Research కోసం నా కొడుకు మృతదేహాన్ని దానం చేస్తా...

ABN , First Publish Date - 2022-03-19T13:32:20+05:30 IST

తన కుమారుడి మృతదేహాన్ని వైద్య పరిశోధనల కోసం దానంగా ఇస్తానని ఉక్రెయిన్‌లో మరణించిన వైద్యవిద్యార్థి తండ్రి శనివారం వెల్లడించారు...

Research కోసం నా కొడుకు మృతదేహాన్ని దానం చేస్తా...

ఉక్రెయిన్‌లో మరణించిన విద్యార్థి తండ్రి వెల్లడి

న్యూఢిల్లీ: తన కుమారుడి మృతదేహాన్ని వైద్య పరిశోధనల కోసం దానంగా ఇస్తానని ఉక్రెయిన్‌లో మరణించిన వైద్యవిద్యార్థి తండ్రి శనివారం వెల్లడించారు. ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నగరంలో రష్యా దాడిలో మరణించిన భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడర్ మృతదేహం బెంగళూరు విమానాశ్రయానికి సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు చేరుకుంటుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చెప్పారు. తమ కుమారుడి మృతదేహాన్ని వైద్య పరిశోధన కోసం దానం చేయాలని నిర్ణయించుకున్నామని నవీన్ తల్లిదండ్రులు ప్రకటించారు.  


‘‘నా కొడుకు వైద్య రంగంలో ఏదైనా సాధించాలనుకున్నాడు, అది జరగలేదు. కనీసం వాడి శరీరాన్ని ఇతర వైద్య విద్యార్థులు చదువుకోడానికి ఉపయోగించవచ్చు. అందుకే ఇంట్లో మేం అతని శరీరాన్ని వైద్య పరిశోధన కోసం దానం చేయాలని నిర్ణయించుకున్నాం’’అని నవీన్ తండ్రి శంకరప్ప తెలిపారు.‘‘నా కొడుకు మృతదేహం 21వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఉదయం 9 గంటలకు మృతదేహం మా గ్రామానికి చేరుకుంటుంది. అనంతరం వీరశైవ సంప్రదాయం ప్రకారం పూజలు చేసి ప్రజల సందర్శనార్థం ఉంచుతాం. వైద్య చదువుల నిమిత్తం మృతదేహాన్ని దావణగెరెలోని ఎస్‌ఎస్‌ ఆసుపత్రికి దానం చేస్తాను’’ అని నవీన్‌ తండ్రి తెలిపారు.


హవేరి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి, ఎమిరేట్స్ ఫ్లైట్ సర్వీస్ నుంచి కూడా మెసేజ్ వచ్చిందని శంకరప్ప చెప్పారు. కనీసం మా కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉన్నామన్నారు. సీఎం నాతో మాట్లాడారని శంకరప్ప తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై నవీన్ శేఖరప్ప కుటుంబానికి రూ.25 లక్షల చెక్కును అందజేసి,అతని కుటుంబ సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు.


Updated Date - 2022-03-19T13:32:20+05:30 IST