బార్‌లను తలపిస్తున్న వైన్‌ షాపులు

ABN , First Publish Date - 2022-10-01T05:30:00+05:30 IST

జిల్లాలోని రిటైల్‌ మద్యంషాపుల్లో ఏర్పాటుచేసిన పర్మిట్‌ రూములు బార్‌లను తలపిస్తున్నాయి.

బార్‌లను తలపిస్తున్న వైన్‌ షాపులు
పెద్దపల్లి బస్టాండ్‌ వద్ద గల ఒక వైన్‌షాపు వద్ద బార్‌ను తలపిస్తున్న పర్మిట్‌ రూము(ఫైల్‌)

- నిబంధనలకు తిలోదకాలు

- పట్టించుకోని ఎక్సైజ్‌ అధికారులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలోని రిటైల్‌ మద్యంషాపుల్లో ఏర్పాటుచేసిన పర్మిట్‌ రూములు బార్‌లను తలపిస్తున్నాయి. నిబంధనలను గాలికి వదిలేసి పెద్దపెద్ద రేకుల షెడ్లు వేసి బెంచీలు, టేబుళ్లు వేసి యథేచ్ఛగా సిట్టింగులను నడిపిస్తున్నా కూడా ఎక్సైజ్‌ శాఖాధికారులు పట్టించుకోవడం లేదు. ఆయా వైన్‌ షాపుల పక్కన, వెనుకాల నివాసగృహాలు ఉన్నా కూడా పర్మిట్‌ రూములను నడిపిస్తున్నారు. నిర్ణీత కొలతల ప్రకారం ఒక చిన్న గదిలో మాత్రమే పర్మిట్‌ రూములను నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో ఎలాంటి బెంచీలు గానీ, టేబుళ్లు గానీ వేయకుండా నిర్వహించాలి. కేవలం గ్లాసులు, మందు సీసాలు పెట్టుకునేందుకు మాత్రమే వాల్‌ చెక్కలు వేయాలి. కానీ ఒక్కో వైన్‌షాపు యజమాని పెద్దపెద్ద షెడ్లను ఏర్పాటు చేసి సిట్టింగులను నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖాధికారులతో కుమ్మక్కై బార్లను తలపించేలా పర్మిట్‌ రూములను నిర్వహిస్తున్నారు. సాయంత్రం అయ్యిందంటే చాలా వైన్‌షాపుల పర్మిట్‌ రూములు బార్‌లను తలపిస్తున్నాయి. 

జిల్లాలో 76 మద్యం షాపులు..

జిల్లాలో మొత్తం 76 మద్యం షాపులు ఉన్నాయి. మూడు మాసాల క్రితం వాటికి టెండర్లు నిర్వహించారు. ప్రతి వైన్‌షాపునకు ఒక పర్మిట్‌ రూం తప్పనిసరి. ఇందుకోసం ఏడాదికి 2లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. గోదావరిఖని, రామగుండం, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ పట్టణాల్లో బార్లు ఉన్నాయి. ధర్మారం, అంతర్గాం, పాలకుర్తి, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్‌, కాల్వశ్రీరాంపూర్‌, ఓదెల, ఎలిగేడు, జూలపల్లి మండలాల్లో బార్లు లేవు. పట్టణ ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై ఉండే పలు వైన్‌ షాపులు, గల్లీల్లో ఉండే కొన్ని షాపుల్లో విచ్చలవిడిగా సిట్టింగులను నిర్వహిస్తున్నారు. మండలాలు, పట్టణాల్లో ఉన్నటువంటి వైన్‌షాపుల్లో పర్మిట్‌ రూములను బార్ల మాదిరిగానే నిర్వహిస్తున్నారు. మద్యంప్రియులకు కావాల్సిన తినుబండారాలు, వాటర్‌పాకెట్లు, వాటర్‌బాటిళ్లు, గ్లాసులు ఏర్పాటు చేసి సిట్టింగులను నిర్వహిస్తున్నారు. ఈ సిట్టింగుల వల్ల మద్యంప్రియులు విచ్చలవిడిగా మద్యం సేవిస్తున్నారు. తర్వాత ప్రమాదాలకు గురవుతున్నారు. కొన్ని మండలాల్లో వైన్‌షాపుల పక్కన, వెనుకాల నిర్వహించే పర్మిట్‌ రూములకు ఆనుకునే నివాసగృహాలు ఉన్నాయి. ఈ పర్మిట్‌ రూముల్లో సిట్టింగులను నిర్వహించడం వల్ల ఆయా గృహాల్లో నివసించే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆదాయమే లక్ష్యంగా వైన్‌ షాపులకు టార్గెట్లు విధిస్తున్న ఎక్సైజ్‌ శాఖాధికారులు నిబంధనలను పాటిస్తున్నారా, లేదా అనే విషయమై తనిఖీలు చేయడం లేదు. వైన్‌ షాపుల యజమానులు నెలనెలా ఇచ్చే మామూళ్లు తీసుకుని అటువైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొన్నిచోట్ల వైన్‌షాపుల యజమానులు సమయపాలన పాటించడం లేదు. ఇష్టారాజ్యంగా వైన్‌షాపులను నడిపిస్తున్నా కూడా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా జిల్లా ఎక్సైజ్‌ శాఖాధికారులు స్పందించి వైన్‌ షాపుల్లో పర్మిట్‌ రూములను తనిఖీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నివాస గృహాల పక్కన నిర్వహిస్తున్న పర్మిట్‌ రూములను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2022-10-01T05:30:00+05:30 IST