Kerala: కరోనా కలకలం...24గంటల్లో 30వేలకుపైగా కేసులు

ABN , First Publish Date - 2021-08-26T13:39:23+05:30 IST

దేశంలో కేరళ రాష్ట్రం కరోనా థర్డ్ వేవ్ కు కేంద్రంగా మారిందా? అంటే అవునని చెపుతున్నాయి...

Kerala: కరోనా కలకలం...24గంటల్లో 30వేలకుపైగా కేసులు

తిరువనంతపురం (కేరళ): దేశంలో కేరళ రాష్ట్రం కరోనా థర్డ్ వేవ్ కు కేంద్రంగా మారిందా? అంటే అవునని చెపుతున్నాయి కేరళలో నమోదు అవుతున్న కరోనా కేసుల వ్యాప్తి చూస్తే...కేరళ రాష్ట్రంలో తాజాగా గడచిన 24 గంటల్లో 30వేల కరోనా కేసుల మార్కును దాటింది. బుధవారం ఒక్కరోజే కేరళలో 31,445కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. మూడు నెలల విరామం తర్వాత కరోనా టెస్టు పాజిటివిటీ రేటు 19 శాతానికి పెరిగింది. ఒక్కరోజే 30వేలకు పైగా కరోనా కేసులు నమోదుతో పాటు 215 మంది మరణించారు. మే నెలలో 30,491 కరోనా కేసులు నమోదు కాగా, మూడు నెలల తర్వాత బుధవారం మళ్లీ 30వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. 


కేరళలో కరోనా మృతుల సంఖ్య 19,972కు పెరిగింది. ఓనం ఉత్సవాల తర్వాత కరోనా టెస్టు పాజిటివిటీ రేటు 20 శాతానికి పైగా పెరుగుతుందని వైద్యనిపుణులు గతంలోనే హెచ్చరించారు. జులై 27 నుంచి బక్రీద్ వేడుకల సందర్భంగా ఆంక్షల సడలింపుతో రోజుకు 20వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేరళలోని ఎర్నాకులం జిల్లాలో అత్యధికంగా 4,048కరోనా కేసులు వెలుగుచూశాయి. త్రిస్సూర్ జిల్లాలో 3,865 కేసులు, కోజికోడ్ (3,680), మలప్పురం (3,502), పాలక్కాడ్ (2,562), కొల్లాం (2,479), కొట్టాయం (2,050), కన్నూర్ (1,930) అలప్పుజ ( 1,874), తిరువనంతపురం (1,700), ఇడుక్కి (1,166) పతనంతిట్ట (1,008) , వయనాడ్ జిల్లాలో 962 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.


కొత్త కేసుల్లో 123 మంది ఆరోగ్య కార్యకర్తలు, మరో 138 మంది బయటి వారికి కరోనా సోకింది.కరోనా అనుమానంతో 4,44,278 మంది ఇళ్లలో క్వారంటైన్ లో ఉన్నారు. కేరళ ఆసుపత్రుల్లో 26,582 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.కరోనా మహమ్మారి వ్యాప్తిని తగ్గించడానికి ఇంటెన్సివ్ స్క్రీనింగ్/టెస్టింగ్ ప్రోగ్రామ్ ప్రారంభించామని కేరళ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ చెప్పారు.జ్వరం, జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్న లేదా కరోనా సోకిన వారు, కొవిడ్ పాజిటివ్ వ్యక్తులతో పరిచయం ఉన్న వారందరికీ వైరస్ పరీక్షలు చేయించాలని మంత్రి ఆదేశించారు.శ్వాసకోశ సమస్యలు, తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్న వ్యక్తులు కొవిడ్ -19 సోకకుండా చూసుకోవాలని మంత్రి వీణాజార్జ్ సూచించారు.


Updated Date - 2021-08-26T13:39:23+05:30 IST