వెంకయ్య రాష్ట్రపతి అయ్యేనా?

Published: Sun, 19 Jun 2022 00:20:15 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వెంకయ్య రాష్ట్రపతి అయ్యేనా?

ఉపరాష్ట్రపతులు రాష్ట్రపతిగా పదోన్నతి పొందే సంప్రదాయమున్నది. మరి ప్రస్తుత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడూ రాష్ట్రపతి అవుతారా? దక్షిణ భారతావనికి చెందిన వెంకయ్యను బిజెపి అధిష్టానవర్గం ఏ మేరకు ఆదరిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.


రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు జరగనున్న ఎన్నికలపై హిమాచలం నుంచి కన్యాకుమారి దాకా ఎంతోమంది ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఉపరాష్ట్రపతులుగా ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్‌ హుస్సేన్, వి.వి. గిరి, ఆర్‌. వెంకట్రామన్, డాక్టర్‌ శంకర్‌ దయాళ్‌ శర్మ, కె.ఆర్‌ నారాయణన్‌లు రాష్ట్రపతులయ్యారు. అదే కోవలో వెంకయ్యకు రాష్ట్రపతిగా పదోన్నతి లభించగలదని ముఖ్యంగా దక్షిణాది ప్రజలు ఆశిస్తున్నారు.


1992లో రాష్ట్రపతిగా ఆర్‌. వెంకట్రామన్, ఉపరాష్ట్రపతిగా డాక్టర్‌ శంకర్ దయాళ్‌ శర్మ ఉన్నారు. శంకర్ దయాళ్‌ శర్మ ఉపరాష్ట్రపతి కాక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఉన్నారు. ఎన్‌టి రామారావును అప్పటి గవర్నర్‌ రామ్‌లాల్ అప్రజాస్వామికంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడంతో ఏర్పడిన సంక్షోభం పరిష్కారానికి ప్రధాని ఇందిర.. డాక్టర్‌ శంకర్‌ దయాళ్‌ శర్మను ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా పంపారు. కాషాయ వస్త్రాలు ధరించే ఎన్‌టిఆర్‌ను శంకర్‌ దయాళ్‌ శర్మ అభిమానించేవారు. ఆ తరువాత ఉపరాష్ట్రపతిగా ఉన్న శంకర్ దయాళ్‌ శర్మను రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రధాని పీవీ నరసింహారావు ప్రకటించారు. నేషనల్‌ ఫ్రంట్‌ ఛైర్మన్‌గా ఉన్న ఎన్‌టిఆర్‌ కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తన అభ్యర్థిత్వాన్ని ఎన్‌టిఆర్‌ వ్యతిరేకించటంతో శంకర్‌ దయాళ్‌ శర్మ మనస్తాపం చెందారు. 


శంకర్ దయాళ్ శర్మకు ముందు ఉపరాష్ట్రపతిగా ఉన్న ఆర్‌ వెంకట్రామన్ రాష్ట్రపతి అయ్యారు. తొలి ఉపరాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి అయ్యారు. తదనంతరం జాకీర్‌ హుస్సేన్, వి.వి. గిరి, శంకర్ దయాళ్‌ శర్మ, కె.ఆర్‌. నారాయణన్‌లు రాష్ట్రపతులుగా పదోన్నతులు పొందారు. 1992లో శంకర్‌ దయాళ్‌ శర్మను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన సమయంలో ఎన్‌టిఆర్‌ నల్లమల అడవుల్లో సినిమా షూటింగ్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి శంకర్‌ దయాళ్‌ శర్మపై హరిజన అభ్యర్థిని రంగంలోకి దించుతామని ఎన్‌టిఆర్‌ ప్రకటించారు. ప్రతిపక్షాలకు అభ్యర్థి దొరకలేదు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన రాజ్యసభ సభ్యుడు ఒకరు ఉపరాష్ట్రపతిగా తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారని, ఆయన ఎవరో తెలుసుకోవాలని మాజీ ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మమ్ములను ఆదేశించారు. దీంతో మేము ఆరా తీయగా ఆ అభ్యర్థి మా బెంచీలో కూర్చొనే జి.జి స్వెల్‌ అని వెల్లడయింది. ఆయనను విపి సింగ్‌ వద్దకు తీసుకు వెళ్ళాం. ఉపరాష్ట్రపతి పదవికి పోటీచేయాలని భావించిన స్వెల్‌ ఊహించని విధంగా రాష్ట్రపతి అభ్యర్థి అయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి శంకర్ దయాళ్‌ శర్మకు 6,75,504 ఓట్లు (65.65 శాతం), నేషనల్‌ ఫ్రంట్‌ అభ్యర్థి జి.జి. స్వెల్‌కు 3,46,485 ఓట్లు (35.35 శాతం) వచ్చాయి. శంకర్ దయాళ్‌ శర్మ 3,29,317 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 


