్చాయి. కానీ, అలాంటిదేమీ జరగలేదు.


మళ్లీ ఆరు నెలల తర్వాత ఇలాంటి చర్చ మళ్లీ మొదలైంది. కాంగ్రెస్‌లో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ స్థాయిలో ప్రజల్లో బొమ్మై ఆదరణ పొందలేకపోతున్నారనే విమర్శ ఉంది. ఇది బీజేపీ అధిష్టానాన్ని కలవరపరుస్తోందని అంటున్నారు. అలాగే పార్టీలో అంతర్గత కుమ్ములాటలను చక్కదిద్దడంలో బొమ్మై విఫలమయ్యారని అంటున్నారు. దీనికి తోడు హోంమంత్రి కేఈ ఈశ్వరప్పపై వచ్చిన కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ కేసు ప్రభుత్వాన్ని మరింతఇబ్బందికరంగా మారింది. దీని నుంచి ప్రభుత్వాన్ని రక్షించడంలో బొమ్మై విఫలమయ్యారని అంటున్నారు. ఇత్యాధి కారణాల రిత్యా సీఎం మార్పు తప్పదని విశ్లేషకులు అంటున్నారు.

Read more