నిధులు మంజూరై ఏడేళ్లయినా రైలు రాదా?

ABN , First Publish Date - 2021-02-28T05:30:00+05:30 IST

కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన మెదక్‌ రైల్వేస్టేషన్‌ భవనం అసాంఘిక శక్తులు, తాగుబోతులకు అడ్డాగా మారిందని పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్‌ ముదిరాజ్‌ పేర్కొన్నారు.

నిధులు మంజూరై ఏడేళ్లయినా రైలు రాదా?
రైల్వేస్టేషన్‌ ముట్టడికి హాజరైన కాంగ్రెస్‌ నేతలు

పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్‌ ముదిరాజ్‌

కాంగ్రెస్‌ శ్రేణుల రైల్వేస్టేషన్‌ ముట్టడి


మెదక్‌, ఫిబ్రవరి 28: కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన మెదక్‌ రైల్వేస్టేషన్‌ భవనం అసాంఘిక శక్తులు, తాగుబోతులకు అడ్డాగా మారిందని పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్‌ ముదిరాజ్‌ పేర్కొన్నారు. మెదక్‌–అక్కన్నపేట రైల్వేలైన్‌ నిర్మాణంలో జాప్యానికి నిరసనగా ఆదివారం డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నేతలు స్థానిక ఇందిరాగాంఽధీ స్టేడియం నుంచి ర్యాలీగా బయలుదేరి మెదక్‌ రైల్వేస్టేషన్‌ను ముట్టడించారు. కార్యక్రమానికి హాజరైన సందర్భంగా నగేష్‌ మాట్లాడుతూ మెదక్‌ రైల్వేస్టేషన్‌ ప్రారంభానికి మందే శిథిలావస్థకు చేరుకుందని వాపోయారు. కాంగ్రెస్‌ హయాంలో నిధులు మంజూరు చేయగా ఏడేళ్లయినా కేంద్రంలోని బీజేపీ కానీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ కానీ ఈ పనులను పట్టించుకోవడం లేదన్నారు. 2014లో మెదక్‌–అక్కన్నపేట రైల్వే లైన్‌కు అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.118 కోట్లు కేటాయించగా రైల్వే ట్రాక్‌ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించడంలో తీవ్ర జాప్యం చేశారని ఆరోపించారు. డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెదక్‌ జిల్లాపై సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం నియోజకవర్గంలోని మనోహరాబాద్‌లో రైల్వేట్రాక్‌  నిర్మాణం పూర్తిచేసి ట్రయల్‌రన్‌ చేశారన్నారు.  రైల్వేలైన్‌ నిర్మాణలో జాప్యం కారణంగా సర్కారుపై రూ.83 కోట్ల అదనపు భారం పడిందని తెలిపారు. మెదక్‌ ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రభుత్వఆలపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. పక్కనే ఉన్న గజ్వేల్‌, సిద్దిపేట నియోజకవర్గాలు  అభివృద్ధిలో దూసుకెళ్తుంటే మెదక్‌ మాత్రం వెనుబడిందని వాపోయారు. రైల్వేట్రాక్‌ నిర్మాణం పూర్తిచేసి రైలు నడిచేలా చేయకపోతే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో  పీసీసీ కార్యదర్శి సోమన్నగారి లక్ష్మి, డీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు, కౌన్సిలర్‌ శేఖర్‌, పట్టణ అధ్యక్షుడు  గూడూరి ఆంజనేయులు, నాయకులు హఫీజొద్దిన్‌, మహేందర్‌రెడ్డి, దయాకర్‌, చింటు, భరత్‌, ఎస్సీసెల్‌  అధ్యక్షుడు శ్యామ్‌సుందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T05:30:00+05:30 IST