వేసిన రోడ్లపైనే మళ్లీ రోడ్లు వేస్తారా?

ABN , First Publish Date - 2022-07-01T05:48:10+05:30 IST

సదాశివపేట మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం దద్దరిల్లిపోయింది. కొద్ది రోజుల క్రితం టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లతోపాటు పార్టీలకతీతంగా కౌన్సిలర్లు అంతా ఏకమై బల్దియాపై పోరు జెండా ఎగురవేయడంతో ఈమారు కౌన్సిల్‌ సమావేశం వాడీవేడిగా జరిగింది.

వేసిన రోడ్లపైనే మళ్లీ రోడ్లు వేస్తారా?

పాలకవర్గాన్ని నిలదీసిన మెజార్టీ కౌన్సిలర్లు

రూ. 25 కోట్ల అవినీతి చేస్తున్నారని ధ్వజం

దద్దరిల్లిన మున్సిపల్‌ సమావేశం

తప్పు దిద్దుకుంటామన్న కమిషనర్‌


సదాశివపేట, జూన్‌ 30: సదాశివపేట మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం దద్దరిల్లిపోయింది. కొద్ది రోజుల క్రితం టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లతోపాటు పార్టీలకతీతంగా కౌన్సిలర్లు అంతా ఏకమై బల్దియాపై పోరు జెండా ఎగురవేయడంతో ఈమారు కౌన్సిల్‌ సమావేశం వాడీవేడిగా జరిగింది. గురువారం మున్సిపల్‌ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి చైర్‌పర్సన్‌ పిల్లోడి జయమ్మ గైర్హాజరయ్యారు. ఆ స్థానంలో చైర్మన్‌గా వైస్‌ చైర్మన్‌ చింతాగోపాల్‌ అధ్యక్షత వహించారు. సమావేశం ప్రారంభం కాగానే కౌన్సిలర్లు ఇలియాజ్‌ షరీఫ్‌, నాగరాజు గౌడ్‌ మాట్లాడుతూ  పట్టణ అభివృద్ధి కోసం మంజూరైన ప్రత్యేక అభివృద్ధి నిధులు రూ.25 కోట్లతో చేపట్టబోయే పనుల ప్రతిపాదనలు చూస్తుంటే ఆ డబ్బును దోచేందుకు పక్కాగా స్కెచ్‌ వేసినట్టుగా ఉందన్నారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న 18వ, 19వ వార్డులో కొంతకాలం క్రితమే నిర్మించిన సీసీ రోడ్డు, అండర్‌ డ్రైనేజీ స్థానాల్లో మళ్లీ సీసీ రోడ్డు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు పెట్టడం అవినీతి కాదా? అని మండిపడ్డారు. అధికారులు సంజాయిషీ ఇవ్వాలనడంతో వారు సమాధానం ఇవ్వలేకపోయారు. ప్రతిపాదనల విషయంలో తప్పులు జరిగాయని సరిదిద్దుకుంటామని కమిషనర్‌ కృష్ణారెడ్డి బదులిచ్చారు. కౌన్సిలర్‌ చౌదరి ప్రకాశ్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ పారిశుధ్యం, నీటి సరఫరా విభాగాల్లో పని చేసే 150 మంది కార్మికులకు చెందాల్సిన చెప్పులు, దుస్తుల్లోనూ చేతివాటం ప్రదర్శించారని,  రూ.18 లక్షల అవినీతి జరిగిందని ఆరోపించారు. చివరకు పారిశుధ్య కార్మికుల సొమ్ము తినే పరిస్థితి ఇక్కడ నెలకొనడం ఛీ...ఛీ..సిగ్గుచేటు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సమావేశంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. కౌన్సిలర్లు ఇంద్రమోహన్‌గౌడ్‌, రేణుక మాట్లాడుతూ హరితహారం కార్యక్రమం ఏడు విడతల్లో పూర్తిగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ధ్వజమెత్తారు. కౌన్సిలర్‌ వడ్ల మహేశ్వరీ మాట్లాడుతూ  మెజార్టీ కౌన్సిలర్లు ఇచ్చిన డిసెంట్‌ నోటీసులకు ఇప్పటికీ వివరణ ఎందుకు ఇవ్వడం లేదని కమిషనర్‌ కృష్ణారెడ్డిపై మండిపడ్డారు. కౌన్సిలర్‌ ఇంద్రమోహన్‌గౌడ్‌ మాట్లాడుతూ కమిషన్లకు కక్కుర్తిపడి అధికారులు పారిశుధ్య విభాగంలో బ్రాండెడ్‌వి కాకుండా ఆటోలు, డీసీఎం వాహనాలు, ట్రాక్టర్లు ఇతర కంపెనీలకు చెందినవి వినియోగిస్తుండడంతో తరచూ వాహనాలు మరమ్మతులకు వస్తున్నాయన్నారు.


Updated Date - 2022-07-01T05:48:10+05:30 IST