బెంగాల్‌ బాటలో భారత్‌ నడుస్తుందా?

May 7 2021 @ 04:22AM

వర్తమాన భారతదేశపు  అగ్రగామి నాయక ద్వయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సర్వసాధకుడయిన మహా శక్తిమంతుడుగా మోదీ నీరాజనాలు అందుకుంటుండగా భారతీయ జనతాపార్టీ ప్రధాన వ్యూహకర్తగా అమిత్ షా గణుతికెక్కారు. ఈ ఇరువురూ అజేయులని వారి అభిమానులు, మద్దతుదారులు ఏడేళ్ళుగా టాంటాం చేస్తున్నారు. నడిచిన చరిత్ర ఈ ప్రచార అతిశయతను పూర్తిగా తిరస్కరించలేకపోయింది. నరేంద్ర మోదీ, ఆయన పాలనానమూనాకు ‘అచ్ఛే దిన్’, ‘నవ’ భారత్ అనేవి పర్యాయపదాలుగా ప్రజల పిచ్చాపాటీలో తరచు ప్రస్తావితమవుతుండగా అమిత్ షా ఆధునిక చాణక్యుడిగా రాజకీయ వర్గాన్ని అదరగొడుతున్నారు. అయితే కాలం సదా ఒకలా ఉండదు. గత నెల ఈ నాయకద్వయం కీర్తికిరీటాలు కూలిపోయాయి. ఉగ్రతాండవం చేస్తున్న కరోనా విషక్రిమి ప్రధానమంత్రి పాలనాశైలిపై పలు క్లిష్ట ప్రశ్నలు లేవనెత్తగా పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పరాజయం అపర చాణక్యుడి వ్యూహచాతుర్యాన్ని అభాసుపాలు చేసింది. 


కొవిడ్ 2.0 ఒక ‘భయంకర బాధల పాటల పల్లవి’. ఆ బాధలు అంత తేలిగ్గా ఉపశమించేవి కావు. ఆ మహమ్మారి ఎవరి పట్ల దయాదాక్షిణ్యాలు చూపదు. అయితే ఆ భయానక విపత్తుపై పోరు విషాదగతుల పాలవడం వెనుక కేంద్రంలోని పాలకుల బాధ్యతారాహిత్యం లేదనగలమా? జనసందోహాలు అపారంగా గుమిగూడే కుంభమేళా లాంటి ఉత్సవాలకు అనుమతివ్వడం, తీరూతెన్నూ లేని టీకా విధానం, ఆక్సిజన్ సరఫరాలో అవకతవకలు, పటిష్ఠ చర్యలు చేపట్టాల్సిన ప్రతి సందర్భంలోనూ తడబడడం లేదా అసంబద్ధ వైఖరిని అవలంభించడం మొదలైనవన్నీ కొవిడ్ మహోగ్రరూపం దాల్చడానికి దారితీశాయి. 


