ధాన్యం బకాయిలు చెల్లించరా..?

ABN , First Publish Date - 2021-06-20T05:22:23+05:30 IST

పంట ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు విక్రయించిన రైతులకు బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు.

ధాన్యం బకాయిలు చెల్లించరా..?
డీఆర్వోకు వినతి పత్రం అందిస్తున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు

  1. ప్రభుత్వం తీరుపై సోమిశెట్టి ఆగ్రహం


కర్నూలు(అగ్రికల్చర్‌), జూన్‌ 19: పంట ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు విక్రయించిన రైతులకు బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఖరీఫ్‌ సాగు కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు డీఆర్వో పుల్లయ్యకు శనివారం వినతి పత్రం అందజేశారు. వేరుశనగ, మొక్కజొన్న, జొన్నలు, మినుములు తదితర పంట దిగుబడులను రైతులు డిసెంబరులో విక్రయించారని, ప్రభుత్వం ఇప్పటికీ వారికి డబ్బులు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం ఏ-గ్రేడ్‌ రకానికి రూ.1,885, సాధారణ రకానికి రూ.1,868 మద్దతు ధర ప్రకటించిందని, అయితే.. రాష్ట్ర ప్రభుత్వం రూ.1100 నుంచి రూ.1350 మాత్రమే ఇస్తోందని అన్నారు. జిల్లాలో రైతులు క్వింటంపై రూ.300 నుంచి 800 దాకా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఖరీఫ్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్నకు దాదాపు రూ.3.50 కోట్లు చెల్లించాల్సి ఉందని, రబీలో మొక్కజొన్నలు, జొన్నలు కొనుగోలు చేసి ఇంకా రూ.20 కోట్ల దాకా రైతులకు చెల్లించాల్సి ఉందని అన్నారు. ఈ డబ్బుల కోసం రైతులు మార్క్‌ఫెడ్‌ కార్యాలయం చుట్టూ మోకాళ్లరిగేలా తిరుగుతున్నారని సోమిశెట్టి అన్నారు. 


మార్క్‌ఫెడ్‌లో అక్రమాలు 


మొక్కజొన్న, జొన్న తదితర దిగుబడులను కొనుగోలు చేసేందుకు రవాణాతో పాటు గోనె సంచుల ఖర్చును ప్రభుత్వ భరిస్తోందని, కానీ కాంట్రాక్టర్లు రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని సోమిశెట్టి ఆరోపించారు. రైతులే సొంత ఖర్చులతో పంట ఉత్పత్తులను మార్క్‌ఫెడ్‌ గోదాములకు తరలిస్తున్నారని, గోనెసంచులను రైతులకు ఇవ్వడం లేదని అన్నారు. కాంట్రాక్టర్లపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని డీఆర్వోకి తెలిపారు. కాంట్రాక్టర్ల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని సోమిశెట్టి డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు కమిటీ అధ్యక్షుడు ఆదిశేషిరెడ్డి, ప్రధాన కార్యదర్శి పాండు రంగన్నగౌడు, తెలుగుదేశం పార్టీ నాయకులు హనుమంతరావు చౌదరి, మంచాలకట్ట భాస్కర్‌రెడ్డి, కొరకంచి రవికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T05:22:23+05:30 IST