1992 ఆగస్టులో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది. ఎన్‌టిఆర్‌తో మాట్లాడితే బాగుంటుందని ప్రధాని పీవీకి మేము (తెలుగుదేశం పార్టీ ఎంపీలు) సూచించాం. ‍‍ రాష్ట్రపతి ఎన్నికల్లో అనవసరమైన గందరగోళం చోటు చేసుకొంది. మళ్లీ అటువంటి పరిస్థితికి తావు లేకుండా ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా, సాఫీగా జరగాలంటే ముందుగా ఎన్‌టిఆర్‌తో మాట్లాడటం మంచిదని సూచించాం. పీవీ.. ఎన్‌టిఆర్‌కు ఫోన్ చేసి ‘రామారావు గారూ, మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరు హైదరాబాద్‌లో కూర్చుంటే ఎట్లా, ఉపరాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించాలి. రేపు ఉదయం విమానంలో ఢిల్లీ రండి. విమానాశ్రయం నుంచి నేరుగా మా నివాసానికి అల్పాహార విందుకు రావాలి’ అని ఆహ్వానించారు. పీవీ ఆహ్వానం మేరకు ఎన్‌టిఆర్‌ ఉదయం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఆ చర్చల్లో కెఆర్‌ నారాయణన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. 7–రైసీనా రోడ్‌లో మింటే పద్మనాభం నివాసంలో ఎన్‌టిఆర్‌ విడిది చేశారు. అక్కడ విలేఖరులతో కె.ఆర్‌ నారాయణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసినట్లు ఎన్‌టిఆర్‌ ప్రకటించారు. ‘నేను ఇంకా మా పార్టీలోను, మిగిలిన పార్టీలతోనూ చర్చించి ఏకాభిప్రాయం సాధించాలి. ఇవి పూర్తికాక ముందే ఈ పెద్ద మనిషి ఏమిటి ఇలా అభ్యర్థిని ప్రకటించారని’ పీవీ విస్తుపోయారు. అంతకుముందు కేరళకు చెందిన ఉన్నత విద్యావంతుడు కెఆర్‌ నారాయ ణన్‌ను ఉపరాష్ట్రపతిగా పరిశీలిస్తున్నట్లు ప్రధాని పీవీ... ఎన్‌టిఆర్‌ దృష్టికి తెచ్చారు. ప్రతిపక్షాలు సహకరించాలని పీవీ చేసిన అభ్యర్థనను ఎన్‌టిఆర్‌ అంగీకరించారు. ఆ తరువాత ప్రెస్‌ మీట్‌ పెట్టి ఉపరాష్ట్రపతిగా కె.ఆర్‌ నారాయణన్ పోటీ చేస్తున్నట్లు ఎన్‌టిఆర్ ప్రకటించారు. లోక్‌సభ, రాజ్యసభల్లోని 713 ఓట్లల్లో జోగేందర్‌ సింగ్‌కు ఒకే ఓటు వచ్చింది. దీంతో నారాయణన్ భారీ ఆధిక్యతతో ఎన్నికయ్యారు.


