రఫా@ 14

ABN , First Publish Date - 2022-06-06T10:13:57+05:30 IST

మట్టి కోర్టు మొనగాడు రఫెల్‌ నడాల్‌ మరోసారి దుమ్మురేపాడు. అనితర సాధ్యం అనే రీతిలో 14వసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను ముద్దాడాడు.

రఫా@  14

ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేత

టైటిల్‌ ఫైట్‌లో రూడ్‌ చిత్తు

నడాల్‌ ఖాతాలో 22వ గ్రాండ్‌స్లామ్‌


ప్రైజ్‌మనీ

నడాల్‌కు రూ. 18.30 కోట్లు

కాస్పర్‌ రూడ్‌కు రూ. 9.15 కోట్లు


వయసు మీదపడుతుంది.. ఫిట్‌నెస్‌ సమస్యలు వెంటాడుతున్నాయి.. ఆటలో మునుపటి వేగం లేదు.. డిఫెండింగ్‌ చాంప్‌ జొకోవిచ్‌ ఒకవైపు.. మరోవైపు జోరు మీదున్న కొత్త కుర్రాళ్లు.. వెరసి ఈసారి స్పెయిల్‌ బుల్‌ రఫాకు కష్టమే..! ఫ్రెంచ్‌ ఓపెన్‌ ముందు రఫాను ఉద్దేశించి విశ్లేషకులు చేసిన కామెంట్లు..! కానీ, అవన్నీ పటాపంచలయ్యాయి. ఇది నా అడ్డా అన్నట్టుగా నడాల్‌..  రికార్డుస్థాయిలో 14వ సారి మట్టి కోర్టులో విజయనాదం చేశాడు. తుది పోరులో ప్రత్యర్థి రూడ్‌ను మట్టికరిపించిన నడాల్‌.. ఓపెన్‌ ఎరాలో పురుషుల్లో అత్యధికంగా 22 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఏకైక ఆటగాడిగా మరో మెట్టెక్కాడు..! 


పారిస్‌: మట్టి కోర్టు మొనగాడు రఫెల్‌ నడాల్‌ మరోసారి దుమ్మురేపాడు. అనితర సాధ్యం అనే రీతిలో 14వసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను ముద్దాడాడు. ఫైనల్‌ చేరిన ప్రతీసారి టైటిల్‌తోనే వెనుదిరిగాడు. నార్వే ప్రత్యర్థి, 8వ సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ చేరినా.. అతడు ప్రదర్శించిన ఆట చూస్తే నడాల్‌కు విజయం అంత సులువుగా దక్కదనిపించింది. కానీ, తుది పోరు ఆరంభమైన తర్వాత అవన్నీ ఉత్తవే అని తేలిపోయింది. యథావిధిగా నడాల్‌ జోరు.. ప్రత్యర్థి బేజారు అన్నట్టుగా మ్యాచ్‌ పూర్తిగా ఏకపక్షమైంది. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ఐదో సీడ్‌ నడాల్‌ 6-3, 6-3, 6-0తో కాస్పర్‌ రూడ్‌పై వరుస సెట్లలో అలవోకగా నెగ్గాడు. 


వార్‌ వన్‌సైడే:

రెండు గంటల 8 నిమిషాలపాటు సాగిన పోరులో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ చేరిన రూడ్‌.. నడాల్‌ జోరు ముందు నిలవలేక పోయాడు. క్వార్టర్స్‌లో డిఫెండింగ్‌ చాంప్‌ నొవాక్‌ జొకోవిచ్‌ను సులువుగానే ఓడించినా.. సెమీ్‌సలో జెర్వెవ్‌తో పోరులో రఫా చెమటోడ్చాడు. కానీ, టైటిల్‌ పోరులో మాత్రం చాలా కూల్‌గా తనపని తాను చేసుకెళ్లాడు. తొలి సెట్‌ నాలుగో గేమ్‌లో రూడ్‌ సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన నడాల్‌ 3-1తో ముందంజ వేశాడు. ఆ తర్వాత గేముల్లో సర్వీ్‌సను నిలబెట్టుకున్న రఫా.. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా 6-3తో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే, రెండో సెట్‌లో పుంజుకొన్న రూడ్‌.. నడాల్‌ను నిలువరించే ప్రయత్నం చేశాడు.


అవును ...ఇది 

నడాల్‌ ఓపెన్‌

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం):  ఫ్రెంచ్‌ ఓపెన్‌.. రఫెల్‌ నడాల్‌. దశాబ్దానికి పైగా ఈ రెండు పేర్ల మధ్య విడదీయరాని అనుబంధం. ఎర్ర మట్టిలో రాకెట్‌ చేతపట్టి బరిలోకి దిగాడంటే తుది సమరం వరకు అలుపు లేకుండా జైత్రయాత్ర సాగిస్తుంటాడు. లేకపోతే ఏంటి.. ఒకటా, రెండా ఏకంగా 14 ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లు గెలిచాడంటే స్పెయిన్‌ బుల్‌ ఈ కోర్టులో ఎలా రంకెలు వేస్తున్నాడో అర్థమవుతుంది. గత 18 ఏళ్లలోనే ఇవన్నీ సాధించడం మరో విశేషం. ముఖ్యంగా ఫైనల్లో నడాల్‌ ఉన్నాడంటే.. ప్రత్యర్థి తన ఓటమికి మానసికంగా సిద్ధం కావాల్సిందే.


