ఎన్నికలు జరిగేనా..?

ABN , First Publish Date - 2022-05-22T04:24:47+05:30 IST

జిల్లాలోని గూడెం గ్రామ పంచా యతీకి మూడు దశాబ్దాలుగా ఎన్నికలు జరుగడం లేదు. సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యుల స్థానాలను గిరిజనులకు కేటాయించడం, ఆ గ్రామంలో గిరిజన జనాభా లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

ఎన్నికలు జరిగేనా..?
దండేపల్లి మండలంలోని గూడెం గ్రామం

 

- మూడు దశాబ్దాలుగా పాలక వర్గంలేని గ్రామం

- గూడెం పంచాయతీ ఎన్నికలకు మారని రిజర్వేషన్‌

- గిరిజనులు లేకున్నా నోటిఫైడ్‌గా ప్రకటించిన ప్రభుత్వం

- ఆసక్తి ఉన్నా పోటీ చేయలేని ఽస్థితిలో ప్రజలు

మంచిర్యాల, మే 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గూడెం గ్రామ పంచా యతీకి మూడు దశాబ్దాలుగా ఎన్నికలు జరుగడం లేదు. సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యుల స్థానాలను గిరిజనులకు కేటాయించడం, ఆ గ్రామంలో గిరిజన జనాభా లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దండేపల్లి మండలం గూడెం గ్రామ పంచాయతీని అప్పటి ప్రభుత్వం 1950లో నోట్‌ఫైడ్‌ గ్రామంగా ప్రకటించింది. 1887లో షెడ్యూల్డ్‌ తెగలకు రిజర్వు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామంలో గిరిజన జనాభా లేక పోయినప్పటికీ ప్రతిసారీ ప్రకటిస్తున్న రిజర్వేషన్లలో ఎస్టీలకు  కేటాయిస్తున్నారు. ఫలితంగా పంచాయతీలో ఎన్నికలు నిలిచిపోతున్నాయి. గూడెం గ్రామ పంచాయతీలో గిరిజనులు ఒక్కరు కూడా లేకపోగా ప్రభుత్వ గణాంకాల కారణంగా నోటిఫైడ్‌గా ప్రకటించారు. దీంతో పోటీ చేయాలనే ఆసక్తి ప్రజల్లో ఉన్నా రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో గ్రామంలో ఎన్నికలు జరగడం లేదు. గూడెం గ్రామ పంచాయతీలో రెం డు వేల పై చిలుకు ఓటర్లు ఉన్నారు. సర్పంచు పదవితోపాటు 10వార్డు సభ్యుల్లో ఐదు స్థానాలను ఎస్టీలకు కేటాయించారు. అయితే సర్పంచు స్థానంతోపాటు ఐదు స్థానాలు ఎస్టీలకు కేటాయించడంతో మిగిలిన ఐదు స్థానాల్లోనూ పోటీ చేసేందుకు గిరిజనేతరులు ఆసక్తి కనబర్చడం లేదు.

కుంటుపడుతున్న అభివృద్ధి

సర్పంచ్‌, వార్డు స్థానాలకు ఎస్టీలకు రిజర్వు చేస్తుండటంతో అర్హులైన అభ్యర్థులు లేని కారణంగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామంలో అభివృద్ధి కుంటుపడుతోంది. గ్రామ పంచాయతీ పరిధిలో ప్రసిద్ధి గాంచిన గూడెం శ్రీసత్యనారాయణస్వామి దేవస్థానం ఉండగా, లక్షలాది రూపా యల ఆదాయం సమకూరుతోంది. అయినప్పటికీ పంచాయతీకి ఎన్నికలు జరగకపోవడంతో ఆశించిన మేరకు అభివృద్ధి జరగడం లేదు. గూడెం పంచాయతీని నోటిఫైడ్‌గా ప్రకటించడంతో గ్రామంలో నివసిస్తున్న గిరిజనేతరులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. నోటిఫైడ్‌ పంచా యతీలో 1/70 చట్టం అమలులో ఉన్నందున గిరిజనేతరులకు సంబంధిం చిన భూములు క్రయవిక్రయాలకు నోచుకోవడం లేదు. గిరిజన ప్రాంతాల్లో భూ బదిలీ చట్టాలను నిషేధించినందున ప్రజలు భూములను విక్రయించిన పక్షంలో చట్టం ఉల్లంఘన కింద నోటీసులు పంపి కేసులు నమోదు చేస్తున్నారు. ఈ చట్టం గురించి తెలియని కొందరు గిరిజనే తరులు వారి భూములను విక్రయించుకోగా, భూ బదలాయింపు చట్టాన్ని ఉల్లంఘించారని నోటీసులు అందడంతో కేసుల్లో ఇరుక్కొని సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టు తిరుగుతున్నారు. గ్రామ పాలకవర్గం స్థానాలకు రిజర్వేషన్లలో మార్పు లేకపోవడం గ్రామస్థులకు శాపంగా మారింది. 

పోరాటాలు చేసినా మారని రిజర్వేషన్‌ 

గూడెం గ్రామాన్ని గిరిజన గ్రామాల జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ 1995లో జరిగిన లోక్‌సభ ఎన్నికలను గ్రామస్థులు బహిష్కరించారు. 1995 నుంచి 2008 వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నోటిఫైడ్‌ చట్టాల నుంచి విముక్తి కల్పించాలని దశాబ్దాల కాలంగా గూడెం గ్రామస్థులు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. 1985లో ఇతర గిరిజనేతరుల సహకారంతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. 1987లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఊట్నూరు పర్యటనకు వచ్చినపుడు ఘెరావ్‌ చేశారు. గూడెం గ్రామ పంచాయతీ స్థానాన్ని జనరల్‌గా ప్రకటించాలని గ్రామస్థులు అనేక సార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించడంతోపాటు ఊరు కోసం పోరు దీక్ష పేరిట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు గణాంకాల వల్ల గూడెం పంచాయతీ నోటిఫైడ్‌ కిందికి చేరడం, దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటి వరకు అధికారులు మార్పులు చేయడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం నోటిఫైడ్‌ ఎత్తివేసి జనరల్‌గా ప్రకటించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. పంచాయతీ ఉప ఎన్నికలకు ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమై, త్వరలో నోటిఫికేషన్‌ వెలువడనున్నందున రిజర్వేషన్లలో మార్పులు చేసి జనరల్‌గా ప్రకటించాలనే డిమాండ్‌లు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.

Updated Date - 2022-05-22T04:24:47+05:30 IST