Hyderabad ఇకపై డ్రోన్‌ హబ్‌గా మారనుందా..!?

ABN , First Publish Date - 2022-02-02T12:52:19+05:30 IST

దేశంలోనే మొదటిసారిగా కొవిడ్‌ వ్యాక్సిన్‌లను డ్రోన్‌ల ద్వారా రాష్ట్రంలో డెలివరీ చేశారు. మూడు కిలోమీటర్ల దూరం లో

Hyderabad ఇకపై డ్రోన్‌ హబ్‌గా మారనుందా..!?

  • సత్తా చాటుతున్న కంపెనీలు  
  • బడ్జెట్‌లో ప్రకటనతో ఊతం

హైదరాబాద్‌ సిటీ : దేశంలోనే మొదటిసారిగా కొవిడ్‌ వ్యాక్సిన్‌లను డ్రోన్‌ల ద్వారా రాష్ట్రంలో డెలివరీ చేశారు. మూడు కిలోమీటర్ల దూరం లో ఉన్న పీహెచ్‌సీ సెంటర్‌కు ఏడు నిమిషాల్లో వ్యాక్సిన్‌లను అందజేసి అప్పట్లో డ్రోన్‌ టెక్నాలజీతో ఉన్న ఉపయోగాలను చూపారు. అడవుల పెంపకం అవసరాన్ని తెలిపేందుకు హరా బహారా అంటూ రూపొందించిన కార్యక్రమంలో భాగంగా విత్తనాలను చల్లేందుకు డ్రోన్లను ఉపయోగించారు. తెలంగాణ పోలీసులు డయల్‌ 100కు ఫోన్‌ చేస్తే పోలీసులు రావడానికి కన్నా ముందే డ్రోన్‌ మీ ఇంటికి వచ్చేస్తుందనే భరోసా అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. 


ఈ-కామర్స్‌ డెలివరీలు, పురుగు మందుల పిచికారి,  ఒకటనేమిటి, అన్నిటికీ డ్రోన్లనే ఆలంబనగా చేసుకుంటున్నారు. ఈ డ్రోన్ల తయారీ, వాటి వెనుక దాగిన హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన సహా పైలెట్‌ల శిక్షణ వరకూ కేంద్రంగా హైదరాబాద్‌ వెలుగొందుతోంది. తాజాగా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి డ్రోన్ల పరిశ్రమకు ప్రోత్సాహకాలు ప్రకటించడంతో ఇప్పటికే స్టార్టప్‌, సాఫ్ట్‌వేర్‌, ఫార్మా, ఏవియేషన్‌ హబ్స్‌గా వెలుగొందుతున్న హైదరాబాద్‌ ఇకపై డ్రోన్‌ హబ్‌గా కూడా వెలుగొందనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


డ్రోన్ల రంగానికి అవకాశాలు విస్తృతం

 హైదరాబాద్‌ డ్రోన్‌ కంపెనీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పనిచేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వ సంహిత ప్రాజెక్ట్‌ వ్యయం రూ. 400 కోట్లు. ల్యాండ్‌ సర్వే ప్రాజెక్ట్‌ అది. అలాగే మరికొన్ని ప్రాజెక్టులతో మొత్తం తెలంగాణాలోనే రూ. వెయ్యి కోట్ల ప్రాజెక్టులు ఉన్నాయి. తాజా బడ్జెట్‌ ద్వారా అవకాశాలు పెరుగుతాయనుకుంటున్నాం. చాలా కంపెనీలు డ్రోన్ల పరంగా హైదరాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మార్కెటింగ్‌ పెరిగితే ఎక్కువ మంది ఈ రంగంలోకి వచ్చే అవకాశాలున్నాయి. మన దగ్గర డ్రోన్‌ అకాడమీలు ఉన్నాయి. ఇవన్నీ సానుకూల అంశాలు. ఐటీ పరిశ్రమలాగానే డ్రోన్‌ పరిశ్రమ కూడా పెరుగుతోంది. - మారుత్‌ డ్రోన్స్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ ప్రేమ్‌ కుమార్‌ విశ్లావత్‌.

Updated Date - 2022-02-02T12:52:19+05:30 IST