న్యాయస్థానాలు పదే పదే హెచ్చరిస్తే గానీ ప్రభుత్వం చురుగ్గా చర్యలు చేపట్టకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పాలనలో ఉద్యోగస్వామ్య ధోరణులు పెచ్చరిల్లిపోవడమే అందుకొక ప్రధాన కారణం. కొవిడ్ బాధితుల వాస్తవ సమస్యలపై అవగాహన లేకుండా తాము చేపట్టిన చర్యలపై సంతృప్తితో ఉండడం, అవశ్యం చేయవలసిన వాటి విషయంలో అహంకారపూరిత నిర్లక్ష్యం చూపడమూ కొవిడ్ సంక్షోభాన్ని విషమింప చేశాయి. సామాజిక మాధ్యమాల్లో బీజేపీ దళాలు తరచు ‘పప్పు’ అని అధిక్షేపించే రాహుల్ గాంధీ మొదటి నుంచీ, కొవిడ్ నివారణ విషయమై ప్రభుత్వానికి చేస్తున్న హెచ్చరికలు సహేతుకమైనవని రుజువు కావడం కూడా అధికారపక్షానికి మరింత ఇబ్బందికర పరిస్థితులను సృష్టించింది. సరే, గుజరాత్ అభివృద్ధి నమూనా గురించి బీజేపీ వర్గాలు ఘనంగా చెప్పని రోజంటూ ఉన్నదా? మరి కరోనా సంక్షోభ వేళ గుజరాత్‌లో పరిస్థితులు ఏమిటి? ప్రభుత్వ ఆసుపత్రుల వెలుపల బారులు తీరిన బాధితులు, ఆసుపత్రుల్లో కనీస సదుపాయాల కొరత అందరికీ పలు కఠోర వాస్తవాలను చెప్పకనే చెప్పేశాయి. ప్రజారోగ్యరంగంలో కనీసస్థాయిలో కూడా మదుపు చేయని అభివృద్ధి నమూనా ఎవరి శ్రేయస్సు కోసం? గుజరాత్ అభివృద్ధి నమూనాలోని గర్హనీయమైన, సమర్థించలేని లొసుగులు ఇప్పుడు దేశప్రజలందరికీ వెల్లడయ్యాయి.


పశ్చిమబెంగాల్‌లో సైతం ప్రచార అతిశయతే ప్రాధాన్యం పొందింది. యుద్ధం ప్రారంభం కాకముందే ‘వచ్చాం, చూశాం, జయించాం’ అన్న గర్వాతిశయాన్ని బీజేపీవర్గాలు ప్రదర్శించాయి. అపార వనరులు, వ్యవస్థాగత మద్దతు, మీడియా మెరుపు యుద్ధాలు మొదలైనవి బెంగాల్లో బీజేపీ ఘనవిజయం సాధించనున్నదని దేశప్రజలు అనుకునేలా చేశాయి. అయితే వాస్తవమేమిటి? 2019 సార్వత్రక ఎన్నికలలో బీజేపీ గణనీయమైన విజయాలను సొంతం చేసుకున్న మాట నిజమే. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఉన్న ప్రజాబలం సన్నగిల్లిపోయిందని, అసెంబ్లీ ఎన్నికలలో ఆమె పరాజయం ఖాయమని బీజేపీవర్గాలు అహంకరించాయి. ముఖ్యంగా అమిత్‌షాకు బెంగాల్‌ను గెలుచుకోవడం అనేది ఒక జీవిత లక్ష్యమైపోయింది. అందుకే ఆయన బెంగాల్ విషయంలో ఎనలేని శ్రద్ధ చూపారు. మరి ఆయన కేంద్ర హోంమంత్రి కదా! పార్టీ ప్రచార బాధ్యతలను నిర్వర్తించేందుకు అమిత్ షా హోంమంత్రిగా తన బాధ్యతలను విస్మరించారు. ప్రజలను వేధిస్తున్న కొవిడ్ సమస్యలను ఉపేక్షించారు. తన శక్తియుక్తులను పూర్తిస్థాయిలో పార్టీ ప్రచారానికే వినియోగించారు. దేశవ్యాప్తంగా సకల రాష్ట్రాలలో అమలవుతున్న కొవిడ్ ఉపశమన కార్యక్రమాలను సమన్వయపరచడంపై ఆయన ఉపేక్ష వహించారు. ప్రతిపక్షం అధికారంలో ఉన్న మరో రాష్ట్రాన్ని బీజేపీ పాలనా ఛత్రం కిందకు తీసుకురావడమే ఆయన ఏకైక లక్ష్యమైపోయింది. 


