కుప్పం బరిలోకి వస్తావా విశాల్‌?

ABN , First Publish Date - 2022-06-30T09:20:12+05:30 IST

‘పందెంకోడి’గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన హీరో విశాల్‌ను కుప్పం బరిలోకి దించాలని వైసీపీ యోచిస్తోంది.

కుప్పం బరిలోకి వస్తావా విశాల్‌?

  • చర్చలు జరిపిన వైసీపీ నేతలు.. బాబుపై పోటీకి వినతి
  • కుప్పం ప్రాంతంలో విశాల్‌ కుటుంబానికి గ్రానైట్‌ పరిశ్రమలు
  • తమిళ ప్రభావంపై ఆశలు.. పోటీపై విశాల్‌ రెడ్డి ఆరా


అమరావతి/చెన్నై, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ‘పందెంకోడి’గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన హీరో విశాల్‌ను కుప్పం బరిలోకి దించాలని వైసీపీ యోచిస్తోంది. ఆయనను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై పోటీగా నిలిపేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే దీనిపై విశాల్‌తో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. తెలుగు కుటుంబానికి చెందిన విశాల్‌ తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు ప్రేక్షకులకూ ఆయన పరిచయమే. ఆయన తండ్రి జీకే రెడ్డి సినీ నిర్మాత, పారిశ్రామిక వేత్త. కుప్పం ప్రాంతంలో ఆయనకు గ్రానైట్‌ గనులు, పాలిషింగ్‌ యూనిట్లు ఉన్నాయి. ఇలా కుప్పం ప్రాంతంతో విశాల్‌ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని... ఆయనను చంద్రబాబుపై పోటీకి నిలపాలని వైసీపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కుప్పం నియోజకవర్గం చంద్రబాబుకు పెట్టని కోటలాగా ఉంది.


ఆయనకు దీటైన అభ్యర్థి కోసం ప్రత్యర్థి పార్టీలు ప్రతిసారీ అన్వేషిస్తూనే ఉంటాయి. సరైన వారు దొరక్క... ప్రతి ఎన్నికలో కొత్త అభ్యర్థిని నిలుపుతున్నాయి. 2019 ఎన్నికల్లో చంద్రబాబుపై పోటీ చేసిన వ్యక్తి ఆ తర్వాత మరణించారు. ఈసారి ఎలాగైనా కుప్పంలో చంద్రబాబును ఓడించాలని వైసీపీ గట్టి పట్టుదలతో ఉంది. ‘సరైన అభ్యర్థి’ని అన్వేషించే క్రమంలో వారి దృష్టి విశాల్‌ రెడ్డిపై పడింది. కుప్పం నియోజకవర్గంలో తమిళ ప్రభావం కూడా ఎక్కువ. అదేసమయంలో... ఆయన కుటుంబానికి ‘పారిశ్రామిక’ అనుబంధం కూడా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని వైసీపీ నేతలు ఆయనతో చర్చలు జరిపినట్లు తెలిసింది. ఏపీలో... అందులోనూ చంద్రబాబుపై పోటీకి దిగేందుకు ఆయన  అంతగా ఆసక్తి వ్యక్తం చేయలేదని తెలిసింది. అదే సమయంలో... అసలు ఏమిటి పరిస్థితి, పోటీ చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో కొందరు సన్నిహితులతో ఆరా తీస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2022-06-30T09:20:12+05:30 IST