ధరణి చిక్కుముళ్లు వీడేనా?

ABN , First Publish Date - 2022-07-01T09:07:27+05:30 IST

సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం గుంటిపల్లికి చెందిన తాత చిన్న మల్లయ్యకు చెందిన భూమి నిషేధిత జాబితాలో ఉంది.

ధరణి చిక్కుముళ్లు వీడేనా?

  • సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి.. 
  • నేడు జిల్లాల కలెక్టర్లతో సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ 
  • పట్టా రైతులందరికీ ఏదో ఒక సమస్య
  • పరిష్కారానికి పైలట్‌ ప్రాజెక్టుగా ములుగు 
  • 17 రోజులుగా కుస్తీ.. కొలిక్కిరాని వైనం
  • మాడ్యుళ్ల సవరణ తప్పదా? 
  • ధరణి సమస్యాత్మకంగా మారింది:  రైతులు


హైదరాబాద్‌ సిద్దిపేట, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం గుంటిపల్లికి చెందిన తాత చిన్న మల్లయ్యకు చెందిన భూమి నిషేధిత జాబితాలో ఉంది. ఈ సర్వే నంబరులో మరో రైతుకు చెందిన భూమి వివాదాస్పదంగా ఉండటంతో మొత్తంగా ఆ సర్వే నంబరుకు చెందిన భూమినంతా నిషేధిత జాబితాలో చేర్చారు. అధికారుల తప్పిదాలు, ధరణిలో లోపాలతో తనకు నష్టం జరిగిందనేది తాత చిన్నమల్లయ్య ఆవేదన. ఇదే జిల్లా మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామ రైతు మేడిచల్మి మహేందర్‌కు పట్టా పాసు పుస్తకం రాలేదు. డూప్లికేట్‌ పాసు పుస్తకానికి ధరణిలో రూ.300 చెల్లించి దరఖాస్తు చేసుకున్నాడు. ఏడాదైనా ఇంత వరకు  పాసు పుస్తకం రాలేదు. ఇలాంటి రైతులు ఎందరో! ఇలా ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి పట్టా భూమి ఉన్న రైతులందరూ ఏదో ఒక సమస్య ఎదుర్కొంటున్నారు. రికార్డుల పరంగా ఉన్న్చ సమస్యల పరిష్కారంపై అధికారాలన్నీ జిల్లా కలెక్టర్లకు దఖలు పరచడం.. వారికి కుప్పలు తెప్పలుగా అర్జీలు వస్తుండటం.. ఆ మేరకు రికార్డులను సవరించేందుకు ధరణిలో అవకాశం లేకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రానురానూ ధరణి పోర్టల్‌పై  వ్యతిరేకత పెరుగుతుండటంతో సర్కారు దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. ధరణి వ్యవస్థ మీద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. కలెక్టర్ల లాగిన్లలో పేరుకుపోయిన దరఖాస్తుల వివరాలు ఆరా తీయడంతో పాటు ధరణి పోర్టల్‌తో ఆయా జిల్లాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నారు. వీటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కీలక సమావేశంతోనైనా ధరణి సమస్యలపై పరిష్కారం లభిస్తుందా? అనే ఆశ రైతుల్లో నెలకొంది. అయితే ధరణి సమస్యలను పరిష్కరించి, రెవెన్యూ సమస్యలు లేకుండా తీర్చిదిద్దేంకు ‘పైలట్‌ ప్రాజెక్టు’గా ప్రభుత్వం ఓ గ్రామాన్ని ఎంపిక చేసినా అక్కడ పెద్దగా ఫలితం రాకపోవడం గమనార్హం. 


  ధరణి సమస్యలను పరిష్కరించేందుకు సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ నెల 14న గ్రామంలో భూ సమస్యలున్న రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మంత్రి హరీశ్‌, సీఎస్‌ సోమేశ్‌, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితాసభర్వాల్‌, ఉన్నతాధికారులు స్వయంగా రైతులతో మాట్లాడారు. అందరి సమస్యలూ పరిష్కరిస్తామని భరోసా కూడా ఇచ్చారు. జూన్‌ 27 వరకు డెడ్‌లైన్‌ పెట్టారు. జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ములుగులోనే మకాం వేశారు. రెవెన్యూ వ్యవస్థపై పట్టున్న అధికారుల సాయంతో పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. అయితే 17 రోజులు గడుస్తున్నా సగానికి పైగా చిక్కుముళ్లు వీడలేదు. ఆ గ్రామంలో సాదాబైనామాలకు సంబంధించి 80 దరాఖస్తులు సహా మొత్తంగా 272 అర్జీలు వచ్చాయి. ఇందులో 15 రకాల సమస్యలు ఉన్నాయి. వీటిలో 100 అర్జీలకు ధరణిలో పరిష్కారం లేకపోవడంతో పక్కనబెట్టారు. చివరికి సమస్యలను పరిష్కరించేందుకు ఇరువర్గాల నడుమ రాజీ విధానమే సమంజసం అని..  లేదంటే ధరణిలో మాడ్యుళ్లను ప్రవేశపెట్టడమే మార్గం అనే అంచనాకు వచ్చారు.  కాగా ములుగు గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాంలోనూ ఉన్నాయి.  