నార్త్ బ్లాక్ (కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నెలవు)లో తిష్ఠ వేసి, దేశ వ్యవహారాలను పర్యవేక్షించి, చక్కదిద్దాల్సిన అమిత్ షా బెంగాల్ పట్టణాలు, గ్రామసీమల్లో రోడ్ షోల నిర్వహణకు ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. వందలు వేలు, లక్షల సంఖ్యలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దురదృష్ట మేమింటే అంత మంది ప్రజలు ‍ఒక చోటకు వచ్చినప్పుడు  తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించేలా చూడాలన్న కరోనా నిబంధనను ప్రతి ఒక్కరూ కచ్చితంగా అనుసరించేలా చేయలేకపోయారు.


ప్రత్యర్థుల దాడిలో గాయపడి వీల్ చైర్‌కే పరిమితమవ్వాల్సి వచ్చినా ముఖ్యమంత్రి మమత మొక్కవోని దీక్షతో అలానే ప్రచారం చేసి బీజేపీ బలాఢ్యులను సమర్థంగా అడ్డుకోవడం బెంగాలీ ఉపజాతీయవాద భావోద్వేగాల ప్రభావ ఫలితమే. ‘బయట నుంచి’ వచ్చిన హిందీ మాట్లాడేవారు బెంగాలీ సంస్కృతిలో పుట్టి పెరిగిన బెంగాల్ తనయకు సాటి ఎలా అవుతారు? బెంగాలీలు మమత వైపు మొగ్గటం ద్వారా తమ విలక్షణతను నిలబెట్టుకున్నారు.


మరి ‘నెంబర్ వన్ దేశ నాయక ద్వయం’ తిరోగమిస్తుందా? అవును, కాదు అనేది ఆ ప్రశ్నకు సమాధానం. మహమ్మారిని అదుపు చేయడంలో మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ ప్రధానమంత్రి ఆసేతు హిమాచలం యావద్భారతీయుల ఆదరాభిమానాలు పొందుతున్న ఏకైక నాయకుడిగా ఉన్నారు. ఈ దేశ ప్రజలతో ఆయనకు గల అనుబంధం రాత్రికిరాత్రే ఆవిరైపోలేదు, పోదు కూడా. పక్కా రాజకీయవేత్త అయిన అమిత్ షా ఈ సంవత్సరాంతంలో జరగనున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు సంసిద్ధమవుతున్నారు. ఘటనా ఘటన సమర్థులైన ఈ నాయకద్వయం రంగం నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమయిందన్న వార్తలు అత్యుక్తులు మాత్రమే అనడంలో సందేహం లేదు. భారత్ -2024ను బెంగాల్ 2021 ఎలా ప్రతిబింబిస్తుంది? ఎన్నికలు ప్రతిసారీ భిన్నంగా జరుగుతాయి. తదుపరి సార్వత్రక ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ వ్యవధి ఉన్నది. మరి భారతదేశ రాజకీయాలలో మూడేళ్లు అంటే చాలా సుదీర్ఘకాలం సుమా! 


అయితే మౌలిక ఆరోగ్య సేవలు కుప్పకూలిపోవడం పట్ల ప్రజాగ్రహాన్ని తక్కువగా అంచనా వేయడం రాజకీయ అవివేకమే అవుతుంది. లక్షలాది ప్రజలు వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒంటిస్తంభపు మేడలో ఉండకూడదని ఢిల్లీ హైకోర్టు సరిగానే హెచ్చరించింది. ఆక్సిజన్, ఐసియు పడకల కోసం ప్రజలు అల్లల్లాడిపోతున్నప్పుడు వారిని చిత్తశుద్ధితో ఆదుకోవడం ప్రభుత్వ విధ్యుక్తధర్మం. సహానుభూతి, సహజ వివేకంతో ఈ నైతిక కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అలాకాకుండా ఉద్యోగస్వామ్య ఉదాసీనత, జిత్తులమారి తనపు నిర్వహణా దృక్పథంతో వ్యవహరిస్తే సమస్య సమసిపోదు. ప్రజల బాధలు తీరవు. పాలకులపై విమర్శలు ‘జాతి వ్యతిరేకం’ అని భావించే నిరంకుశాధికార తత్వం ప్రమాదకరమయింది ఆక్సిజన్ కోసం దేశప్రజలు కొట్టుమిట్డాడుతున్నప్పుడు ప్రధానమంత్రి చేయవలసిందేమిటి? వైద్యశాస్త్రం, వ్యాపారరంగం, రాజకీయాలు మొదలైన విభిన్న రంగాలలో ఉత్కృష్ట సేవలు చేస్తున్న వారందరితో ఒక కమిటీనేర్పాటు చేసి సమస్య పరిష్కారంలో తప్పులు ఎక్కడ జరిగాయో గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టడాన్ని ప్రోత్సహించడమే కాదూ? అలాగే విధాన నిర్ణయ ప్రక్రియను వికేంద్రీకరించడానికి ఇది సరైన సమయం కాదూ? తమతో విభేదిస్తున్నప్పటికీ ఉపయోగకరమైన సేవలు అందించగల వారిని కలుపుకుపోవడానికి పాలకులు శ్రద్ధ చూపాలి.


