రిజర్వ్ బ్యాంక్ వైఖరి మారనుందా ?

ABN , First Publish Date - 2022-01-20T23:28:28+05:30 IST

ఇటీవలి కాలంలో... గ్లోబల్‌ 10-ఇయర్‌ బాండ్‌ ఈల్డ్స్‌ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ దాదాపు రెండు శాతానికి దగ్గరలో ఉన్నాయి

రిజర్వ్ బ్యాంక్ వైఖరి మారనుందా ?

పెరుగుతున్న బాండ్‌ ఈల్డ్స్‌ మార్కెట్‌కు ఇస్తున్న సిగ్నల్స్‌ ఏమిటి ? 

పెరుగుతున్న బాండ్‌ ఈల్డ్స్‌ మార్కెట్‌... దేనికి సంకేతాలు ?

ముంబై : ఇటీవలి కాలంలో... గ్లోబల్‌ 10-ఇయర్‌ బాండ్‌ ఈల్డ్స్‌ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ దాదాపు రెండు శాతానికి దగ్గరలో ఉన్నాయి. దీనిని ‘అత్యధికం’గానే చూడాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇండియన్‌ 10-ఇయర్‌ గవర్నమెంట్‌ బాండ్ ఈల్డ్స్‌ గరిష్టంగా 6.66 శాతానికి పెరిగాయి. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


ముడిచమురు ధరలు, ద్రవ్యోల్బణం పెరగడం, అమెరికాలో వడ్డీ రేటు పెంపుపై ఆందోళనలు తదితర అంశాలు బాండ్ ఈల్డ్స్‌ను పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాగా... ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం రిజర్వ్‌ బ్యాంక్‌ ఇప్పటివరకు అనుసరించిన మెతక వైఖరిని విడిచిపెడుతుందని, వడ్డీ రేట్లను పెంచుతుందని  చెబుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి సూచనలూ వెలువడలేదు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు దీర్ఘకాలికంగా సానుకూల వైఖరిని అవలంబించిన ఆర్‌బీఐ, ఆ క్రమంలోనే..., స్వల్పకాలంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పక్కనపెట్టింది. ఇప్పుడు ఆ లెక్కను సరిచేసే పనిలో ఉంది. ఈ ఫలితం బ్యాంక్‌ వడ్డీ రేట్లలో కనిపిస్తోంది.


ఇదిలా ఉంటే... గవర్నమెంట్‌ సెక్యూరిటీల ఈల్డ్స్‌ ఒక స్థాయికి చేరడంతోపాటు, డిపాజిట్ రేట్లు నెమ్మదిగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే... ఆర్‌బీఐ వైఖరిలో మార్పునకు సమయం వచ్చినట్లుగా భావించవచ్చని క్రిసిల్ పేర్కొంటోంది. ప్రస్తుతం జీడీపీ గ్రోత్‌, జీఎస్‌టీ వసూళ్లు సంతృప్తికరంగా ఉంటుండడం, ఒమిక్రాన్‌ ప్రభావం తగ్గుతున్నట్లుగా భావిస్తోన్న నేపధ్యంలో రేటు రివర్సల్‌కు ఇప్పుడు టైమ్‌ వచ్చిందని చెబుతున్నారు. ముందుగా రివర్స్ రెపో రేటు పెంపు, ఆ తర్వాత రెపో రేటు పెంపునకు అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమానికి సంబంధించి మరికొన్ని వివరాలిలా ఉన్నాయి. 


ప్రతికూల బేస్ ఎఫెక్ట్ కారణంగా డిసెంబరులో రిటైల్ ద్రవ్యోల్బణం 5.59 శాతానికి పెరిగింది. దీనిని 2-6 శాతం బ్యాండ్‌లోనే ఉంచేలా చర్యలు చేపట్టడం ఆర్‌బీఐ 'మానిటరీ పాలసీ కమిటీ' విధి. ఈ కమిటీ ఫిబ్రవరిలో సమావేశం కానుంది. అధిక ద్రవ్యోల్బణంపై ఎలా పోరాడాలన్న అంశంపై ఇప్పటికే కమిటీలో చర్చ జరుగుతోంది. దీర్ఘకాలిక అనుకూల వైఖరిని కొందరు ఎంపీసీ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. దీనినిబట్టి, పరిస్థితి ఇకపై మారొచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ద్రవ్యోల్బణం కూడా నవంబరులోని 4.91 శాతం నుంచి, డిసెంబరులో 68 బేసిస్ పాయింట్లు పెరిగి, 5.59 శాతానికి చేరింది. గతేడాది జులై నుంచి ఇది అత్యధిక స్థాయి. అక్టోబరు-డిసెంబరులో సీపీఐ ద్రవ్యోల్బణం సగటున 5.1 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది.


అటు తర్వాత... 

ఎంపీసీ తదుపరి సమావేశం ఫిబ్రవరిలో జరగనున్న నేపధ్యంలో... వడ్డీ రేట్ల పెంపును ఆశించవచ్చునని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ వడ్డీ రేట్లను మార్చకున్నప్పటికీ, ఆర్‌బీఐ వైఖరిలో మాత్రం ఖచ్చితంగా మార్పు ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

Updated Date - 2022-01-20T23:28:28+05:30 IST