న్యాయ పోరాటం చేస్తా

ABN , First Publish Date - 2022-06-30T09:40:59+05:30 IST

‘కోడికత్తి ఘటనను అడ్డు పెట్టుకుని రాష్ట్రాన్ని తగులబెట్టాలి అనుకున్నారు.. అడ్డుకున్నందుకే కక్షగట్టారు.

న్యాయ పోరాటం చేస్తా

  • 30 ఏళ్ల సర్వీసులో ఏ తప్పూ చేయలేదు
  • ‘కోడికత్తి’తో రాష్ట్రాన్ని తగులబెట్టాలని చూశారు
  • అడ్డుకున్నందుకే నాపై కక్షగట్టారు
  • అవినీతే జరగని కేసులో ఎఫ్‌ఐఆర్‌
  • ట్రయల్‌ లేదు.. చార్జిషీటూ వేయలేదు
  • ఇక సాక్షుల్ని ఎలా ప్రభావితం చేస్తాను?
  • జగన్‌పై సీబీఐ, ఈడీ కేసుల్లో చార్జిషీట్లు వేశారు
  • ఐఏఎస్‌ శ్రీలక్ష్మిపైనా ఉన్నాయి.. ఆమెకు వర్తించని
  • ఆలిండియా రూల్స్‌ నాకేనా?: ఏబీవీ 


అమరావతి, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): ‘కోడికత్తి ఘటనను అడ్డు పెట్టుకుని రాష్ట్రాన్ని తగులబెట్టాలి అనుకున్నారు.. అడ్డుకున్నందుకే కక్షగట్టారు.. 30 ఏళ్ల సర్వీసులో ఏ తప్పూ చేయలేదు.. రూపాయి ఖర్చు చేయని దాంట్లో అవినీతి ఎలా జరుగుతుంది..? ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తా.. తగ్గే ప్రసక్తే లేదు’ అని నిఘా విభాగం మాజీ చీఫ్‌, డీజీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ నెల 15న పోస్టింగ్‌ ఇచ్చిన ప్రభుత్వం రెండు వారాలు తిరక్కుండానే మళ్లీ తనను సస్పెండ్‌ చేయడంపై  ఆయన స్పందించారు. బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘అవినీతే జరగని కేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ట్రయల్‌ జరగడంలేదు.. చార్జిషీటు వేయనే లేదు.. అలాంటప్పుడు సాక్షులను ఎలా ప్రభావితం చేస్తాను? ప్రభుత్వానికి ఇటువంటి చచ్చు సలహాలు ఏ తీసేసిన, పనికిమాలిన తహశీల్దార్‌ ఇస్తారో అర్థం కావడం లేదు. ఒకసారి ఒక ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు కొట్టి వేశాక అదే కేసులో సెక్షన్లు మార్చకుండా ఎలా సస్పెండ్‌ చేస్తారు? ఇవేవీ న్యాయ సమీక్షకు నిలబడేవి కావు. అవినీతి, మనీ లాండరింగ్‌ వ్యవహారంలో 12 సీబీఐ, 6 ఈడీ కేసుల్లో సీఎం జగన్‌పై చార్జిషీట్లు ఉన్నాయి.. ఐఏఎస్‌ శ్రీలక్ష్మిపైనా ఉన్నాయి.. ఆమెకు వర్తించని ఆలిండియా సర్వీస్‌ రూల్స్‌ నాకు మాత్రమే వర్తిస్తాయా..’ అని ప్రభుత్వాన్ని నిలదీశారు.


కొన్ని శక్తులే టార్గెట్‌ చేశాయి..

ఏసీబీ ఇచ్చిన నివేదికలో ప్రతి వాక్యం తప్పని నిరూపిస్తానని, రూపాయి కూడా అవినీతి జరగని కేసులో ఎలా కేసు పెట్టి సస్పెండ్‌ చేస్తారని ఏబీవీ ప్రశ్నించారు. కొన్ని శక్తులు, కొందరు వ్యక్తులు తనను టార్గెట్‌ చేశారని, తాను తప్పు చేసినట్లు మూడేళ్లలో ఎక్కడా నిరూపణ కాలేదన్నారు. ఎన్నో వెధవ పనులు అడ్డుకోవడం వల్లే తాను టార్గెట్‌ అయ్యానని, ప్రభుత్వాన్ని పడగొడతానంటూ తానేమీ రాజ్‌భవన్‌ ముందు కామెంట్‌ చేయలేదని జగన్‌కు చురకంటించారు. సమాజానికి హాని కలిగించే పురుగులను ఏరివేసే వ్యవసాయం చేస్తున్నానని.. దుర్మార్గుడైన రాజు పాలనలో పని చేయడం కన్నా అడవిలో వ్యవసాయం చేసుకోవడం మంచిదంటూ ఒక కవి చెప్పిన మాటల్ని ఏబీవీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో పార్టీ మారిన 23 మంది ఎమ్మెల్యేల్లో 22 మంది బతికే ఉన్నారని, పార్టీ మారాలని తానేమైనా ప్రేరేపించానేమో అడగొచ్చని సూచించారు. జగన్‌ పత్రికలో తనపై వచ్చిన కథనాలన్నీ తప్పులేనని, పరువు నష్టం దావా వేసేందుకు 12 వారాల సమయం కూడా అయిపోయిందన్నారు. ‘మేం గెలవబోతున్నాం.. నీ సంగతి చూస్తాం’ అంటూ అర్ధరాత్రి తనకు ఫోన్‌ చేసిన నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ప్రజా ప్రతినిధి నిన్న మీడియా ముందు బోరున ఏడ్చారని.. జీవితం ఎప్పుడూ అందరికీ ఒకేలా ఉండదని ఏబీవీ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-06-30T09:40:59+05:30 IST