సోనూసూద్ విన్నపాన్ని ప్రభుత్వాలు పట్టించుకుంటాయా..? అదే కనుక జరిగితే..

ABN , First Publish Date - 2021-05-02T11:42:15+05:30 IST

కరోనా కష్టకాలంలో ఎంతోమంది కష్టజీవులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అప్పటి వరకూ సాఫీగా సాగిపోయిన జీవితాలను కరోనా మహమ్మారి ఒక్కసారిగా అతలాకుతలం చేసేసింది. నిన్నమొన్నటి వరకూ కారుల్లో తిరిగిన వారు..

సోనూసూద్ విన్నపాన్ని ప్రభుత్వాలు పట్టించుకుంటాయా..? అదే కనుక జరిగితే..

కరోనా కష్టకాలంలో ఎంతోమంది కష్టజీవులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అప్పటి వరకూ సాఫీగా సాగిపోయిన జీవితాలను కరోనా మహమ్మారి ఒక్కసారిగా అతలాకుతలం చేసేసింది. నిన్నమొన్నటి వరకూ కారుల్లో తిరిగిన వారు.. నేడు నాలుగు చక్రాల బండిపై కూరగాయలు అమ్ముకుంటున్న దృశ్యాలు కోకొల్లలు. ఉద్యోగాలు పోవడంతో ఆర్థిక సమస్యలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్యకు కొదవేలేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. తాజాగా కూడా ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోవడంతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వారికోసం కరోనా కాలంలో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న సోనూ సూద్ ఒక డిమాండ్ తీసుకొచ్చారు. ప్రభుత్వాలు దీనిపై ఆలోచించాలని సూచించారు.


కరోనా లాక్‌డౌన్ సమయంలో వలస కూలీలకు, పేదవారికి అండగా నిలిచి తన మంచి మనసుతో రియల్ హీరోగా ఎదిగారు సోనూ సూద్. కరోనా సమయంలో బాలీవుడ్ సెలెబ్రెటీలందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉంటే.. సోనూ సూద్ మాత్రం పేదలకు సాయం చేయడానికే తన సమయం మొత్తం కేటాయించారు. వలస కూలీలను స్వగ్రామాలకు పంపడానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం నుంచి, లాక్‌డౌన్ నిబంధనలు కొంచెం తొలగ్గానే వారిని విమానాల్లో ఇళ్లకు పంపడం వరకూ సోనూ సూద్ చేసిన సేవా కార్యక్రమాలు అన్నీ ఇన్నీ కావు. దీంతో ప్రజలంతా అతన్ని రియల్ హీరో అంటూ నీరాజనాలు పట్టడం ప్రారంభించారు. 




ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్‌తో భారత్ అల్లాడుతున్న సమయంలో కూడా సోనూ సూద్ చేతులు ముడుచుకొని కూర్చోలేదు. ఈ మహమ్మారి కారణంగా జీవితాలు అస్తవ్యస్తం అయిన వారికి అండగా నిలబడి చేతనైన సాయం చేస్తూ వచ్చారు. ఇలా సేవ చేస్తూనే ప్రభుత్వాలను ఈ రియల్ హీరో ఓ విన్నపం చేశాడు. ఆయన చేసిన డిమాండ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితంగా ఆలోచించాల్సిందే అంటూ నెటిజన్లు సోనూకు మద్దతుగా నిలిచారు. ఇంతకీ సోనూ సూద్ చేసిన డిమాండ్ ఏంటో తెలుసా? కరోనా కారణంగా తల్లిదండ్రులు ఇద్దరినో లేక ఒకరినో కోల్పోయిన 8 నుంచి 12 సంవత్సరాల చిన్నారులకు ఉచిత విద్య అందించాలని ప్రభుత్వాలను కోరాడు సోనూ సూద్.


ఈ చిన్నారులకు కేవలం ప్రాథమిక విద్యే కాకుండా వారికి నచ్చిన రంగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే వరకూ ఉచిత విద్య అందించాలని సోనూ సూద్ కోరారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ చిన్నారుల జీవితాలు నాశనం కాకూడదని చెప్పిన ఈ యాక్టర్.. వారికి సొంతకాళ్లపై నిలబడే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని వివరించాడు. కాగా, దేశంలో చాలా చోట్ల కరోనా తిప్పలు తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇలా సూసైడ్ చేసుకుంటున్న కొందరు తాము మరణిస్తే తమ పిల్లలు అనాథలైపోతారనే ఉద్దేశ్యంతో ముందుగా వారి ప్రాణాలు తీసి, ఆపై తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. సోనూ సూద్ చేసిన ప్రతిపాదన వల్ల ఇలాంటి ఘటనలు కూడా తగ్గుతాయని నెటిజన్లు అంటున్నారు. దీనిపై ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి మరి.

Updated Date - 2021-05-02T11:42:15+05:30 IST