ములుగులో ధరణి సమస్యలు ఇవీ.. 

పట్టాదారు పేరు నమోదులో దొర్లిన తప్పిదాలను మార్పు చేసేందుకు అవకాశం కల్పించాలి. 

సర్వే నంబర్‌ విస్తీర్ణంలో ఆర్‌ఎ్‌సఆర్‌కు మించిన  లేదా ఆర్‌ఎ్‌సఆర్‌కు తక్కువ విస్తీర్ణం నమోదైంది. అందులో తప్పుగా నమోదైన పేర్ల తొలగించేందుకు, కొత్త పట్టాదారులను చేర్చేందుకు మాడ్యూల్‌ పొందుపర్చాలి.

మిస్సింగ్‌ సర్వే నంబర్‌పై ఖాతా నంబరు ఉన్న రైతులకే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఖాతా నంబర్‌ లేనివారికి ఆ చాన్స్‌ లేదు. 

ఒక సర్వేనంబరులో మూడెకరాలుంటే, అందులో ఎకరం భూమి కాలువ రోడ్డు, ప్రాజెక్టు ఇతర ప్రభుత్వ అవసరాలకు పోయింది. మిగతా రెండెకరాలను నిషేధిత జాబితాలో నమోదు చేయడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.  

సాదాబైనామా కింద ధరఖాస్తు చేసుకుని 13-బీ ప్రొసిడింగ్‌ పొందిన రైతులకు తాజాగా ధరణిలో నమోదు చేసుకునే అవకాశం కల్పించాలి.

అసైన్డ్‌ భూమి ఉన్న రైతు మరణిస్తే ఆ స్థానంలో వారసులు భూమిని పొందే అవకాశం పూర్తిస్థాయిలో లేదు. అంటే.. అసైనీ చనిపోతే వారసుల్లో ఒక్కరి పేరు మీదే భూమిని నమోదు చేసే అవకాశం ఉంది. చనిపోయిన రైతుకు ఇద్దరు లేదా ముగ్గురు వారసులు ఉంటే సమానంగా పంచే అవకాశం ఽ లేదు. 

ఇనామ్‌ సర్టిఫికెట్లు పొందాలన్నా, గతంలో పొందిన సర్టిఫికెట్లను ధరణిలో నమోదు చేసుకోవాలన్నా ఆప్షన్‌ లేదు.  

సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో కొనుగోలు ప్రక్రియ పూర్తయి తహసీల్దార్‌ ఆఫీసులో మ్యూటేషన్‌ అయ్యేలోపు ధరణి రావడంతో ఆ భూములు కొనుగోలుదారు పేరిట రికార్డుల్లోకి ఎక్కడం లేదు.  ఇది గొడవలకు కారణమవుతోంది. 


పట్టాభూమి  అసైన్డ్‌ భూమిగా..

మా ఊర్లో 30 ఏళ్ల క్రితం ఎకరం కొన్నాం. అప్పుడు పట్టాదారు పాస్‌బుక్‌ వచ్చింది. రెవెన్యూ రికార్డుల్లో, 1-బీలో మాపేర్లే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కూడా కొత్త పాసుపుస్తకాల్లో పట్టాభూమిగానే నమోదైంది. ధరణి రాకతో మా భూమిని ప్రభుత్వ భూమిగా చూపిస్తున్నారు. ధరణితో మాకు అన్యాయం జరిగింది. 

-అన్నాడి శ్రీనివాసరెడ్డి, గాగిళ్లాపూర్‌, బెజ్జంకి  


30 గుంటలు.. 3 గుంటలుగా.. 

మాది దౌల్తాబాద్‌ మండలం తిరుమలాపూర్‌. 231 సర్వే నంబర్‌లో ఎకరా 30 గుంటలు ఉండగా ధరణిలో ఎకరా 3గుంటలుగా ఎంట్రీ చేశారు. 27 గుంటల భూమిని నమోదు చేయలేదు. మూడేళ్లుగా నా సమస్య చెబుతున్నా. నలుగురు ఆఫీసర్లు మారారు. కానీ పరిష్కారం లభించడం లేదు. 

  • -మాధవరెడ్డి, తిరుమలాపూర్‌, దౌల్తాబాద్‌  

ధరణితో మేం నష్టపోతున్నాం

పొన్నాల శివారులోని బట్టి రామన్నపల్లిలో గల 478 సర్వేనంబర్‌లో నా పేరు మీద 28 గుంటలు, 469 సర్వే నంబర్‌లో మా నాన్న పేరున ఎకరా 30 గుంటలు ఉంది. కొంతకాలం కింద కొనుగోలు చేసిన ఈ భూమి మా పేరిట రికార్డుల్లో లేదు. మాకు అమ్మినవారి పేరిట కూడా లేదు. అడిగితే ఆప్షన్‌ లేదంటున్నారు. మేమే కబ్జాలో ఉన్నాం. ధరణిలో ఆప్షన్‌ లేకపోతే మేం నష్టపోవాలా? 

-శనిగరం యాదగిరి, పొన్నాల, సిద్దిపేట అర్బన్‌  

Updated Date - 2022-07-01T09:07:27+05:30 IST