దురదృష్టవశాత్తు చేసిన తప్పులను అంగీకరించి, వాటి పర్యవసానాలకు బాధ్యత వహించే పరిణతి ‘మహా శక్తిమంతులైన’ రాజకీయనాయకులలో చాలా అరుదు. సంభవించిన దుష్పరిణామాలకు బాధ్యతలను ఇతరులపై నెట్టివేయడానికి బదులు నరేంద్ర మోదీ-, అమిత్ షా తాము చేసిన తప్పులను అంగీకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరు దేనికి జవాబుదారీతనం వహించాలో నిర్ణయించి పాలనలో మార్పులు తీసుకురావాలి. ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ విషయాన్నే తీసుకోండి. ఆయన మంచి స్నేహ మర్యాదలు చూపుతారు.. అయితే కొవిడ్ వాస్తవ పరిస్థితులపై ఆయనకు సరైన అవగాహన ఉందా? దేశంలో వ్యాక్సిన్ నిల్వలు సమృద్ధంగా ఉన్నాయని ఆయన గత నెలలో ప్రకటించారు. అయితే అప్పటికే వ్యాక్సిన్ నిల్వలు తగ్గిపోతున్నాయనే ఆందోళన పలు రాష్ట్రాలలో వ్యక్తమవసాగింది. ఈ ఆరోగ్యమంత్రే గత మార్చి తొలిరోజుల్లో ‘మనం మహమ్మారి చివరి అంకంలో ఉన్నామని’ ఆనందంగా ప్రకటించారు! ఇది బాధ్యతాయుతమైన ప్రకటనేనా? ఒక మంత్రి రాజీనామా, ప్రధానాధికారులను మార్చివేసినంత మాత్రాన కరోనా వ్యాధిని నిరోధించడం సాధ్యం కాదు. అయితే ప్రజల మనోభావాలకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందనడానికి అది తప్పకుండా ఒక సూచన అవుతుంది. 


నరేంద్ర మోదీ సంకల్పం ‘అచ్ఛే దిన్’. అది, ఆమ్‌ఆద్మీ స్వప్నం కూడా. ఎంత చక్కటి స్వప్నం! అయితే కరోనా వ్యాధికి బలైన వారి చితిమంటల్లో ఆ స్వప్నం దగ్ధమయింది. ఆ స్వప్నాన్ని ఆవరించుకుని ఉన్న భావోద్వేగాలు భగ్నమైపోయాయి. కొవిడ్ మహమ్మారి ఒక అనూహ్య భయానక విషాదం. ఈ జీవనబీభత్సానికి బాధ్యులు ఎవరని దేశప్రజలు ప్రశ్నిస్తున్నారు. కనీసం ఈ బాధ్యతనైనా మన పాలకులు సరిగ్గా నిర్వర్తిస్తారా?

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.