2017లో ఉపరాష్ట్రపతి పదవికి తన పేరు పరిశీలనకు వచ్చినప్పుడు వెంకయ్య నాయుడు అంతగా సుముఖత చూపలేదు. అప్పట్లో నేను ఐదారుసార్లు ఫోన్ చేసి రాష్ట్రపతి కావటానికి తొలిమెట్టు ఉపరాష్ట్రపతి పదవి కనుక దానిని అంగీకరించాలని సూచించాను. గతంలో సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్‌ హుస్సేన్, వివి గిరి, ఆర్‌. వెంకట్రామన్, శంకర్ దయాళ్‌ శర్మ, కె.ఆర్‌ నారాయణన్‌లు ఉపరాష్ట్రపతులుగా చేసి రాష్ట్రపతులుగా పదోన్నతులు పొందారు కనుక ఆ పరంపరలో మీకూ రాష్ట్రపతిగా అవకాశం వస్తుందని చెప్పాను. మరలా ఎటుతిరిగీ భారతీయ జనతాపార్టీ అధికారాన్ని నిలబెట్టుకొంటుంది కనుక మీకు ఖాయంగా రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నాను. నీలం సంజీవరెడ్డి తరువాత మరలా 40 ఏళ్ళకు ఒక తెలుగువాడు రాష్ట్రపతి అయ్యే అవకాశాన్ని జారవిడవవద్దని కోరాను. ఉపరాష్ట్రపతి రాజ్యసభ అధ్యక్షునిగా సభను నిర్వహించాలి. రాజ్యసభ అధ్యక్షుడు కుర్చీలో కూర్చొనివుంటే ప్రధానితో సహా అందరూ కింద ఉంటారు. రాజ్యసభ అధ్యక్షుడు కాకితో కబురుచేస్తే ప్రధానితో సహా ఏ మంత్రి అయినా, ఏ అధికారి అయినా స్వయంగా వెళ్ళి ఉపరాష్ట్రపతిని కలవాలి. అంతేకాని ఎవరివద్దకూ ఉపరాష్ట్రపతి వెళ్ళే పని ఉండదు అని నాతోపాటు అనేక మంది మిత్రులు, శ్రేయోభిలాషుల సూచనల మేరకు వెంకయ్య అప్పట్లో అంగీకరించారు. ఐదేళ్ళు ఉపరాష్ట్రపతిగా రాజ్యసభను సక్రమంగా నిర్వహించారు. 


రాజ్యసభ అనేది ఎగువసభ. ఎగువసభగా ఉన్న రాజ్యసభ దిగువసభలో చోటుచేసుకొన్న వేడి, ఉద్రేకాన్ని తగ్గించటానికి ఉపయోగపడుతుంది. వేడిగా ఉండే టీని చల్లార్చటానికి సాసరు మాదిరిగా, దిగువసభ అయిన లోక్‌సభలో చోటుచేసుకొనే ఉద్రిక్తతను, వేడిని చల్లారుస్తుంది. లోక్‌సభకు పని ఒత్తిడి తగ్గించటానికి రాజ్యసభను ఏర్పాటు చేశారు. అనుభవజ్ఞులు, మేధావులను నామినేషన్ ద్వారా రాజ్యసభకు ఎంపికచేసే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది. అంతేగాక ఆయా పార్టీల నిర్మాణంలో ప్రజారంగంలో సేవచేసిన వారికి అన్ని అర్హతలు ఉండి, అవకాశాలు రానివారి అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి రాజ్యసభలో అవకాశం కల్పించటం రివాజు. రాజ్యసభ అనేది కేవలం ఎగువసభే కాకుండా రాష్ట్రాల మండలి. ఆయా రాష్ట్రాలలో ఉన్న ప్రత్యేక పరిస్థితులను అది ప్రతిబింబిస్తుంది. ఉపరాష్ట్రపతి పదవీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించిన వెంకయ్య నాయుడు రాష్ట్రపతిగా ఎన్నిక కావాలని దేశ ప్రజలందరూ ఆశిస్తున్నారు. 

డాక్టర్‌ యలమంచిలి శివాజీ

రాజ్యసభ మాజీసభ్యుడు

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.