సంస్కరణల పేరుతో స్కూళ్లు మూసేస్తారా?

ABN , First Publish Date - 2022-07-07T08:43:18+05:30 IST

సంస్కరణల పేరుతో స్కూళ్లు మూసేస్తారా?

సంస్కరణల పేరుతో స్కూళ్లు మూసేస్తారా?

చిన్నారులు కిలోమీటర్ల దూరం వెళ్లి చదువుకోవాలా?.. సర్కారుపై హైకోర్టు ఫైర్‌

విద్యార్థులు, టీచర్ల నిష్పత్తిని పాటించరా?

విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా విలీనం, హేతుబద్ధీకరణ ఎలా చేపడతారు?

ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలి

తెలుగులో బోధనే లేకుండా చేస్తారా?

తల్లిదండ్రులు ఆంగ్లం కోరుతున్నా

తెలుగు మీడియమూ కొనసాగించాల్సిందే

ప్రభుత్వ చర్యలు వ్యవస్థను బలపరచాలి

నిర్వీర్యం చేసేలా ఉండకూడదు: న్యాయమూర్తి

జీవో 117పై స్టే ఇచ్చేందుకు సంసిద్ధత

రోస్టర్‌ ప్రకారం డివిజన్‌ బెంచ్‌ వినాలన్న ఏజీ

ఫైలును సీజేకు పంపాలని కోర్టు ఆదేశం


తెలుగు ఉండాల్సిందే

తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమం కోరుతున్నప్పటికీ తెలుగు మాధ్యమంలో కూడా బోధన కొనసాగించాల్సిందే. ఆర్థిక, సామాజిక పరిస్థితుల ఆధారంగా విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి.

- హైకోర్టు


అమరావతి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): సంస్కరణల పేరుతో పాఠశాలలను మూసివేస్తామంటే ఎలాగని హైకోర్టు నిలదీసింది. జాతీయ విద్యావిధానమంటూ విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఎలా చేపడతారని రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జీవో 117 విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా ఉందని పేర్కొంది. పాఠశాలల విలీనం కారణంగా చిన్నారులు 1 నుంచి 3 కిలోమీటర్ల దూరం వెళ్లి చదువుకోవలసి వస్తుందని పేర్కొంది. చిన్నారులను దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోమనడం సరికాదని వ్యాఖ్యానించింది. విద్యా హక్కు చట్టం మేరకు విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని పాటిస్తున్నట్లు కనిపించడం లేదని అభిప్రాయపడింది. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం మంచిదే అయినప్పటికీ తెలుగు మాధ్యమాన్ని తొలగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని విద్యా హక్కు చట్టం చెబుతోందని గుర్తుచేసింది. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే తెలుగు మాధ్యమంలో బోధనే లేకుండా చేసేటట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. సర్కారు చర్యలు విద్యా వ్యవస్థను బలపరిచేలా ఉండాలని.. నిర్వీర్యం చేసేలా ఉండకూడదని వ్యాఖ్యానించింది. ప్రస్తుత విధానం కొనసాగిస్తూనే సంస్కరణలు ప్రవేశపెట్టవచ్చని సలహా ఇచ్చింది. ఒక దశలో జీవో అమలుపై స్టే విధించేందుకు సిద్ధపడింది. ప్రస్తుతం ఉన్న విధానానే కొనసాగించేలా యథాతథ స్థితి ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ స్పందిస్తూ.. చట్టబద్ధమైన నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఈ వ్యాజ్యం రోస్టర్‌ ప్రకారం డివిజన్‌ బెంచ్‌ ముందు విచారణకు రావాలని తెలిపారు. ఆ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించడమే మంచిదని అభిప్రాయపడింది. వ్యాజ్యం తగిన బెంచ్‌ ముందు విచారణకు వచ్చేందుకు వీలుగా ఫైలును సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.గంగారావు బుధవారం ఆదేశాలిచ్చారు. జాతీయ విద్యావిధానం అమలు పేరుతో పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు పి.సత్యవతి, మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు వచ్చింది.


పాఠశాల విద్య నాశనం..

పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సత్యప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. నూతన విద్యా విధానం అమలు పేరుతో రాష్ట్రప్రభుత్వం పాఠశాల విద్యను నాశనం చేస్తోందన్నారు. పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ద్వారా స్కూళ్ల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. ప్రాథమిక విద్య కింద ఉన్న 3,4,5 తరగతులను ప్రాథమికోన్నత పాఠశాలల్లో కలుపుతున్నారని, అలాగే ప్రాథమికోన్నత విభాగంలో 6,7,8 తరగతులను హైస్కూళ్లలో విలీనం చేస్తున్నారని.. ఈ నిర్ణయంతో విద్యార్థులు కిలోమీటరు నుంచి 3 కి.మీ. వెళ్లి చదువుకోవలసి వస్తుందని.. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ అనాలోచిత చర్య కారణంగా చిన్నారులు, బాలికలు చదువుకు దూరమయ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలోనే ఉండాలని విద్యాహక్కు చట్టం చెబుతోందని.. ప్రభుత్వం 1 నుంచి 8వ తరగతి వరకు ఒకటే మాధ్యమంలో విద్యాబోధన ఉంటుందని జీవోలో పేర్కొందని.. ఏ మాధ్యమంలో బోధిస్తారో స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. 9, 10 తరగతులకు బోధన రెండు మాధ్యమాల్లో ఉంటుందని ప్రభుత్వం చెబుతోందని, అయితే మాధ్యమాన్ని ఎన్నుకున్నవారి సంఖ్య కనీసం 20 మందికి తగ్గకూడదని షరతు విధించిందని.. ఇది విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని గతంలో హైకోర్టు తప్పుబట్టిందని.. సంబంధిత జీవోలను కొట్టివేసిందని గుర్తుచేశారు. ఈ నేపఽథ్యంలో పరోక్షంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. జీవో 117 విద్యావ్యవస్థలో అశాంతికి కారణమైందని.. ఈ నేపఽథ్యంలో జీవోను నిలుపుదల చేస్తూ.. పాత విధానంలోనే పాఠశాల విద్య కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.


ప్రక్రియ ప్రారంభ దశలోనే: ఏజీ

ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. నూతన విద్యా విధానం అమలు నిమిత్తం వివరాలు సేకరిస్తున్నామని.. ప్రక్రియ ప్రారంభ దశలోనే ఉందని తెలిపారు. జీవో 117 పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చేందుకు మరో నెల రోజులు పడుతుందన్నారు. జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా సంస్కరణలు ప్రవేశపెడుతున్నామన్నారు. పాఠశాలల్లో పూర్తిగా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నామనేది పిటిషనర్‌ ఆందోళన మాత్రమేనని తెలిపారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ప్రభుత్వ ఉత్తర్వులు విద్యాహక్కు చట్టం, జాతీయ విద్యా విధానానికి విరుద్ధంగా ఉన్నాయన్నారు.. 

Updated Date - 2022-07-07T08:43:18+05:30 IST