నిధులపై ఉన్న శ్రద్ధ విధులపై ఉండదా?

ABN , First Publish Date - 2022-05-20T05:49:42+05:30 IST

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నిధులపై వున్న శ్రద్ధ విధులపై వుండడం లేదని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.

నిధులపై ఉన్న శ్రద్ధ విధులపై ఉండదా?

పద్మనాభం మండల సమావేశానికి హాజరు కాని ప్రజాప్రతినిధులు, అధికారులపై ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆగ్రహం

సంబంధితులకు నోటీసులు, మెమోలు ఇవ్వాలని ఎంపీడీవో, ఈవోఆర్డీలకు ఆదేశం

పద్మనాభం, మే 19: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నిధులపై వున్న శ్రద్ధ విధులపై వుండడం లేదని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఎంపీపీ కె.రాంబాబు అధ్యక్షతన గురువారం స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన పద్మనాభం మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశానికి పలువురు ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి రాని ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇవ్వాలని, గైర్హాజరైన అధికారులకు మెమోలు ఇవ్వాలని ఎంపీడీవో, ఈవోఆర్డీలను ఆదేశించారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా మండల సమావేశాలకు హాజరు కావాలన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను ప్రతీ సర్పంచ్‌, ఎంపీటీసీ సభ్యుడు గుర్తెరిగి సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలపై చర్చించాలన్నారు. సమావేశాలకు గైర్హాజరవ్వడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ.. ప్రజల నుంచి సమస్యలను తెలుసుకునేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపడుతున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు ప్రజా సమస్యలను రాసుకునేందుకు ప్రత్యేక రిజిష్టర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, యాప్‌లో కూడా వాటిని నమోదు చేయాలన్నారు. 

మౌలిక వసుతులపై దృష్టిసారించాలి

మండల పరిషత్‌ పాలకవర్గం తాగునీరు, పారిశుధ్యం, మౌలిక వసతులను మెరుగుపరచడంపై దృష్టి కేంద్రీకరించాలని ముత్తంశెట్టి సూచించారు. ఈ సందర్భంగా తాగునీరు, ఉపాధి హామీ, గృహ నిర్మాణం, విద్యుత్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, తదితర శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. గ్రామాలలో తాగునీటి పథకాలను సత్వరమే పూర్తి చేయాలని, పారిశుధ్యం మెరుగుకు గ్రామ పంచాయతీలు చొరవ చూపాలన్నారు. జూన్‌ నాటికి గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్‌లు, జగనన్న కాలనీలను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మీ నిర్లక్ష్యం వల్లే కోరాడ రైతుభరోసా సభలో సమస్య తలెత్తిందని తహసీల్దార్‌పై మండిపడ్డారు. కాలనీ నిర్మాణాలకు, రైతులకు అవసరమైన మట్టిని తరలించేందుకు స్థానిక వీఆర్వోల ద్వారా చీటీలు రాసి అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సమావేశంలో భీమిలి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎలమించిలి సూర్యనారాయణ, జడ్పీటీసీ సభ్యుడు ఎస్‌.గిరిబాబు, వైస్‌ ఎంపీపీలు కె.మంజు లక్ష్మణరావు, ఈర్లె రాజేశ్వరి, ఎంపీడీవో చిట్టిరాజు, తహసీల్దార్‌ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-05-20T05:49:42+05:30 IST