ఎందుకంటే నడాల్‌ ఇప్పటివరకు 14 సార్లు ఫైనల్‌కు వస్తే ఏనాడూ ఓడిపోలేదు. అందుకే ఈ గ్రాండ్‌స్లామ్‌ను ‘నడాల్‌ ఓపెన్‌’గా పిలిస్తే బావుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. 19 ఏళ్ల వయస్సులో టీనేజర్‌గా తొలిసారి క్లే కోర్టులో జెండా ఎగురవేసిన నడాల్‌ వయస్సు ఇప్పుడు 36. అయినా ఇప్పటికీఅదే ఉత్సాహం.. అదే కసి. రొలాండ్‌ గారోస్‌ నా అడ్డా అంటూ ఇక్కడ ఆడిన 115 మ్యాచ్‌ల్లో 112 విజయాలను సాధించిన ధీరుడు. రెండో స్థానంలో ఉన్న బోర్న్‌ బోర్గ్‌ దగ్గర ఆరు ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లే ఉండడం గమనార్హం. 2005లో తొలి టైటిల్‌ సాధించాక వరుసగా నాలుగుసార్లు విజేతగా నిలిచాడు. అలాగే 2010 నుంచి వరుసగా ఐదు టైటిళ్లు, 2017 నుంచి వరుసగా నాలుగు టైటిళ్లతో దుమ్ము రేపాడు.


ఫేవరెట్‌ను కాదన్నాడు..

పక్కటెముక గాయంతో ఆరు నెలలపాటు టెన్నిస్‌కు దూరమైన నడాల్‌.. ఈ ఫ్రెంచ్‌ ఓపెన్‌కు ముందు జరిగిన ఇటాలియన్‌ ఓపెన్‌లోనూ పాదం గాయంతో బాధపడినట్టు కనిపించాడు. దీంతో మూడో రౌండ్‌లోనే వెనుదిరిగాడు. అలాగే ఈ ఏడాది అతడి ఖాతాలో ఒక్క క్లే కోర్టు టైటిల్‌ కూడా లేదు. అందుకే టోర్నీకి ముందు తాను ఫేవరెట్‌గా భావించడం లేదని స్పష్టం చేశాడు. కానీ ఎర్ర మట్టి మాత్రం అతడిని అక్కున చేర్చుకుని ఎక్కువ వయస్సులో రికార్డు టైటిల్‌ను సాధించిన ఘనత దక్కేలా చేసింది. అతడి అపార అనుభవం ముందు 23 ఏళ్ల రూడ్‌ ఏమాత్రం నిలువలేక టైటిల్‌ అప్పగించేశాడు. ఇప్పటికే పురుషుల టెన్ని్‌సలో అత్యధికంగా 22 గ్రాండ్‌స్లామ్స్‌తో సమకాలీన ఫెడరర్‌, జొకోవిచ్‌లను అందకుండా దూసుకెళుతున్నాడు. 


నాలుగో గేమ్‌లో పవర్‌ఫుల్‌ రిటర్న్‌లతో స్పెయిన్‌ ఆటగాడికి ఝలక్‌ ఇచ్చిన రూడ్‌ 3-1తో పైచేయి సాధించాడు. కానీ, పట్టువీడని నడాల్‌..వరుసగా ఐదు గేమ్‌లు నెగ్గి 6-3తో రెండో సెట్‌ను దక్కించుకున్నాడు. ఇక, మూడో సెట్‌లో రూడ్‌ పూర్తిగా డీలా పడడంతో.. నడాల్‌కు ఎదురులేకుండా పోయింది. రెండో గేమ్‌లోనే సర్వీస్‌ కోల్పోయిన కాస్పర్‌..  మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకున్నాడు. దీంతో వరుసగా ఐదు గేమ్‌లు గెలిచిన రఫా 5-0తో నిలిచాడు. ఇక, ఆరో గేమ్‌లో 40-30 నిలిచిన నడాల్‌.. విన్నర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. చేతులతో ముఖాన్ని దాచి కొంత భావోద్వేగానికి గురయ్యాడు. ఈ మ్యాచ్‌లో నడాల్‌ ఒక్క ఏస్‌ మాత్రమే సంధించాడు.  


రోలాండ్‌ గారోస్‌లో టైటిల్‌ నెగ్గిన పెద్ద వయస్కుడిగా 36 ఏళ్ల నడాల్‌ 

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరుసగా నెగ్గడం రఫా కెరీర్‌లో ఇదే తొలిసారి. 

Updated Date - 2022-06-06T10:13:57+05:30 IST